Amaravati : డయాఫ్రమ్ కొత్తదే కట్టుకోండి!
ABN , Publish Date - Aug 16 , 2024 | 06:15 AM
పోలవరం పాత డయాఫ్రమ్ వాల్‌కు మరమ్మతులు చేసుకునే అవకాశముందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అయితే... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు భద్రతరీత్యా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించుకోవచ్చునని కూడా పేర్కొంది.
పాతదానికి రిపేర్లు చేసుకోవచ్చు కానీ..
జలసంఘం సూచనలు పరిగణనలోకి తీసుకుంటే మేలు
మెయిన్ డ్యామ్ పనులపై వర్క్‌షాప్
పోలవరంపై అంతర్జాతీయ నిపుణుల నివేదిక
అమరావతి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): పోలవరం పాత డయాఫ్రమ్ వాల్‌కు మరమ్మతులు చేసుకునే అవకాశముందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అయితే... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు భద్రతరీత్యా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించుకోవచ్చునని కూడా పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర జలసంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుంది.
పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు గెయిన్ ఫ్రాన్స్‌కో డీసీకో (అమెరికా), రిచర్డ్ డొనెల్లీ (కెనడా), డేవిడ్ పాల్ (అమెరికా) గురువారం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి 53 పేజీల నివేదికను పంపారు. ‘‘పోలవరం సాగునీటి ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యలో వీలైనంత త్వరగా ప్రస్తుత డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్త డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించుకోవచ్చు.
ఈ ఏడాది నవంబరు ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది జూలై 31 దాకా నిరంతరాయంగా డయాఫ్రమ్‌వాల్ పనులు చేపట్టేలా కార్యాచరణను అమలు చేయాలి. ప్రాజెక్టులో చేపట్టాల్సిన మిగిలిన పనులన్నింటిపైనా ఇన్వెస్టిగేషన్, డిజైన్‌ల రూపకల్పన కొనసాగించుకోవచ్చు’’ అని నిపుణుల బృందం సిఫారసు చేసింది. అయితే... మెయిన్ డ్యామ్ పనులకు సంబంధించి డిజైన్లు, నిర్మాణ పనులపై వర్క్‌షాపును నిర్వహించాలని సూచించింది. నిర్మాణ యాజమాన్య విధానంలో భాగంగా క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని తెలిపింది. నిపుణుల ప్యానల్ నివేదికలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
పాత డయాఫ్రమ్ వాల్‌కు మరమ్మతులు చేసే అవకాశమున్నప్పటికీ... కేంద్ర జల సంఘం ఆలోచనల మేరకు కొత్త డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించుకోవచ్చు.
ప్రస్తుత డయాఫ్రమ్‌వాల్ నిర్మాణంలో వినియోగించిన మెథడాలజీనే కొత్త డయాఫ్రమ్‌వాల్ నిర్మాణానికి ఉపయోగించాలి.
షెడ్యూల్‌లోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా వనరులను సిద్ధం చేయాలి.
డయాఫ్రమ్‌వాల్ నిర్మాణానికి సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి.
మెయిన్ డ్యామ్ దిగువన గ్యాప్ 2 వద్ద గ్రౌండ్ ఇంప్రూవ్‌మెంట్ పూర్తి చేయాలి.
డయాఫ్రమ్‌వాల్ నిర్మాణం కోసం ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేయాలి.
ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య మూడు మీటర్ల కంటే తక్కువ ఎత్తులో జలాలు ఉండేలా చూసుకోవాలి.
వైబ్రో కంపాక్షన్ (వీసీ) 20 మీటర్ల లోతు వరకూ చేపట్టాలి.
చానల్ 1550, చానల్ 280 మధ్య భారీగా ఉన్న సీపేజీని నివారించేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలి.
ఆరు నుంచి ఎనిమిది ఫిజియోకోన్‌లను సిద్ధం చేయాలి. ఓడోమీటరు పరీక్షలు చేయాలి.
మెయిన్ డ్యామ్‌కు సంబంధించిన గ్యాప్-1, గ్యాప్-2 డ్యామ్ డిజైన్‌లపై చాలా సందేహాలు వస్తున్నాయి. వీటిని నివృత్తి చేసేందుకు వీలుగా డ్యామ్ డిజైన్, నిర్మాణాలపై పూర్తి సమాచారంతో వర్క్‌షాపును నిర్వహించాలి.