TS News: ఉమ్మడి నల్లగొండలో తగ్గని ఉష్ణోగ్రతలు

ABN , First Publish Date - 2023-06-01T20:58:42+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురువారం ఉదయం వాతావరణం చల్లబడినా మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత పెరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం లక్కవరం రహదారిలో

TS News: ఉమ్మడి నల్లగొండలో తగ్గని ఉష్ణోగ్రతలు

నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురువారం ఉదయం వాతావరణం చల్లబడినా మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత పెరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం లక్కవరం రహదారిలో అత్యధికంగా 45.2, అత్యల్పంగా తిరుమలగిరిలో 39.3 డిగ్రీలు, నల్లగొండ జిల్లా కేతేపల్లిలో అత్యధికంగా 44.5, అత్యల్పంగా మర్రిగూడలో 37.3, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో అత్యధికంగా 42.0, అత్యల్పంగా ఆలేరు మండలం షారాజీపేటలో 38.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

ఈదురుగాలులు.. వడగండ్లు

మోత్కూరు మండలంలో సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. శనగ గింజల పరిమాణంలో వడగండ్లు పడ్డాయి. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మోత్కూరులో పాత పశువైద్యశాల ముందున్న 60ఏళ్లకు పైబడిన వేపచెట్టు కూలింది. అక్కడే ఉన్న విద్యుత్‌ స్తంభంతో పాటు తహసీల్దార్‌ కార్యాలయంలో ఒకటి, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆవరణలో రెండు విద్యుత్‌ స్థంభాలు, రెండు చెట్లు విరిగిపోవటంతో, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పోతాయగడ్డలో టంగుటూరి వెంకన్న ఇంటి పైకప్పు(రేకులు) పూర్తిగా ఎగిరిపోయాయి. మామిడి, నిమ్మ కాయలు తోటలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా వర్షానికి మోత్కూరు మండలంలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంరాశులు, తూకం వేసిన బస్తాలు తడిశాయి.

వడదెబ్బతో ‘ఉపాధి’ కూలీ మృతి

వడదెబ్బతో సూర్యాపేట జిల్లాలో ఉపాధి హామీ కూలీ మృతి చెందింది. కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన కొండ పుల్లమ్మ(41) రెండు రోజుల కిందట ఉపాధిహామీ పనులకు వెళ్లింది. తీవ్ర ఎండలతో అస్వస్థతకు గురైన ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - 2023-06-01T20:58:42+05:30 IST