Share News

Amaravati : సీపీఎంలో లుకలుకలు

ABN , Publish Date - Aug 16 , 2024 | 04:17 AM

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించిన విధానంతో సీపీఎం రాష్ట్ర శాఖలో ముసలం పుట్టింది. దీంతో కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ఆర్‌.రఘుపై పార్టీ నాయకత్వం బహిష్కరణ వేటు వేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

Amaravati : సీపీఎంలో లుకలుకలు

  • గత ఎన్నికల్లో పార్టీ అనుసరించిన విధానంపై అసంతృప్తి

  • కృష్ణా జిల్లా సీనియర్‌ నేత రఘు రాజీనామా

  • పార్టీ నుంచి బహిష్కరించిన నాయకత్వం

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించిన విధానంతో సీపీఎం రాష్ట్ర శాఖలో ముసలం పుట్టింది. దీంతో కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ఆర్‌.రఘుపై పార్టీ నాయకత్వం బహిష్కరణ వేటు వేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ అనుసరించిన రాజకీయ విధానం, పొత్తుల నిర్ణయాలను రఘు గట్టిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తుకు వెళ్లాలనే విషయమై సీపీఎం నాయకత్వం బ్యాలెన్స్‌ తప్పిందని, రాష్ట్రంలో పార్టీ బలహీనపడటానికి కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలదే బాధ్యతంటూ ఆయన విమర్శించారు.

పార్టీ మహాసభలలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ గత నెల 22న రఘు కృష్ణా జిల్లా సీపీఎం కార్యదర్శి వై.నరసింహారావుకు రాజీనామా లేఖ ఇచ్చారు. రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు కూడా ఒక ప్రతిని పంపించారు.

ఆయనతో సీపీఎం రాష్ట్ర నాయకత్వం చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరించింది. రఘును ప్రాథమిక సభ్యత్వం నుంచి, కృష్ణా జిల్లా కమిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వై.నరసింహారావు ఈ నెల 14న ప్రకటన విడుదల చేశారు. కాగా, సీపీఎం నుంచి బహిష్కరణకు గురైన రఘు.. విప్లవ లక్ష్యంతో పనిచేసే శక్తులతో కలిసి కొత్త పార్టీని నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Aug 16 , 2024 | 04:17 AM