'Chief Minister Fellows‘ : చీఫ్ మినిస్టర్ ఫెలోస్’!
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:43 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యాలయానికి అనుబంధంగా యువరక్తంతో కొత్త బృందం ఏర్పాటు చేయనున్నారు. వీరికి ‘చీఫ్ మినిస్టర్ ఫెలోస్’ అని పేరు పెట్టారు.
సీఎం కార్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు
ప్రజల నాడి తెలుసుకోవడానికి రాబిన్ శర్మ బృందం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యాలయానికి అనుబంధంగా యువరక్తంతో కొత్త బృందం ఏర్పాటు చేయనున్నారు. వీరికి ‘చీఫ్ మినిస్టర్ ఫెలోస్’ అని పేరు పెట్టారు. పాలనలో సమస్యలు, పథకాల అమలులో లోటుపాట్లు, వాటికి పరిష్కారాలపై అధ్యయనం చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో నేరుగా ముఖ్యమంత్రికి నివేదించడం ఈ బృందం ప్రధాన విధి. టీం తనకు పాలనలో సహాయకారిగా ఉండాలని సీఎం భావిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఇప్పటికే ఇటువంటి బృందాలను ఏర్పాటు చేసుకొన్నారు. గుజరాత్ సీఎంవో కోసం ఐఐఎం అహ్మదాబాద్ తొలుత ఇటువంటి బృందాన్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఈ బృందాల పనితీరును పరిశీలించి రాష్ట్రంలో మరింత మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆశిస్తున్నారు. ‘చీఫ్ మినిస్టర్ ఫెలోస్’ పేరుతో మొత్తం 25మందిని నియమించుకోవాలని నిర్ణయించారు. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ప్రతిభావంతులను ఈ టీం కోసం ఎంపిక చేస్తారు. వీరికి ఆకర్షణీయమైన జీతభత్యాలు ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం ఒక్కొక్కరికి ఒక్కో జిల్లా బాధ్యతలు కేటాయిస్తారు. వచ్చే ఏప్రిల్ నుంచి వీరు రంగంలోకి దిగే అవకాశం ఉంది. సీఎం కార్యాలయం మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బృందం ఉపకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రభుత్వానికి సహాయకారిగా రాబిన్ శర్మ బృందం
గత ఎన్నికల్లో టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన రాబిన్ శర్మ టీం సేవలను ఇకముందు కూడా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకొని సూచనలు, సలహాలు ఇవ్వడానికి కొత్తగా ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల సీఎం ఆయనకు సూచించినట్లు సమాచారం. రాబిన్ టీంలో కీలక సభ్యుడు శంతన్ స్థానంలో నియమితుడైన అనంత్ తివారీ నేతృత్వంలో ఈ కొత్త బృందం ప్రభుత్వానికి సహాయకారిగా పని చేయనుంది. దీనిని పార్టీ తరపున ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది? వివిధ పథకాల విషయంలో ప్రజల్లో సంతృప్త శాతం... జిల్లాల్లో టీడీపీ పనితీరును తెలుసుకోవడంతో పాటు ఇతర పార్టీల కార్యకలాపాల సమాచారం సేకరించి అందచేయడం ఈ బృందం విధి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్నికల వ్యూహకర్తలకు చెందిన సంస్థలతో బృందాలను ఏర్పాటు చేసుకొన్నా వాటివల్ల పెద్దగా ఫలితాలు రాలేదు. వాటి అనుభవాలపై టీడీపీ అధినాయకత్వం అధ్యయనం చేయిస్తోంది. అక్కడ జరిగిన పొరపాట్లు చేయకుండా చూసుకోవాలన్నది దీనివెనుక ఆలోచనగా తెలుస్తోంది.
మంత్రుల వద్ద మరో టీం
రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని మంత్రులందరి వద్ద నియమించనున్నారు. ఎంబీఏ పూర్తిచేసిన తెలుగు యువతను ఎంపిక చేసి ప్రస్తుతం వారికి శిక్షణ ఇప్పిస్తున్నారు. తర్వాత ఒకో మంత్రి వద్ద ఒక్కొక్కరు చొప్పున నియమించాలని నిశ్చయించారు. ఆ శాఖ పరిధిలో విజన్-2047 లక్ష్యాలను సాధించడానికి జిల్లా, మండల స్థాయిలో ప్రణాళికలు రూపొందించడం, అవి అమలయ్యేలా చూడటం వీరి విధి. సదరు శాఖ రోజువారీ విధుల్లో జోక్యం చేసుకోకుండా విజన్ లక్ష్యాలను చేరుకోవడంపైనే వీరు దృష్టిపెట్టి పనిచేస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.