YS Sharmila: మహిళల గౌరవానికి భద్రత ఎక్కడ? ప్రభుత్వం తీరు సిగ్గుచేటు..!!
ABN , First Publish Date - 2023-07-20T18:43:58+05:30 IST
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శల వర్షం కురుస్తోంది. ఈ అంశంపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సోషల్ మీడియా ద్వారా ఆవేదన చెందారు. ఈ మేరకు ఆమె ఓ నోట్‌ను పోస్ట్ చేశారు.
మణిపూర్(Manipur)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శల వర్షం కురుస్తోంది. దళిత సంఘాలు, మహిళా సంఘాలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంట్ (Parliament) కూడా దద్దరిల్లింది. మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వెంటనే చర్చ జరగాలని గురువారం ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని (Modi Government) ఇరకాటంలో పెట్టాయి. ఇతర రెగ్యులర్ కార్యకలాపాలను పక్కనబెట్టి ముందుగా ఈ అంశంపైనే చర్చించాలని విపక్ష పార్టీల ఎంపీలు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. తాజాగా ఈ అంశంపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కూడా స్పందించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సోషల్ మీడియా (Social Media) ద్వారా ఆవేదన చెందారు. ఈ మేరకు ఆమె ఓ నోట్‌ను పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Seetakka: 79 రోజుల తర్వాత ప్రధాని మాట్లాడడం బాధాకరం
‘మణిపూర్‌లో మహిళలపై జరిగిన దారుణమైన చర్యను మనం ఖండించకపోతే సిగ్గుతో, అవమానంతో, పరువుతో, తీవ్ర నిరాశతో తలలు దించుకోవాలి. ఈ చర్యకు వ్యతిరేకంగా నిలబడకపోతే మనల్ని మనం మనుషులమని చెప్పుకోవడం మానేద్దాం. మణిపూర్‌లో ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించడం దిగ్భ్రాంతి కలిగించే విషయం. చుట్టుపక్కలవారు ఈ చర్యను ఆపకుండా చూస్తూ ఉండటం కలత చెందేలా చేసింది. ఈ ఘటన మన సమాజానికి మచ్చ. దేశంలో మహిళల గౌరవానికి భద్రత ఎక్కడ. గత రెండు నెలలుగా మణిపూర్‌లో జరుగుతున్న భయానక సంఘటనలను నియంత్రించడంలో అక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలమవడం సిగ్గుచేటు. రేపు ఇలాంటిదే మనకు జరగవచ్చు. అలాంటప్పుడు మనం సైలెంట్‌గా ఉంటామా? ఈ విషయం తెలిసి బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలలో ఉండే మహిళా ప్రతినిధులు ఎలా మౌనంగా ఉన్నారు. వాళ్ల మౌనం నాకు మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. మన కుటుంబంలోని కూతుళ్లు, అక్కాచెల్లెళ్లకు ఇదే జరిగితే గొంతెత్తకుండా తప్పించుకుంటామా?
ఈ పార్టీలు ఎంతకాలం రాజకీయాలు చేస్తూ మహిళల గౌరవాన్ని దెబ్బతీయడానికి పూనుకున్న పోకిరీలకు భద్రత కల్పిస్తాయి? రాజకీయం చేయడం, అధికార దాహంతో వ్యవహరించడం క్షమించరానిది. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ భయంకరమైన సంఘటన పట్ల మహిళలందరికీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని, మణిపూర్ గిరిజనులపై.. ముఖ్యంగా మహిళలపై ఇటువంటి అనాగరిక, హేయమైన చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఒక మహిళగా ప్రభుత్వాలను కోరుతున్నా. ఈ ఘటనకు కారణమైన క్రూరమృగాలను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి గుణపాఠం చెప్పేందుకు న్యాయవ్యవస్థ విధించిన అత్యంత కఠిన శిక్ష వేయాలని కోరుతున్నా’ అంటూ షర్మిల తన పోస్టులో పేర్కొన్నారు.