Share News

హైవేపై అఘోరి హైడ్రామా

ABN , Publish Date - Nov 19 , 2024 | 06:18 AM

ఉభయ రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా హల్‌చల్‌ చేస్తున్న అఘోరి సోమవారం మంగళగిరిలో హంగామా సృష్టించింది. అఘోరి తరచూ మంగళగిరి వస్తూ.. ఆటోనగర్‌ ఎదురుగా ఉన్న ఓ కార్‌ వాష్‌ సెంటరులో కారును శుభ్రం చేయిస్తోంది.

హైవేపై అఘోరి హైడ్రామా

  • మంగళగిరిలో స్థానికులు, పోలీసులపై దాడి

  • డిప్యూటీ సీఎం పవన్‌ను కలుస్తానని పట్టు

  • హైవేపై బైఠాయింపు... అడ్డుకున్న జనసేన కార్యకర్తలు

  • బందోబస్తుతో రాష్ట్ర సరిహద్దు దాటించిన పోలీసులు

మంగళగిరి సిటీ, జగ్గయ్యపేట రూరల్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఉభయ రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా హల్‌చల్‌ చేస్తున్న అఘోరి సోమవారం మంగళగిరిలో హంగామా సృష్టించింది. అఘోరి తరచూ మంగళగిరి వస్తూ.. ఆటోనగర్‌ ఎదురుగా ఉన్న ఓ కార్‌ వాష్‌ సెంటరులో కారును శుభ్రం చేయిస్తోంది. సోమవారం ఉదయం కూడా కార్‌ వాష్‌కు రాగా.. పలువురు ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. ఆగ్రహించిన అఘోరి త్రిశూలంతో వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఓ జర్నలిస్టు కాలు విరిగింది. తర్వాత మంగళగిరి డిపో రోడ్డు, ఆటోనగర్‌ మీదుగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత జనసేన కేంద్ర కార్యాలయం సమీపంలో ప్రత్యక్షమైంది. కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా జనసైనికులు జాతీయ రహదారిపైనే అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం కోసం వచ్చానని, ఆయనను కలిసే వెళతానంటూ అఘోరి హైవేపైనే బైఠాయించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అఘోరికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. వారిపైనా దాడికి పాల్పడింది. శరీరంపై దుస్తులు కూడా లేకపోవడంతో పోలీసులు అఘోరిని బలవంతంగా తాళ్లతో బంధించి, వస్త్రాలు కప్పారు. కొద్దిసేపటి తర్వాత బంధనాలు తొలగించడంతో మళ్లీ వారిపై విరుచుకుపడింది. దాదాపు మూడున్నర గంటలసేపు హైవేపై హల్‌చల్‌ చేసింది. ఎట్టకేలకు స్థానికులు, పోలీసులు నచ్చజెప్పి.. అఘోరిని ప్రత్యేక వ్యానులో ఎక్కించి, బందోబస్తు మధ్య రాష్ట్ర సరిహద్దులు దాటించారు. చిల్లకల్లు పోలీసులు గౌరవరం నుంచి ప్రత్యేక ఎస్కార్ట్‌తో ఆమె వాహనాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించారు. దారిలో వాహనం ఆపి దిగాలని ఆమె ప్రయత్నించినా పోలీసులు అడ్డుకుని, వేగంగా సరిహద్దులు దాటించేశారు.

Updated Date - Nov 19 , 2024 | 06:19 AM