Chandrababu: ఎన్డీఏ శాసనపక్ష సమావేశంలో ఆసక్తికర సన్నివేశం
ABN , Publish Date - Jun 11 , 2024 | 11:43 AM
ఏపీలో ఎన్డీఏ కూటమి పక్షాల నేత ఎన్నిక వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నేడు టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ వేదికపై చంద్రబాబుకు అందరి కంటే పెద్ద కుర్చీని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వేదిక పైకి వచ్చిన వెంటనే తనకు పెద్ద కుర్చీ వేయడాన్ని చూసి తీయించేశారు.
అమరావతి: ఏపీలో ఎన్డీఏ కూటమి పక్షాల నేత ఎన్నిక వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నేడు టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ వేదికపై చంద్రబాబుకు అందరి కంటే పెద్ద కుర్చీని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వేదిక పైకి వచ్చిన వెంటనే తనకు పెద్ద కుర్చీ వేయడాన్ని చూసి తీయించేశారు. అందరితో పాటే తానని.. అందరూ అక్కడ సమానమేనని ప్రత్యేక కుర్చీని తీసివేయించారు. ఆ వెంటనే నిర్వాహకులు మిగతా వారితో సమానంగా కుర్చీ వేశారు. దీనిని కూటమి పక్షాల ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఆసక్తిగా గమనించారు.
అనంతరం టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రతిపాదించారు. అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు.. గవర్నర్‌కు కూటమి పక్షాల నేతలు లేఖ ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. సాయంత్రానికల్లా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు.