Share News

మోదీ పాలనలోనే గోహత్యలు అధికం

ABN , Publish Date - Oct 11 , 2024 | 05:36 AM

గోసంరక్షణ లక్ష్యంగా ఉద్యమిస్తామని, గోసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉత్తరాఖండ్‌ జ్యోతిర్‌ మఠానికి చెందిన సద్గురు శంకరాచార్య స్వామి శ్రీఅవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు. ‘

మోదీ పాలనలోనే గోహత్యలు అధికం

తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ఉపేక్షించరాదు

గోధ్వజ్‌ స్థాపన యాత్రలో శ్రీఅవిముక్తేశ్వరానంద

విజయవాడ కల్చరల్‌, అక్టోబరు 10: గోసంరక్షణ లక్ష్యంగా ఉద్యమిస్తామని, గోసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉత్తరాఖండ్‌ జ్యోతిర్‌ మఠానికి చెందిన సద్గురు శంకరాచార్య స్వామి శ్రీఅవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు. ‘గోధ్వజ్‌ స్థాపన భారత యాత్ర 2024’లో భాగంగా గురువారం ఆయన విజయవాడ చేరుకొన్నారు. ఈ సందర్భంగా శ్రీశివరామకృష్ణ క్షేత్రంలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మోదీ ప్రధాని అయితే గోవధను నిర్మూలిస్తారని అందరూ భావించారని, కానీ అందుకు భిన్నంగా ఆయన పాలనలోనే గోహత్యలు అధికమయ్యాయని ఆరోపించారు.

ఆయన ప్రధాని అయ్యాక ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలోనే గోమాంస విక్రయాలు పెరిగాయని, గోమాంసం ఎగుమతిలో దేశంలోనే యూపీ మొదటి స్థానంలో ఉందన్నారు. గోమాంస విక్రయాలకు ఇష్టానుసారంగా లైసెన్స్‌లు ఇచ్చారని, మోదీ ముడుపులు తీసుకొన్నారని స్వామీజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదం తన మనసును తీవ్రంగా కలిసి వేసిందని, ఇలాంటి విషయాలను ఉపేక్షించకూడదనిఅన్నారు. టీటీడీకి కోట్లాది రూపాయల ఆస్తులున్నాయని, అలాంటప్పుడు తిరుపతిలో గోశాలను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సొంత గోశాలను నిర్వహించాలని, తద్వారా వచ్చే గో దధీ, క్షీరఘృతాలను పూజలకు, ప్రసాదాలకు వినియోగించాలని సూచించారు.

Updated Date - Oct 11 , 2024 | 05:36 AM