Amaravati : ఖరీఫ్‌కు గడ్డుకాలం!
ABN , Publish Date - Aug 21 , 2024 | 04:54 AM
ఖరీఫ్ పై ప్రతికూల ప్రభావం పడింది. అతివృష్టి, అనావృష్టి వాతావరణంతో ప్రధాన పంటలతో సహా మిగిలిన పంటల సాగు మందకొడిగా మారింది. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టింది.
61% మించని సాగు.. 49 మండలాల్లో వానలోటు
వానలోటు లేకపోయినా కొన్ని చోట్ల ఎక్కువగా డ్రైస్పెల్స్
సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మరింత ప్రతికూలత
16ు వర్షపాతం అధికంగా ఉన్నా ఎండ తీవ్రత,
వేడి గాలులతో గాలిలో, భూమిలో తేమ కరువు
ప్రత్యామ్నాయ పంటల సాగుపై సర్కార్ దృష్టి
80% రాయితీపై విత్తనాల పంపిణీకి సిద్ధం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఖరీఫ్ పై ప్రతికూల ప్రభావం పడింది. అతివృష్టి, అనావృష్టి వాతావరణంతో ప్రధాన పంటలతో సహా మిగిలిన పంటల సాగు మందకొడిగా మారింది. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 32.5లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా, 19.78లక్షల హెక్టార్లలో(61ు)మాత్రమే సాగులోకి వచ్చాయి. వరి 15.12లక్షల హెక్టార్లకు గాను 9.56లక్షల హెక్టార్లు మాత్రమే సాగువుతోంది.
ఇక, పత్తి 5.70కి గాను 3.50, వేరుశనగ 5.55కి గాను 2.63, కంది 2.33కి గాను 1.70 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చింది. అలాగే, మొక్కజొన్న 1.05, చిరుధాన్యాలు 0.48, నూనె గింజలు 0.13, ఇతర వాణిజ్య పంటలు 0.27లక్షల హెక్టార్లలో సాగులో ఉన్నాయి. తొలకరి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 356.4 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 413.4 మి.మీ. నమోదైంది. 16.0% అదనంగా వర్షపాతం రికార్డులో ఉంది. కానీ వర్షపాతంలో 14 జిల్లాలు మెరుగ్గానే ఉన్నా.. మరో 12 జిల్లాలో సాధారణంగానే ఉంది.
పక్షం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత, వేడిగాలుల వల్ల గాలిలో, భూమిలో తేమ కొరవడింది. దీంతో కడప 9, శ్రీకాకుళం 8, ప్రకాశం 6, నెల్లూరు, అన్నమయ్య, పల్నాడు జిల్లాల్లో 4 చొప్పున, కర్నూలు, బాపట్ల 3 చొప్పున, అనంతపురం, శ్రీసత్యసాయి, తూర్పుగోదావరి, తిరుపతి, అల్లూరి, నంద్యాల, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 49 మండలాల్లో వానలోటులో ఉన్నాయి.
కృష్ణా, గోదావరికి వరదలు రావడంతో కాలువలకు పుష్కలంగా నీరు విడుదలవుతున్నా.. మెట్ట ప్రాంతాల్లో పంటల సాగు పుంజుకోలేదు. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రతికూలత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 2.22లక్షల హెక్టార్లలో ఉలవలు, మిగతా భూముల్లో పెసర, మినుము, అలసంద, జొన్న, కొర్ర, సజ్జ పంటల సాగుకు శాస్త్రవేత్తలు సిఫారసు చేశారు.
అందువల్ల ప్రత్యామ్నాయ పంటల సాగుకు వాస్తవ అంచనాలు రూపొందించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. దీంతో కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ కింద ఉలవలు 55,587, జొన్న 6,400, పెసర 4,600, అలసంద 4,173, మినుము 2,021, కొర్ర 650 క్వింటాళ్ల విత్తనాలను అధికారులు ఏపీసీడ్స్ ద్వారా సిద్ధం చేస్తున్నారు. వచ్చేనెల మొదటి వారంలోగా 80ు రాయితీపై విత్తనాలు పంపిణీచేసి, గుర్తించిన మండలాల్లో కంటింజెన్సీ ప్లాన్ అమలు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఆదాయం తగ్గకుండా చర్యలు: అచ్చెన్న
రాయలసీమలో ఏ ఒక్క రైతు ఆదాయం కూడా తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగును ప్రోత్సహించడంతో పాటు రైతులకు 80శాతం రాయితీపై విత్తనాలు అందించాలని స్పష్టం చేశారు. మంగళవారం అమరావతి సచివాలయం నుంచి రాయలసీమ జిల్లాల వ్యవసాయ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంత్రి అచ్చెన్నతో థాయ్ బృందం భేటీ
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో థాయ్‌లాండ్‌కు చెందిన సీపీఎఫ్ అగ్రికల్చర్ బిజినెస్ ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారు. మంగళవారం అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆక్వా రంగ అభివృద్ధి, ఎగుమతుల వృద్ధి, ఆక్వా సీడ్ నాణ్యత, ఆర్గానిక్ ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల అవకాశాలపై సీపీఎఫ్ వైస్ చైర్మన్ సిరపాంగ్ నా పోంగ్సా, అసిస్టెంట్ వైస్ చైర్మన్ సురచాయ్ డిచింగ్ మంత్రితో చర్చించారు.