Womens: నేటినుంచి సిటీ, ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఫ్రీ
ABN , First Publish Date - 2023-12-09T08:04:20+05:30 IST
గ్రేటర్‌లో మహిళా ఆర్టీసీ ప్రయాణికులు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలతో శనివారం
- గ్రేటర్‌లో నాలుగు లక్షల మందికి ప్రయోజనం
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో మహిళా ఆర్టీసీ ప్రయాణికులు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలతో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్(City Ordinary, Metro Express) బస్సుల్లో శక్తి స్కీమ్‌లో భాగంగా మహిళలు ఉచిత ప్రయాణ సేవలను అందుబాటులోకి తెస్తునట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థిణులు, థర్డ్ జెండర్‌లు కూడా సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. గ్రేటర్ జోన్‌లో ఆర్టీసీ 2,638 బస్సులను నడుపుతుండగా వాటిలో సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 2,559 వరకు ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు మినహా గ్రేటర్ జోన్‌లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఉచిత సేవలను మహిళలు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. గ్రేటర్‌జోన్ వ్యాప్తంగా 2,600 ఆర్టీసీ బస్సుల్లో రోజూ 18 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుండగా వారిలో 4 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉంటారని ఆర్టీసీ అధికారులు అంచనావేస్తున్నారు. 5 లక్షల మంది ప్రయాణికులు బస్‌పా్‌సలు వినియోగిస్తుండగా వారిలో 2.5-2.7 లక్షల మహిళా ప్రయాణికులు ఉంటారని అధికారులు చెబుతున్నారు.
గ్రేటర్ ఆర్టీసీ సిద్ధం
గ్రేటర్‌జోన్ పరిధిలో మహిళా ప్రయాణికులకు ఉచిత సేవల ప్రారంభం నేపథ్యంలో ముఖ్య కూడళ్లతో పాటు పలు రద్దీ ప్రాంతాల్లోని బస్టాపుల్లో ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించామని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు(Greater RTC ED Venkateshwarlu) తెలిపారు. మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగినా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఆర్టీసీ సిబ్బందితో పాటు కండక్టర్లపై ఉచిత ప్రయాణాలపై ఇప్పటికే పలు సూచనలు చేశాం. ఉచిత ప్రయాణాలతో మరో 5 శాతం మహిళా ప్రయాణికులు పెరిగే అవకాశాలుంటాయని భావిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఈడీ వివరించారు.
గ్రేటర్‌లో మొత్తం బస్సులు 2,638
ఆర్డినరీ బస్సులు 1,653
మెట్రోఎక్స్‌ప్రెస్ బస్సులు 906
ఎలక్ర్టిక్ ఏసీ బస్సులు 65
వజ్ర బస్సులు 14
డిపోలు 25
రోజు తిరిగే కిలో మీటర్లు 7,68,627
రోజు వారి ట్రిప్పులు 30,242
గ్రేటర్‌లో రోజువారి ప్రయాణికులు 18 లక్షలు
మహిళా ప్రయాణికులు సుమారు : 4-5 లక్షలు
నెల వారి బస్ పాస్‌లు మొత్తం 5 లక్షలు,
అందులో మహిళా బస్‌పా్‌సలు 2.7 లక్షలు
రోజు వారి ఆర్టీసీ ఆదాయం రూ.4 కోట్లు
డీజిల్ ఖర్చు రూ. 1.5 కోట్లు
గ్రేటర్‌జోన్ రోజు వారి నష్టం రూ. 87 లక్షలు