Amaravati : సచివాలయ సిబ్బందికి టాయిలెట్ ఫొటోల బాధ్యత
ABN , Publish Date - Aug 20 , 2024 | 04:30 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్ చేసే బాధ్యతలను విద్యాశాఖ గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది.
పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
ప్రధానోపాధ్యాయులకు బిగ్ రిలీఫ్
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్ చేసే బాధ్యతలను విద్యాశాఖ గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది. ఆయా సచివాలయాల్లోని ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రతి సోమ, గురువారాల్లో పాఠశాలలను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
దీనికిగాను పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఐఎంఎంఎస్ యాప్‌లో లాగిన్ అయ్యేందుకు వారికి అవకాశం కల్పించింది. అలాగే బుధ, గురువారాల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల చైర్మన్, సభ్యులు కూడా ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఈ మేరకు సమగ్రశిక్ష ఎస్పీడీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇన్‌చార్జ్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు.
మరుగుదొడ్ల ఫొటోలను అప్‌లోడ్ చేసే బాధ్యతను గత జగన్ ప్రభుత్వం ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు(హెచ్.ఎం) అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, తాము చదువు చెప్పేందుకు వచ్చామని, మరుగుదొడ్ల ఫొటోలు తీసేందుకు కాదని హెచ్.ఎంలు గగ్గోలు పెట్టారు. అయినప్పటికీ జగన్ సర్కారు వారి గోడును పెడచెవిన పెట్టి బలవంతంగానే మరుగుదొడ్ల ఫొటోలు తీయించింది.