Bandi Sanjay: తప్పులో కాలేసిన బండి సంజయ్.. అంతమాట అనేశారేంటి?

ABN , First Publish Date - 2023-02-24T17:53:44+05:30 IST

రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తప్పులు దొర్లడం కొత్తమీ కాదు. ఒక మాట బదులు మరొక మాటని నాలుక కరుచుకున్న పొలిటీషియన్స్ ఎందరో ఉన్నారు...

Bandi Sanjay: తప్పులో కాలేసిన బండి సంజయ్.. అంతమాట అనేశారేంటి?

హైదరాబాద్: రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తప్పులు దొర్లడం కొత్తేమీ కాదు. ఒక మాట బదులు మరొక మాటని నాలుక కరుచుకున్న పొలిటీషియన్స్ ఎందరో ఉన్నారు. జరిగిన పొరపాటు చిన్నదే అయితే జనాలు నాలుగు రోజులు నవ్వి ఊరుకుంటారు. ఇక ప్రత్యర్థి పార్టీల నేతలు కొన్ని రోజులపాటు విమర్శించి ఊరుకుంటారు. కానీ పూర్తిగా అర్థం మారిపోయేలా మాట్లాడితే మాత్రం అభాసుపాలవ్వాల్సి ఉంటుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి (Bandi Sanjay) అచ్చంగా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతి (Warangal preethi Issue) ఆత్మహత్యాయత్నం ఘటనపై మాట్లాడుతూ.. ఆమె బ్రతికే ఉండగా ప్రాణం పోయిందంటూ బండి సంజయ్ తప్పులో కాలేశారు. ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నంలో ప్రీతి చనిపోయిందని మాట్లాడారాయన. ప్రీతి చనిపోయినందు వల్ల ఆ కుటుంబం బాధపడుతోందని అన్నారు. ఇది వంద శాతం లవ్ జిహాద్ కేసేనని, తెలంగాణలో ఇలాంటి కేసులు అడ్డగోలుగా మొదలయ్యాయని, హిందూ మతానికి సంబంధించిన అమ్మాయిలను వేధిస్తున్నారని అన్నారు. మాయ మాటలతో అమ్మాయిలను మోసం చేస్తున్నారని అనేక రోజులుగా బీజేపీ (BJP) చెబుతోందని, ఇలాంటి కార్యక్రమాలకు ఇతర దేశాల నుంచి నిధులు వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించలేదని బండి సంజయ్ మండిపడ్డారు. బండి సంజయ్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

వాస్తవానికి బండి సంజయ్ చెప్పినట్లు ప్రీతి చనిపోలేదు. ప్రీతి చావుబతుకుల మధ్య నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. హైదరాబాద్‌ నిమ్స్‌లో ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందుతోంది. న్యూరాలజీ, జనరల్‌ ఫిజీషియన్‌, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నది. డాక్టర్‌ ప్రీతిని తమ దగ్గరకు తీసుకొచ్చేప్పటికే పలు అవయవాలు పనిచేయడం లేదని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ.. ఈ విషయంపై అవగాహన లేకనే లేక పొరపాటునో ప్రీతి చనిపోయిందని బండి సంజయ్ మాట్లాడడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఇందుకు సంబంధించిన సంజయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాస్త తెలుసుకొని అవగాహనతో మాట్లాడాలంటూ పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్ కాస్త చూసుకొని మాట్లాడాలని ఓ యూజర్ చురకంటించాడు.

Updated Date - 2023-02-24T18:53:44+05:30 IST