Kaleshwaram Project: చాలా కాలం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ
ABN , First Publish Date - 2023-07-20T10:02:07+05:30 IST
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది.
జయశంకర్ భూపాలపల్లి: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram Project) జలకళ సంతరించుకుంది. కాళేశ్వరం ప్రధాన పుష్కరఘాట్ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి ఇన్ ఫ్లో, 4,38,880 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,85,030 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే బ్యారేజీ పూర్తి సామర్థ్యం16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 7.646 టీఎంసీలుగా ఉంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బ్యారేజీలోని 57 గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మరోవైపు జిల్లా కేంద్రంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా భూపాలపల్లి సింగరేణి డివిజన్‌లోని కాకతీయ ఖని సెక్టార్-2, 3 ఓపెన్ కాస్ట్ గనుల్లో 7 వేల టన్నుల బోగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 1.63 లక్ష్యల కుబిక్ మీటర్ల మట్టి వెలుకితీతకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా సుమారుగా ఒక కోటిన్నర నష్టం వాటిల్లినట్టు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. అటు వర్షాల కారణంగా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చిచేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.