Amaravati : తాను గెలవలేక ఈవీఎంలు ‘ఓడు’!
ABN , Publish Date - Jun 19 , 2024 | 03:35 AM
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు... వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలవలేక ఈవీఎంల వల్లే ఓడిపోయానని ఇప్పుడు వాపోతున్నారు. 2014లో టీడీపీ-బీజేపీ కూటమిని ప్రజలు గెలిపించినప్పుడు..
ఈవీఎంలపై జగన్ నాలుక మడత
2019లో తాను గెలిచినప్పుడు ఓహో
ఇప్పుడు ఈవీఎంలపై అనుమానాలు
పేపర్ బ్యాలెట్‌కే వెళ్లాలంటూ ట్వీట్
ఆయన వల్లే ఓడామంటున్న అభ్యర్థులు
సమస్యలు చెప్పినా పట్టించుకోని జగన్
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు... వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలవలేక ఈవీఎంల వల్లే ఓడిపోయానని ఇప్పుడు వాపోతున్నారు. 2014లో టీడీపీ-బీజేపీ కూటమిని ప్రజలు గెలిపించినప్పుడు.. చంద్రబాబు ఇచ్చిన తప్పుడు హామీలు నమ్మి జనం ఆయనకు ఓట్లేశారని అన్నారు. 2019లో వైసీపీ గెలిచాక ఈవీఎంలపై ఆరోపణలు వచ్చినప్పుడు.. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పునూ అపహాస్యం చేశారని విమర్శించారు. అదే 2024లో ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓడించడంతో తట్టుకోలేక.. వారి ఆప్యాయత, అభిమానం ఏమయ్యాయోనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మాట తప్పను.. మడమ తిప్పనని పదే పదే చెప్పుకొనే జగన్ తీరు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతోందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఓటమిని జీర్ణించుకోలేక ప్రజాతీర్పును కించపరుస్తూ.. తప్పంతా ఈవీఎంలపై నెట్టేయడంపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు.
ఓటమికి కారణాలను విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకోకపోగా.. కుంటిసాకులు చెబితే జనం నమ్మరని వారు అంటున్నారు. ఎన్నికల్లో ఓటమి రుచి చూసిన ఆ పార్టీ నేతలంతా ఇందుకు జగనే కారణమని.. ఆయన తప్పుడు విధానాల వల్లే ఓడిపోయామని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును అమలు చేయవద్దని ఎంత చెప్పినా జగన్ వినలేదని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి బాహాటంగానే అన్నారు. గడప గడపకూ పర్యటించినప్పుడు ఈ చట్టంపై ప్రజాగ్రహం పెద్దఎత్తున వ్యక్తమైందని.. ఈ యాక్టు అమలు నిర్ణయమే తమ కొంప ముంచిందని మెజారిటీ అభ్యర్థులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. మహిళలు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. కూటమికి సానుకూలంగా ఓట్లు వేశారంటూ పోలింగ్ తర్వాత జగన్‌ను తాడేపల్లిలో కలసినప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఒక మంత్రి చెప్పారు. కానీ ఆయన పట్టించుకోలేదు. గతంలో గెలిచిన 151 సీట్ల కంటే ఎక్కువే వస్తాయని దబాయించారు. నాసిరకం మద్యం, ఇసుక విధానం కొంప ముందుతున్నాయని ఎప్పటి నుంచో చెబుతున్నా ఆయన వినలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు తమకు 11 సీట్లే ఇవ్వడంతో తట్టుకోలేక తప్పంతా ఈవీఎంలదే అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇదే నిజమైతే 2019లో ఆయన గెలుపు ఈవీఎంలను తారుమారు చేయడం వల్లే వచ్చిందా అని రాజకీయ వర్గాలు నిలదీస్తున్నాయి. జగన్ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నాయి.