Telangana Rains: మోరంచపల్లి గ్రామస్తులు సేఫ్.. ఎలా బయటపడ్డారంటే..

ABN , First Publish Date - 2023-07-27T15:31:01+05:30 IST

వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాస్థులు సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షాల కారణంగా మోరంచవాగు పొంగిపొర్లడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. గ్రామంలోని ఇళ్లు నీటమునిగాయి. దీంతో అక్కడి ప్రజలు భవనాలపైకి వచ్చి తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. మోరంచపల్లి గ్రామస్తుల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సైతం స్పందించారు.

Telangana Rains: మోరంచపల్లి గ్రామస్తులు సేఫ్.. ఎలా బయటపడ్డారంటే..

జయశంకర్‌ భూపాలపల్లి: వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామస్తులు సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షాల కారణంగా మోరంచవాగు పొంగిపొర్లడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. గ్రామంలోని ఇళ్లు నీటమునిగాయి. దీంతో అక్కడి ప్రజలు భవనాలపైకి ఎక్కి తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. మోరంచపల్లి గ్రామస్తుల పరిస్థితిపై సీఎం కేసీఆర్ స్వయంగా స్పందించారు. హెలికాఫ్టర్ల ద్వారా వారిని రక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అధికార యంత్రాంగం అక్కడకు తరలివెళ్లి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోని ప్రజలందరినీ సేఫ్‌జోన్‌కు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మోరంచపల్లి గ్రామస్తులు అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.


దీనిపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ... పాత వరంగల్ , భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిపారు. మోరంచపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. అక్కడి ప్రజలను సురక్షితంగా కాపాడగలిగామన్నారు. మోరంచపల్లి గ్రామంలో మొత్తం ప్రజలను సేఫ్ జోన్‌కు తరలించామన్నారు. కాటారం మండలంలో నలుగురు నీళ్లలో ఉన్నారని.. వారికోసం బోట్‌లను పంపించామన్నారు. అగ్నిమాపక శాఖ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా అలెర్ట్‌గా ఉన్నారన్నారు. ఇండ్లు, చెట్లు కూలిపోయినా తమ సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. మోరంచపల్లిలో 70 మందిని రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడగలిగినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సెల్ఫీల కోసం ఆరాటపడొద్దన్నారు. ములుగులో ఇలా సెల్ఫీ కోసం వెళ్ళిన వారిని కాపాడేందుకు తమ సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 బోట్‌ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీ వెల్లడించారు.

వరంగల్ టౌన్‌లో కూడా బోట్స్ సహాయంతో లోతట్టు ప్రాంతాల్లో సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. మంథనిలో కూడా ఇసుక క్వారీ వద్ద తొమ్మిది మందిని కాపాడామని.. ఇద్దరిని ఇంకా కాపాడే ప్రయత్నం సాగుతోందన్నారు. హెలికాఫ్టర్ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా 100, 101కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకి రావద్దని.. శుక్రవారం కూడా వర్ష ప్రభావం ఉంటుందని.. అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి సూచించారు.

Updated Date - 2023-07-27T15:41:27+05:30 IST