GVMC: మున్సిపల్ కమిషనర్ నివాసంపై ఏసీబీ దాడి.. కీలక పత్రాలు స్వాధీనం
ABN , Publish Date - Nov 26 , 2024 | 03:02 PM
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా విశాఖపట్నం మహానగరం రూపాంతరం చెందింది. అలాంటి ఈ నగరం రోజు రోజుకు విస్తరిస్తుంది.
విశాఖపట్నం, నవంబర్ 26: ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ -2) కమిషనర్ పి. సింహాచలం నివాసంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. మధురవాడలో మిథిలాపూరి కాలనీలోని ఆయన నివాసంలో మంగళవారం తెల్లవారుజామున నుంచి సోదాలు చేపట్టారు. అదే సమయంలో జోన్- 2 కార్యాలయంతోపాటు హైదరాబాద్, శ్రీకాకుళంలోని ఆయన బంధువుల నివాసాలపై ఏబీసీ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాలలో పలు కీలక ఆధారాలతోపాటు పైళ్లను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అడ్డగోలుగా... అక్రమ మార్గంలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ సింహాచలంపై ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సింహచలం నివాసం, కార్యాలయంతోపాటు అతడి బంధువుల నివాసంపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.
ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు ఏసీసీ జాయింట్ డైరెక్టర్ ఎం. రజినీ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏఎస్పీ ఎన్. విష్ణు, డీఎస్పీలు నాగేశ్వరరావు, రమ్య పాల్గొన్నారు. అయితే ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ దాడులు ముగిసిన అనంతరం జీవీఎంసీ 2 కమిషనర్ సింహాచలాన్ని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా విశాఖపట్నం మహానగరం రూపాంతరం చెందింది. అలాంటి ఈ నగరం రోజు రోజుకు విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త నిర్మాణాలు సైతం ఊపందుకొంటున్నాయి. అలాంటి వేళ.. కొత్త నిర్మాణాలకు అనుమతులు అవసరమవుతాయి. అందుకు కార్పొరేషన్ అధికారులు అనుమతులు మంజురు చేయాల్సి ఉంటుంది.
ఆ అనుమతులు వేగంగా వచ్చేందుకు కార్పొరేషన్ అధికారులు ధరలు నిర్ణయించి.. ఆ విధంగా వసూల్ చేస్తున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో కమిషనర్ సింహాచలం నివాసంపై తొలుత ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే జీవీఎంసీ 2లోని పలువురు అధికారుల అవినీతిపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
For AndhraPradesh News And Telugu News