Share News

Atchannaidu: నిష్కల్మష జీవితాలకు నిలువుటద్దం గిరి పుత్రులు

ABN , Publish Date - Aug 09 , 2024 | 01:05 PM

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

Atchannaidu: నిష్కల్మష జీవితాలకు నిలువుటద్దం గిరి పుత్రులు

విజయవాడ: ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తితో ఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. ఆదివాసీల సంస్కృతికి నిదర్శనమైన ‘ఆదివాసీల భాష’ను సంరక్షించి సవర భాషకు లిపిని నిక్షిప్తం చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి స్ఫూర్తితో ఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.


ప్రపంచ సంస్కృతి, సమిష్టి జీవన విధానానికి ప్రాథమిక సాక్ష్యం ఆదివాసీలు.. పరస్పర సహకారం, నిష్కల్మష జీవితాలకు నిలువుటద్దం గిరి పుత్రులు అని కొనియాడారు. సహజ వాతావరణంలో స్వచ్ఛమైన జీవన విధానంలో జీవనం సాగిస్తున్న గిరిపుత్రుల సమగ్ర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో మంత్రి గుండు సుధారాణి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి, పురోగతి సాధించాలన్న సంకల్పంతో ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారని అన్నారు.


ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరులు, మహిళలు ఎలా ఉండాలి అనేది తెలిసిందని గుండు సుధారాణి పేర్కొన్నారు. సజ్జలు, జొన్నలు, రాగులు లాంటి చిరుధాన్యాలు మాత్రమే భోజనం చేసే గిరిజనులకు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి వరి భోజనాన్ని నందమూరి తారక రామారావు పరిచయం చేశారన్నారు. గడిచిన ఐదేళ్లలో అన్ని వ్యవస్థల్ని జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది గిరిజనులు అందరు కూడా ఏదో విధంగా గడిచిన ఐదేళ్లలో ఇబ్బంది పడ్డారన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం మీరు ఇచ్చిన లక్షా పాతికవేల ఎకరాలు ఇచ్చారన్నారు. గడిచిన ఐదేళ్లలో దళారులతో గిరిజనులకు ఇచ్చిన భూముల్లో వైసీపీ నాయకులు గంజాయిని పండించారన్నారు. గిరిజన పిల్లలను ప్రేరేపించి గంజాయి రవాణాకు వైసీపీ నాయకులు వాడుకున్నారన్నారు. 70 శాతం మంది గిరిజన పిల్లలు జైల్లో మగ్గిపోతున్నారని గుండు సుధారాణి తెలిపారు. గంజాయి సూత్రధారులు మాత్రం బయటే ఉన్నారన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 01:05 PM