Revanth reddy: కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు అందుకే.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-06-25T14:34:48+05:30 IST
కేసీఆర్ కుర్చీ కదులుతుందనే మంత్రి కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్‌కి వెళ్లారని అన్నారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయన్నారు.
హైదరాబాద్: కేసీఆర్ (CM KCR) కుర్చీ కదులుతుందనే మంత్రి కేటీఆర్ (KTR) ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్‌కి వెళ్లారని అన్నారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయన్నారు. పత్రికల్లో, మీడియాలో రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని ఆరోపించారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌ని ఎవరూ నమ్మరు...
ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. రూ.100 కోట్ల లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌పై విచారణ జరిపిస్తున్న మోదీ.. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను ఎందుకు విచారణ చేయడంలేదు? ప్రశ్నించారు. నిన్న వెళ్లి నడ్డాను, అమిత్ షాను కలిసి వచ్చిన బీజేపీ నాయకులు ఇంకా భ్రమలు పెట్టుకోవద్దని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ, బీఆరెస్‌ది తమరు అనుకుంటే తెగిపోయే బంధం కాదని, ఫెవికాల్ బంధమని ఎద్దేవా చేశారు. ‘‘ మీరు ఎంత కంఠశోష పెట్టుకున్నా మీ మాట ఎవరూ వినరు. తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ వేదికగానే కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి. మీరు ఢిల్లీలో ఎన్ని ప్రదక్షిణలు చేసినా మీకు జవాబు రాదు. తెలంగాణ గల్లీల్లో పర్యటించి కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం. మీరందరూ కూడా కలిసి రండి... మీ ఢిల్లీ బీజేపీ నేతలు, కేసీఆర్ ఒక్కటే.. తెలంగాణను చివరకు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారు. కేసీఆర్‌కు ఇష్టమైన ప్రాంతం దుబాయ్... దోచుకున్న సొమ్ముతో అక్కడికే పారిపోతారు’’ అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.