Women Voters: ఆ నియోజకవర్గంలో.. మహిళా ఓటర్లే కీలకం.. గెలుపోటములు శాసించేది వారే
ABN , First Publish Date - 2023-10-17T10:37:04+05:30 IST
మల్కాజిగిరి నియోజకవర్గం(Malkajigiri Constituency)లో మహిళా ఓటర్లే కీలకం. అభ్యర్థి గెలుపులో వీరి పాత్రే ఎక్కువ.
అల్వాల్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి నియోజకవర్గం(Malkajigiri Constituency)లో మహిళా ఓటర్లే కీలకం. అభ్యర్థి గెలుపులో వీరి పాత్రే ఎక్కువ. అందుకే మహి ళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీల వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గం మొత్తం జనాభా 6 లక్షల 21 వేల మంది. ఓటర్లు 4,68,822 మంది. వారిలో పురుషులు 2,36,804, మహిళలు 2,32,009 ఉన్నారు. మహిళా ఓటర్లు దాదాపుగా పురుషులతో సమానంగా ఉన్నారు.
2009లో నియోజకవర్గం ఏర్పాటు..
నియోజకవర్గం 20009లో ఏర్పడింది. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల రాజేందర్ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చింతల కనకారెడ్డిపై విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చింతల కనకారెడ్డి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై విజయం సాధించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థి రామచందర్‌రావుపై దాదాపు 74 వేల మెజార్టీతో విజయం సాధించారు.
కాస్మోపాలిటన్ నగరం
నియోజకవర్గానికి కాస్మోపాలిటన్ నగరంగా పేరుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, వైజాగ్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన 70 వేల మంది ఓటర్లున్నారు. రైల్వే ఎంప్లాయీస్ 10 వేల ఓటర్లు ఉన్నారు. యాదవులు 45 వేలు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 30 వేల మంది ఉన్నారు. విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు.