Share News

Rains: మళ్లీ షురూ.. విజయవాడలో తెల్లవారుజాము నుంచే వర్షం

ABN , Publish Date - Sep 04 , 2024 | 07:12 AM

విజయవాడ, గుంటూరు జిల్లాల్లో తెల్లవారుజామున 2.30 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారుల్లో ఆందోళన చోటు చేసుకుంది.

Rains: మళ్లీ షురూ.. విజయవాడలో తెల్లవారుజాము నుంచే వర్షం
Rain In Vijayawada

అమరావతి: విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. 2.30 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. నిన్న సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో వరద పీడిత ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న సాయంత్రానికి వరద నీరు కొంతమేర తగ్గింది. మళ్ళీ వర్షం పడటంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


ప్రకాశం బ్యారేజ్ వద్ద పూర్తిగా తగ్గిన నీటి మట్టం..

ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పూర్తిగా తగ్గింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బ్యారేజి వద్ద ఈ రోజు ఉదయం 5 లక్షల 25 వేలకు వరద ప్రవాహం చేరుకుంది. 30 గంటలలో ఆరున్నర లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం తగ్గింది. పులిచింతల నుంచి 4 లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు వస్తోంది. వైరా, మున్నేరు, కట్టలేరు, కీసర వంటి ఉప నదులు నుంచి పూర్తిగా వరద ప్రవాహం తగ్గిపోయింది. ఫలితంగా ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం పూర్తిగా తగ్గింది. బ్యారేజ్ దిగువ భాగంలో నదీతీర ప్రాంతాల్లో జల దిగ్బంధనం నుంచి గ్రామాలు క్రమంగా బయట పడుతున్నాయి.


వరద సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

వరద సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద నీట మునిగిన వాహనాలకు ఇన్స్యూరెన్స్ ఇప్పించే బాధ్యతను తీసుకుంటామని ప్రకటన చేసింది. ఇన్సూరెన్స్ కంపెనీలతో త్వరలో సమావేశం అవుతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నీటిలో మునిగిన టూ వీలర్లు, కార్లకు ఇన్సూరెన్స్ వచ్చేలా చేస్తామన్నారు. వాహనాలను రిపేర్లు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బుడమేరు వాగును స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు. ఇకపై బుడమేరు ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అస్నా తుపాను ఇటు వైపు రాదని అంటున్నారని.. అయినా అప్రమత్తంగా ఉంటామని వెల్లడించారు. వరద సాయంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చంద్రబాబు తెలిపారు.

Updated Date - Sep 04 , 2024 | 09:00 AM