Big Breaking : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు.. థాయ్ కోర్టు ఫైన్ ఎంత వేసిందంటే..
ABN , First Publish Date - 2023-05-02T17:11:47+05:30 IST
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్‌కు (Casino King Chikoti Praveen Kumar) బెయిల్ మంజూరైంది. థాయిలాండ్‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా...
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్‌కు (Casino King Chikoti Praveen Kumar) బెయిల్ మంజూరైంది. థాయిలాండ్‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా ప్రవీణ్, ఆయనతో పాటు 83 మంది భారతీయులను పటాయ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నిందితులను థాయ్ కోర్టులో (Thailand Court) టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రవేశపెట్టగా అందరికీ షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. 4500 రూపాయిలు ఫైన్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంతవరకూ నిందితుల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించగా.. గంట వ్యవధిలోనే ఫైన్ చెల్లించడంతో వాటిని తిరిగిచ్చేశారు. కాగా ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం చికోటి ప్రవీణ్ థాయిలాండ్ నుంచి హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది..?
కాగా.. క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ సోమవారం నాడు థాయిలాండ్‌లో అరెస్టయిన సంగతి తెలిసిందే. బాంగ్ లాముంగ్ జిల్లాలోని ఆసియా పట్టాయా హోటల్‌లో ఓ 4-స్టార్ హోటల్‌లో క్యాసినో, జూదం నిర్వహిస్తుండగా.. ఉప్పందుకున్న థాయ్‌లాండ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి.. చీకోటి ప్రవీణ్, అతని అనుచరుడు మాధవరెడ్డి, మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి సహా 87 మంది భారతీయులను అరెస్టు చేశారు. ఇతర దేశాలకు చెందిన వారితో కలిపి మొత్తం 100 మందికి పైగా అరెస్టు చేయగా.. వీరిలో 19 మంది యువతులున్నారు.సియా పట్టాయ స్టార్ హోటల్‌లో భారతీయ ముఠా ఒకటి జూదం నిర్వహిస్తోందని థాయ్ నిఘా సంస్థ ద్వారా అక్కడి పోలీసులకు ఉప్పందింది. గత నెల 27న మకాం వేసినట్లు తెలిసినప్పటి నుంచి మేజర్ జనరల్ కాంపోల్ లీలా ప్రపాపర్న్, పట్టాయా సిటీ పోలీస్ కమిషనర్ చోన్బురీ, లెఫ్టినెంట్ కల్నల్ శాంతి కోర్కాసెమ్, లెఫ్టినెంట్ కల్నల్ థానోపాంగ్ ఫోతీ, ఇమిగ్రేషన్ విభాగం అధికారులు నిఘా పెట్టారు.
కోట్లు పట్టుబడ్డాయ్..!
జూదం, క్యాసినో కొనసాగుతున్న తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ.. జూద నిర్వాహకులు, జూదగాళ్లు భారత్‌కు తిరిగి వెళ్లే రోజున దాడి చేయాలని పక్కాగా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సోమవారం ఉదయం జూదగాళ్లు, నిర్వాహకులు భారత్‌కు తిరిగి వెళ్లనుండడంతో.. ఆదివారం అర్ధరాత్రి దాటాక ‘ఆపరేషన్’ను ప్రారంభించారు. పైన పేర్కొన్న ఉన్నతాధికారులతోపాటు.. 100 మందికి పైగా పట్టాయ పోలీసులు ఏడంతస్తుల ఆ స్టార్‌హోటల్‌ను చుట్టు ముట్టారు. హోటల్‌లో మొత్తం 300 గదులు ఉండగా.. భారతీయులు, జూదగాళ్లు దిగిన గదులతోపాటు.. జూదం నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్ హాల్‌లో దాడులు జరిపారు. పోలీసులను చూడగానే జూదగాళ్లు ఎక్కడికక్కడ పారిపోవడానికి ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. ఈ హోటల్ నుంచి 6 బాకరాట్ టేబుళ్లు, 4 పేకాట టేబుళ్లు, ఆన్‌లైన్‌లో భారతీయులు జూదంలో పాల్గొనేలా లైవ్‌కాస్ట్‌కు ఉపయోగిస్తున్న 8 సీసీ కెమెరాలు, రూ. 20 కోట్లు విలువ చేసే క్యాష్ ఎక్స్‌చేంజ్ చిప్స్, 87 సెల్‌ఫోన్లు, 363 డెబిట్/క్రెడిట్ కార్డులు, 790 నోట్‌బుక్స్, 92 మనీకౌంటర్ చిట్టీలు, భారత కరెన్సీలో ఉన్న రూ.1.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాం’’ అని థాయ్‌లాండ్ పోలీసులు వెల్లడించారు.