Drug case: ఎన్నికల ముందు డ్రగ్స్ కేసు హడావుడి ఏంటి..?
ABN , First Publish Date - 2023-06-24T17:08:38+05:30 IST
రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే డ్రగ్స్ కేసులు మస్ట్‌గా మారాయి. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగాయి.
హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే డ్రగ్స్ కేసులు మస్ట్‌గా మారాయి. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ఓ ఏడాది ముందు అంటే 2017లో డ్రగ్ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసును టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది. ఈ కేసులు దర్శకుడు పూరీ జగన్నాథ్, నటీమణులు చార్మీ, రకుల్ ప్రీతిసింగ్, నటుడు రానా, రవితేజతో మరికొందరు ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరితో పాటు రాజకీయ నేతల పేర్లు కూడా వినిపించాయి. ఈ కేసును చేధించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రోజుల తరబడి నిందితులను విచారించింది. కానీ ఇప్పటికీ నిందితులెవరో, దోషులెవరో తేల్చలేకపోయారు. యాదృచ్చికంగా మరో ఆరు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో నిర్మాత కేపీ చౌదరిని గోవాలో ఈ నెల 14న డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత ఆయను పోలీసుల కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులిచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
హీరో సుశాంత్ రెడ్డి ఏం చెప్పారంటే...
ఇప్పుడు చౌదరి చెప్పిన లిస్ట్‌లో హీరో సుశాంత్ రెడ్డి ఉండటం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఫోన్ ద్వారా మీడియా సుశాంత్‌ను పకలరించగా.. ఈ ఆరోపణలను కొట్టిపడేశాడు. తనకు కేపీ చౌదరి ఒక ప్రొడ్యూసర్‌గా మాత్రమే తెలుసన్నాడు. ఆయనను కొన్ని సార్లు కలిశానని.. అప్పుడపుడు కాల్స్ మాట్లాడానని సుశాంత్ తెలిపాడు. మూడేళ్ల నుంచి ఆయనను కలవలేదని వెల్లడించాడు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని సుశాంత్ రెడ్డి స్పష్టం చేశాడు. డ్రగ్స్ పరంగా ఎలాంటి సంబంధం లేదని.. కేపీ చౌదరికి తనకూ మధ్య ఏనాడూ ఆ టాపిక్ కూడా రాలేదని వెల్లడించాడు. ఎలాంటి పరీక్షకైనా తాను సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పాడు. పోలీసుల నుంచి ఎదైనా కాల్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నానని.. ఎలాంటి విచారణకు అయినా తాను సిద్ధమని సుశాంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు.
డ్రగ్స్ కేసులో సినీ లింక్స్‌పై సైబరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాత కేపీ చౌదరి ద్వారా డ్రగ్స్ తీసుకున్న సెలబ్రిటీలను పోలీసులు గుర్తిస్తున్నారు. కేపీ చౌదరి అరెస్ట్ తో సినీ డ్రగ్స్ లింక్స్ తెర మీదకు వచ్చాయి. కేపీ చౌదరి అరెస్ట్‌తో పలువురు సెలబ్రిటీల్లో గుబులు నెలకొంది. రోషన్ అనే డ్రగ్స్ ఫెడ్లర్ విచారణలో కేపీ చౌదరి వ్యవహారం వెలుగు చూసింది. ప్రైవేట్ పార్టీలకు హాజరైన పలువురి ప్రముఖుల ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని ఆధారంగా కేపీ చౌదరి నిర్వహించిన పార్టీలకు హాజరైన సెలబ్రిటీల లిస్ట్‌ను పోలీసులు తయారు చేస్తున్నారు.