AP Politics 2024 : ఐదేళ్ల అరాచకాలపై ఓటుతో వేటెయ్యండి
ABN , Publish Date - May 13 , 2024 | 02:55 AM
ఒకవైపు బాదుడే బాదుడు! మరోవైపు... బాధలే బాధలు! ఇదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన సాగిన తీరు! నోరెత్తి మాట్లాడాలంటే భయం! ప్రశ్నించాలంటే భయం! ఎదురు తిరిగి మాట్లాడితే కేసులు, అరెస్టులు, లాక్‌పలో చిత్రహింసలు!
ఒకవైపు బాదుడే బాదుడు! మరోవైపు... బాధలే బాధలు! ఇదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన సాగిన తీరు! నోరెత్తి మాట్లాడాలంటే భయం! ప్రశ్నించాలంటే భయం! ఎదురు తిరిగి మాట్లాడితే కేసులు, అరెస్టులు, లాక్‌పలో చిత్రహింసలు! ‘యథారాజా తథా ప్రజా’ అన్నట్లు క్షేత్రస్థాయిలో వైసీపీ శ్రేణుల వీరంగాలు! టీడీపీ సామాన్య కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దాకా బాధితులే! దళిత డాక్టర్ సుధాకర్ నుంచి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరకు పోలీసు హింసను అనుభవించిన వారే! దళితులపై దాడులకు లెక్కేలేదు. మైనారిటీలపై లెక్కలేనన్ని అరాచకాలు! పట్టపగలే బీసీల హత్యలు! అన్నీ జరుగుతున్నా ఏనాడూ నోరెత్తని పాలకులు! పైగా... దాడులు, దౌర్జన్యాలు చేసిన వారికి పదవులిచ్చి ప్రోత్సహించేంత బరి తెగింపు! ఇలాంటి పాలన ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేదు! ఇంత అరాచకం ప్రజాస్వామ్య పాలనలో కనిపించదు! ఈ ఆటవికం ఓటుతో వేటేస్తే తప్ప పోదు!
దళిత డ్రైవర్‌ను చంపేసి..
‘మాకు నచ్చింది చేస్తాం. మాకు నచ్చకపోతే చంపేస్తాం! ఇదిగో డెడ్‌బాడీ’ అనే స్థాయి అరాచకం వైసీపీ పాలనలో రాజ్యమేలింది. 2022 మే 18న అర్ధరాత్రి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కాకినాడ బీచ్‌రోడ్డులో హత్య చేశారు. ఎమ్మెల్సీ తన కారులో స్వయంగా డ్రైవర్ మృతదేహాన్ని అతడి ఇంటికే తీసుకువచ్చారు. బాధితులు నిలదీయడంతో కారు వదిలేసి అక్కడినుంచి అనంతబాబు పారిపోయారు. అనంతబాబు ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చినపుడు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికి మరీ ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతబాబును జగన్ తన పక్కన పెట్టుకుని తిరుగుతూనే ఉన్నారు.
మైనారిటీ కుటుంబం బలి
2020 నవంబరు 3న నంద్యాలలో మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ సలాం తన కుటుంబంతో కలసి ఆత్మహత్య చేసుకున్నారు. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని వైసీపీ నేతల ఒత్తిడితో పోలీసులు వేధించడమే ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. అంతకుముందు సలాం తన కుటుంబ సభ్యులతో కలసి తీసుకున్న సెల్ఫీ వీడియో బయట పడింది. ఈ కేసులో ఓ సీఐ, ఓ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి జైలుకు పంపించారు. పోలీసులను ఒత్తిడి చేసిన వైసీపీ నాయకులు మాత్రం తప్పించుకున్నారన్న విమర్శలున్నాయి.
బీసీ నేత దారుణహత్య
కడప జిల్లాలో చేనేత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య (41)ను పట్టపగలే అందరూ చూస్తుండగా నరికి చంపేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే ఈ దారుణం జరిగింది. ఎమ్మెల్యే, ఆయన బావమరిది బంగారు రెడ్డి హత్య చేయించారని సుబ్బయ్య భార్య అపరాజిత పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు.
టీడీపీ జెండా పట్టుకున్నాడని..
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ బీసీ నేత తోట చంద్రయ్యను పట్టపగలు, నడి వీధిలో చంపేశారు. ఆయన టీడీపీకి మద్దతుగా నిలవడం, వైసీపీ వైపు వచ్చేందుకు నిరాకరించడమే ఈ దారుణానికి కారణం. బైకుపై వెళ్తున్న చంద్రయ్యను కింద పడేసి... గుండెలపై పొడిచి, ఆ తర్వాత గొంతు కోసి కిరాతకంగా చంపేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి దాడికి ప్రేరేపించినట్టు ఆరోపణలు వచ్చాయి.
డాక్టర్ సుధాకర్‌పై ఘోరం
దళిత డాక్టర్ కె.సుధాకర్ (52)ను వైసీపీ సర్కారు వెంటాడి, వేధించి బలితీసుకుంది. కరోనా సమయంలో 2020లో రోగులకు చికిత్స చేసే వైద్యులకు కనీసం మాస్క్‌లు కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సాధారణంగా అయితే ప్రభుత్వం స్పందించి అన్ని ఆస్పత్రులకు అవసరమైన గ్లౌజులు, మాస్క్‌లు సరఫరా చేయాలి. కానీ డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేశారు. ఆయనపై వైసీపీ పెద్దలు వ్యక్తిగతంగా కక్ష కట్టారు. ఆయనను నేషనల్ హైవేపై దుస్తులు లేకుండా నిలబెట్టి పోలీసులతో లాఠీలతో కొట్టించారు. మతి భ్రమించిందనే ముద్రవేసి మానసిక వైద్యశాలలో పడేశారు. కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు ఊరట లభించింది. ఉద్యోగంలోకి తిరిగి తీసుకోకపోవడంతో మానసిక వేదనకు గురైన డాక్టర్ సుధాకర్ ఏడాది తిరగకుండానే గుండెపోటుతో మరణించారు
అక్కకు అండగా ఉన్నాడని...
తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించాడని అమర్నాథ్ గౌడ్ అనే పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ దారుణం జరిగింది. ఈ కేసులో ఏ1 నిందితుడు వెంకటేశ్వరరెడ్డి వైసీపీ సానుభూతిపరుడిగా ఉన్నాడు. ఈ కేసులో నిందితులంతా దర్జాగా బెయిల్‌పై బయట తిరగడమే గాక మళ్లీ బాధిత కుటుంబాన్నే భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
‘జడ్ ప్లస్’కే భద్రత లేదు
దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు చంద్రబాబు నాయుడు! ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. కానీ... ఈ ఐదేళ్లలో ఆయనకే భద్రత లేకుండా పోయింది. చంద్రబాబుపై జరిగినన్ని దాడులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రతిపక్ష నేతపైనా జరగలేదోమో!
వైసీపీ మూకలు ఏకంగా ఆయన ఇంటిపైకే దండయాత్రకు వెళ్లాయి. అంగళ్లులో రాళ్ల దాడికి తెగబడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. నందిగామలో రోడ్ షో సందర్భంగా చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడిలో ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎ్‌సవో) మధు తలకు గాయమైంది.
గతేడాది ఏప్రిల్‌లో ప్రకాశం జిల్లాఎర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్‌షో సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరారు. పోలీసులు వారిని అడ్డుకోకుండా టీడీపీ కార్యకర్తలపైనే లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో ఎస్‌ఎ్‌సజీ కమాండో సంతో్‌షకుమార్ తలకు గాయమైంది. దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త, దళితుడు చేలూరి రాజయ్య (66) చికిత్స పొందుతూ మృతిచెందారు.
పాలన కాదు.. పగ!
జగన్‌తో రాజకీయంగా విభేదించినందుకు తన కిరాయి సైన్యంతో సొంత చెల్లెలు షర్మిలపై నీచాతినీచమైన కామెంట్లు చేయించారు. తన పుట్టుక, క్యారెక్టర్ గురించి సోషల్ మీడియాలో దారుణంగా దాడి చేశారంటూ షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై ఏసీబీతో ఈఎ్‌సఐ కేసు నమోదు చేయించి అర్ధరాత్రి వందలాది మంది పోలీసుల్ని ఇంటిపైకి పంపించారు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని అరెస్టు చేసి గుంటూరు సబ్ జైలులో 78 రోజులు పెట్టారు.
పులివెందులలో హత్యకు గురైన దళిత మహిళ నాగమ్మకు న్యాయం జరగాలంటూ నిరసన చేపట్టిన తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై అట్రాసిటీ కేసు నమోదు చేయించి 14 రోజులు జైల్లో ఉంచారు.
టీడీపీ ఆఫీసులోకి మఫ్టీలో వచ్చిన సీఐని ఎవరంటూ ప్రశ్నించినందుకు... ఆయన్ను బంధించారంటూ నారా లోకేశ్, ఆలపాటి రాజా, శ్రవణ్ కుమార్, అశోక్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టారు.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై కేసులు పెట్టి వేధించి ఆయన ఆత్మహత్యకు పాల్పడేలా చేశారు.
మాజీ మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు ఓ వివాహానికి హాజరైనందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై 50కి పైగా కేసులు పెట్టి రెండు నెలలకు పైగా జైల్లో ఉంచారు.
అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిపై లెక్కలేనన్ని కేసులు పెట్టి వేధించారు. కాల్వ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్‌పై కేసు పెట్టారు.
మున్సిపల్ ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తున్న వైసీపీ నాయకుల్ని అడ్డుకున్న కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలో ఒక హత్య కేసుతో ఏ మాత్రం సంబంధం లేకున్నా కొల్లు రవీంద్రను అరెస్టు చేసి జైలుకు పంపారు.
సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఇంటిని వేకువజామున చుట్టుముట్టి రాజమండ్రి జైలుకు పంపారు.
మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపారు.
ఆనందయ్య కరోనా మందు విషయంలో కాకాని అంతర్గత విషయాలు బయట పెట్టినందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై దొంగతనం కేసు పెట్టారు.
బొండా ఉమా, కూన రవికుమార్, కేఈ ప్రభాకర్, తిక్కారెడ్డి, వంతల రాజేశ్వరి, యరపతినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసులు పెట్టారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఏకంగా ఏడు కేసులు పెట్టారు.
నిమ్మల రామానాయుడు, కళా వెంకట్రావ్, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జీవీ ఆంజనేయులు, అశోక్ గజపతి రాజు, నాదెండ్ల బ్రహ్మం, బుద్దా వెంకన్న, వర్ల రామయ్యపై తప్పుడు కేసులు నమోదు చేశారు.
చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేశ్ దాడికి వెళితే అక్కడున్న టీడీపీ శ్రేణులపై అట్రాసిటీ కేసులు పెట్టారు.
టీడీపీ కార్యాలయంపై పట్టపగలు దాడి చేస్తే... టీడీపీ వారిపైనే కేసులు నమోదు చేశారు.
గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై మూకలు దాడి చేస్తే, టీడీపీ నేత పట్టాభిరామ్‌తో పాటు పలువురిపై ఎదురు కేసులు పెట్టారు. పోలీసులు పట్టాభిని చితకబాదారు. అదే విజయవాడ పటమటలో వైసీపీ గుండాలు టీడీపీ నేత కన్ను పొడిచేస్తే సాధారణ కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ చింతకాయల విజయ్‌పై కేసులు పెట్టి ఇంట్లో చిన్నపిల్లల్ని వేధించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారితో పాటు పాత్రికేయులు, సామాన్యులపై ఏకంగా 150కిపైగా కేసులు పెట్టారు.
హైకోర్టు న్యాయమూర్తులపై వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేసినా చర్యలు తీసుకోలేదు. తమ వల్ల కాదంటూ సీఐడీ చేతులు ఎత్తేయడంతో హైకోర్టు సీబీఐకి కేసు అప్పగించింది.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పేరుతో కుప్పంలో యాత్ర ప్రారంభించిన రోజే మోటర్ సైకిళ్ల ర్యాలీకి అనుమతి లేదంటూ కేసు పెట్టారు. ఏకంగా 20కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందంటూ ఎవరో తనకు పంపిన సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన పెద్దావిడ ఇంటికి గుంటూరులో రాత్రి పది గంటలకు పోలీసులు వెళ్లి విచారణ పేరిట డీజీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు.