Revanth Reddy: బీఆర్ఎస్ ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. పాత పేపర్ క్లిప్పింగ్ చూపించి మరీ...

ABN , First Publish Date - 2023-07-17T18:25:52+05:30 IST

24 గంటల ఉచిత విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.16,500 కోట్ల ఖర్చు చూపిస్తోంది. కానీ 24 గంటలు ఇవ్వకుండా 8 నుంచి 11 గంటలే ఇస్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కో విధంగా విద్యుత్ ఇస్తున్నారు. ఆ లెక్కల రూ.8 వేల కోట్ల చిల్లర మాత్రమే విద్యుత్ కొనుగోలుకు ఖర్చవుతుంది. ప్రతి సంవత్సరం రూ.16 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చులు చూపింది. మరి దాదాపు రూ.8 వేల కోట్లు ఎక్కడికి పోతున్నాయని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Revanth Reddy: బీఆర్ఎస్ ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. పాత పేపర్ క్లిప్పింగ్ చూపించి మరీ...

హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోత విధిస్తారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి (Revath reddy) మండిపడ్డారు. ఉచిత విద్యుత్, లాగ్‌బుక్‌పై సీఎండీ ప్రభాకర్ రావు స్వయంగా మాటదాటవేశారంటూ జనవరి 30, 2023 నాటి ఓ పేపర్ క్లిప్పింగ్‌ని రేవంత్ రెడ్డి మీడియా ముందు చూపించారు. ఆ వార్తలోని వివరాలను విలేకరులకు చదివి వినిపించారు. లాగ్‌బుక్‌పై జర్నలిస్టులు ప్రశ్నిస్తే సీఎండీ మాట దాటవేశారని, పంటలు ఎండిపోవడం లేదంటూ సీఎండీ ప్రభాకర్ రావు అన్నారని రేవంత్ ప్రస్తావించారు. వ్యవసాయానికి అవసరమైన మేరకే విద్యుత్ ఇస్తున్నామని, సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తున్నామని, అవసరమైన చోట మాత్రమే 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నామని స్వయంగా సీఎండీనే చెప్పారంటూ బీఆర్ఎస్‌పై ఎదురుదాడికి దిగారు. వ్యవసాయానికి సింగిల్ ఫేజ్ మోటార్లు ఉండవని, 3 ఫేజ్‌ల మోటార్లు ఉంటాయని రేవంత్ అన్నారు. దీనినిబట్టి చాలా స్పష్టంగా వ్యవసాయానికి అవసరమైన మేరకే విద్యుత్‌ని ఇస్తున్నట్టు సీఎండీ ప్రభాకర్ రావే చెప్పారు కదా అని మండిపడ్డారు. అమెరికాలో, తెలంగాణలో తాను ప్రస్తావించింది ఈ విషయాలేనని రేవంత్ అన్నారు.

రూ.8 వేల కోట్లు ఎటుపోతున్నాయ్...

‘‘ 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం.. 20 వేల మిలియన్ యూనిట్లు అంటే 2 వేల కోట్ల యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఇంత విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.16,500 కోట్ల ఖర్చు చూపిస్తోంది. కానీ 24 గంటలు ఇవ్వకుండా 8 నుంచి 11 గంటలే ఇస్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కో విధంగా విద్యుత్ ఇస్తున్నారు. ఆ లెక్కల రూ.8 వేల కోట్ల చిల్లర మాత్రమే విద్యుత్ కొనుగోలుకు ఖర్చవుతుంది. ప్రతి సంవత్సరం రూ.16 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చులు చూపింది. మరి దాదాపు రూ.8 వేల కోట్లు ఎక్కడికి పోతున్నాయి’’ అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 24 గంటల పేరిట ఖర్చు చూపిస్తున్నారు. కానీ ఇవ్వడం లేదు. మరి రూ.8 వేల కోట్లు ఎక్కడికిపోతున్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డిని తిట్టకుండా వారికి తెల్లారడం లేదు.. చీకటవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.

బీఆర్ఎస్ వాళ్లు బరితెగించారు..

తాము 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని, కాంగ్రెస్ వాళ్లు వస్తే అది రద్దవుతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నిరసన తెలపమని, ఆ తర్వాత రైతు వేదికల్లో చర్చ పెట్టాలంటూ బీఆర్ఎస్ వాళ్లు బరితెగించారని రేవంత్ అన్నారు. 3 గంటల కరెంట్ కావాలా? 3 పంటలు కావాలా? అని చర్చించమంటూ పార్టీ రాష్ట్రస్థాయి కార్యక్రమానికి పిలుపునిచ్చిందని విమర్శించారు. ఇన్నాళ్లూ 24 గంటల విద్యుత్ ఇస్తున్నామంటూ బుకాయిస్తూ వచ్చారని, అందుకే ఈ మీడియా సమావేశంలో రెండు ప్రధానాంశాలను వెల్లడిస్తున్నానని వివరణ ఇచ్చారు. 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇవ్వాలంటే 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలన్నారు. ఇక రెండవది.. తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చడానికి కొత్తగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం ద్వారా శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తామని కేసీఆర్ శాసన సభలో పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని రంజింపజేశారని మండిపడ్డారు. 24 గంటల విద్యుత్‌పై, బీఆర్ఎస్ అవినీతిపై ప్రజల్లో చర్చ కొనసాగుతోందని హెచ్చరించారు.

Updated Date - 2023-07-17T18:25:52+05:30 IST