Telangana : అప్పులను గణాంకాలతో వివరించిన కేంద్రం
ABN , First Publish Date - 2023-02-13T13:54:32+05:30 IST
తెలంగాణ అప్పుల బాగోతం వింటే ఆశ్చర్యపోక తప్పదు. ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఈ విషయాన్ని గణాంకాలతో సహా కేంద్రం వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏ ఏటికాఏడు పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది.
ఢిల్లీ : తెలంగాణ (Telangana) అప్పులు రూ.8 కోట్ల నుంచి 38 కోట్లకు చేరిపోాయాయి. ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఈ విషయాన్ని గణాంకాలతో సహా కేంద్రం (Central Government) వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం (State Government) చేస్తున్న అప్పులు ఏ ఏటికాఏడు పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. 2022 అక్టోబర్ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు... రూ. 4,33,817.6 కోట్లు ఉన్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. ఈ అప్పు ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే చేసింది కాదండోయ్.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపి చేసిన అప్పు అని కేంద్రం స్పష్టం చేసింది. నిజానికి తెలంగాణ ఆవిష్కరణ జరిగే నాటికి రూ. 75,577 కోట్ల అప్పులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇప్పుడు ఆ అప్పులు రూ. 2,83,452 కోట్లకు చేరాయట. కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అడిగిన ప్రశ్నకు లోకసభలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chowdary) లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
తెలంగాణ వచ్చిన నాటి నుంచి 2022 వరకూ అప్పులు..
2014-15లో రూ. 8,121 కోట్లు
2015-16లో రూ. 15,515 కోట్లు
2016-17లో రూ. 30,319 కోట్లు
2017-18లో రూ. 22,658 కోట్లు
2018-19లో రూ. 23,091 కోట్లు
2019-20లో రూ. 30,577 కోట్లు
2020-21లో రూ. 38,161 కోట్లు
2021-22లో రూ. 39,433 కోట్లు
ఇవి మాత్రమే కాకుండా... రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్ధిక శాఖకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నివేదించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, ఇతర కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు... రూ. 1,50,365.60 కోట్లకు చేరినట్టు వివరాల్లో కేంద్రం పేర్కొంది. 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు... రూ. 1,30,365.60 కోట్లకు చేరాయి. రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 8,871 కోట్లు మంజూరు కాగా... రూ. 7,144 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. వేర్ హౌస్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్ నుంచి రూ. 972 కోట్లు మంజూరు కాగా... రూ. 852 కోట్లు విడుదల చేశామని, ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ నుంచి 2015-16, 2016-17లో రూ. 28 కోట్లు మంజూరు కాగా... రూ. 10 కోట్లు విడుదల అయ్యాయని నాబార్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్ డవలప్‌మెంట్ అసిస్టెన్స్ నుంచి.. వివిధ పథకాల అమలు కోసం... రూ. 14,516.65 కోట్లు మంజూరు కాగా... ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వినియోగించుకున్నట్లు కేంద్రం తెలిపింది.