Amaravati : గంజాయి మత్తు వదిలేదెలా ?
ABN , Publish Date - Jul 19 , 2024 | 03:20 AM
సాధారణంగా ఐటీ, పరిశ్రమలు, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రాష్ట్రాలు పోటీ పడతాయి. జగన్ ఐదేళ్ల పాలనలో ఈ రంగాల్లో ఏపీ అట్టడుగున ఎక్కడో ఉంది.
విశాఖ మన్యం కేంద్రంగా సాగు
మైనర్లు, విద్యార్థులు, యువతపై వల
వాడవాడలా అమ్ముతున్న ముఠాలు
గతేడాది చివరికి బాధితులు 23 లక్షలు
రాష్ట్రం నుంచి దేశమంతా అక్రమ రవాణా
ఎక్కడ పట్టుబడినా ఏపీ పేరే
2019, 2021లో రవాణాలో ఏపీ టాప్
కట్టడికి చంద్రబాబు సర్కారు చర్యలు
జగన్ పాలనలో గంజాయి వనంగా ఏపీ
సాధారణంగా ఐటీ, పరిశ్రమలు, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రాష్ట్రాలు పోటీ పడతాయి. జగన్ ఐదేళ్ల పాలనలో ఈ రంగాల్లో ఏపీ అట్టడుగున ఎక్కడో ఉంది. కానీ గంజాయి రవాణాలో మాత్రం మొదటి స్థానం సాధించింది. గంజాయి సాగు, సరఫరాకు కేంద్రంగా విశాఖ మన్యం మారిందని సాక్షాత్తు ఎన్‌సీబీ నివేదికలో పేర్కొంది.
వాడవాడలా చిల్లర కొట్లు... కాలేజీల్లో కూడా గంజాయి దొరుకుతోంది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డ బాధితుల సంఖ్య గత ఏడాది చివరి నాటికి సుమారు 23 లక్షలు. గత జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మైనర్లు, విద్యార్థులు, యువత మత్తుకు బానిసలుగా మారారు. ఈ మహమ్మారిని నిర్మూలించడం చంద్రబాబు సర్కారు ముందున్న అతిపెద్ద సవాల్.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ గంజాయి వనంగా మారిపోయింది. జగన్ ప్రభుత్వం ఉదాసీనత , వైసీపీ నాయకుల కమీషన్ల కక్కుర్తితో వాడవాడలకూ గంజాయి రవాణా విస్తరించింది. ఎంతోమంది విద్యార్థులు, యువత, మైనర్లు మత్తుకు బానిసలయ్యారు. గంజాయి మత్తును వదిలించడం కూటమి సర్కారుకు సవాల్‌గా మారింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర మన్యం పేరు వినిపిస్తోంది.
రాష్ట్రానికి పట్టిన గంజాయి మత్తు వదిలించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చంద్రబాబు సర్కారు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసు అధికారులు గంజాయి దందాపై ఆరా తీస్తున్నప్పుడు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నా యి. ప్రభుత్వం గంజాయిపై హోం మంత్రి అనిత నేతృత్వంలో ఐదుగురు (విద్య, వైద్య, గిరిజన, ఎక్సైజ్) మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
ఇటీవల సుదీర్ఘంగా చర్చించిన మంత్రుల కమిటీ ఒక ఐజీ నేతృత్వంలో యాంటీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మత్తుముఠాలపై నిఘా పెట్టడం.. కింగ్‌పిన్‌ల ఆచూకీ కనిపెట్టడం.. 2014-19 మధ్యలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఎర్రచందనం స్మగ్లర్లపై దాడులు చేసిన తరహాలో గంజాయి స్మగ్లర్లపై దాడులు చేయడం.. స్మగ్లర్ల ఆస్తులు గుర్తించి జప్తు చేయడం.. మత్తు మాఫియాతో సంబంధాలున్న ప్రతి ఒక్కరికీ ఉచ్చు బిగించడం వంటి చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అంతేగాక వర్షాలు పడుతున్న ఈ సమయంలో అసలు గంజాయి సాగే చేయకుండా అడ్డుకోవడం.. గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడం.. గంజాయి విత్తనాలు, సాగుకు పెట్టుబడి ఇస్తున్న దళారులకు సంకెళ్లు వేయాలని నిర్ణయించింది. మార్కెట్ విలువ ప్రకారం కనీసం పాతికవేల కోట్ల మత్తు వ్యాపార వ్యవస్థీకత దందాను బొంద బెట్టేందుకు సిద్ధమవుతోంది.
అంతులేని నిర్లక్ష్యం
విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాల నుంచి రాష్ట్రంలో ఎక్కడ నేరాలు జరిగినా దాని వెనుక మత్తు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిందితులు గంజాయి మత్తులో నేరాలు చేశారని గత ప్రభుత్వంలో అప్పటి హోంశాఖ మంత్రి తానేటి వనిత వెల్లడించిన సందర్భాలున్నాయి. అయితే గంజాయి కట్టడికి జగన్ ప్రభుత్వం ఆచరణలో ఏ మాత్రం పనిచేయలేదు. కేవలం ప్రకటనలు, సమీక్షలతో సరిపెట్టింది. జగన్ పాలనలో ఊరు ఊరు, వీధి వీధికి చిల్లరకొట్టులో చాక్లెట్ల తరహాలో గంజాయి విక్రయాలు వ్యాపించాయి. వైసీపీ నాయకులు స్మగ్లర్లతో కుమ్మక్కై సాగుకు ప్రోత్సహించి లాభపడ్డారు. మత్తుముఠాలు విద్యాసంస్థలే లక్ష్యంగా యువతపై గురిపెట్టాయి. ఈ విష సంస్కృతి రోజురోజుకూ విస్తరిస్తూ రాష్ట్రంలోని పాఠశాలలకు కూడా వ్యాపించింది. ఇటీవల హోంశాఖ మంత్రి అనిత ఒక పాఠశాలను సందర్శించినప్పుడు ఓ టీచర్ చేసిన విజ్ఞప్తి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ‘విద్యార్థుల స్కూల్ బ్యాగుల్లో గంజాయి ఉంటోంది మేడం. పోలీసులతో కట్టడి చేయించండి’ అని టీచర్ ఫిర్యాదు చేశారు.
మత్తులో యువత
ఆంధ్రప్రదేశ్‌లో మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డ బాధితుల సంఖ్య గత ఏడాది చివరి నాటికి సుమారు 23 లక్షలు. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ స్థాయీ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికతో పాటు రాష్ట్రంలో గంజాయి కట్టడికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) చెప్పిన లెక్కలివి.
మాదక ద్రవ్యాలు వినియోగించే వారిలో అత్యధికంగా యువత ఉన్నారు.
మాదక ద్రవ్యాల బాధితుల్లో మైనర్లు సుమారు 17 శాతం ఉన్నారు. ఇందులో కేవలం గంజాయి బానిసలుగా పాతిక వేల మందికి పైగా బాలురు ఉన్నట్లు సెబ్ చెబుతోంది.
స్మగ్లింగ్‌లో ఏపీ టాప్
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో మొదటి స్థానం సాధించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) లాంటి కేంద్ర విభాగాల నివేదికలు వెల్లడించడం రాష్ట్రంలో దారుణ పరిస్థితులకు నిదర్శనం.
2021లో దేశవ్యాప్తంగా ఎన్‌సీబీ 7.50 లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా... ఇందులో ఏపీ వాటా రెండు లక్షల కిలోలకు (27శాతం) పైనే.
2020లో దేశవ్యాప్తంగా ఎన్‌సీబీ 5.82 లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా.. ఇందులో ఏపీ వాటా 98 వేల కిలోలు.
2019లో దేశవ్యాప్తంగా 3.42 లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా.. ఇందులో ఏపీ వాటా 71 వేల కిలోలు.
2019, 2021లో అత్యధికంగా గంజాయి పట్టుబడ్డ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచింది. 2020లో రెండో స్థానంలో ఉంది.
రెండేళ్లలో 293% పెరుగుదల
మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ బాధితుల్ని గుర్తించి విముక్తి కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ కార్యక్రమం అమలు చేస్తోంది. 2018-19లో ఇందులో ఏపీ నుంచి 1752 మంది నమోదయ్యారు. 2021 నాటికి ఈ సంఖ్య ఏకంగా 6,898కు చేరింది. కేవలం రెండేళ్లలోనే మత్తుబానిసల సంఖ్య 293 శాతం పెరిగింది. 2023 చివరి నాటికి మరింత వేగంగా ప్రమాదకర స్థాయికి చేరినట్లు సెబ్ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో మన రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో వందకు ఐదుగురు మత్తు బానిసలేనని నేషనల్ పోలీస్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి.
పట్టుబడింది రెండు శాతమే..
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో గంజాయి సాగు, స్మగ్లింగ్ విచ్చలవిడిగా పెరిగింది. డీఆర్‌ఐ, ఎన్‌సీబీ, సెబ్, పోలీసు విభాగాలన్నీ కలిపి తనిఖీల్లో గత ఏడాది చివరి నాటికి ఏడు లక్షల కిలోలు స్వాధీనం చేసుకున్నాయి. ఒక్క విశాఖ మన్యం నుంచే ఏటా లక్ష కిలోల గంజాయి ఏపీలోని పలు జిల్లాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు రవాణా అవుతోంది. అయితే ఏపీ నుంచి రవాణా అవుతున్న గంజాయిలో దేశవ్యాప్తంగా పట్టుబడింది కేవలం రెండు శాతమనేని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.