Share News

YSRCP : అధికారం పోయినా.. ఆగని వైసీపీ నేతల ఆగడాలు

ABN , Publish Date - Aug 04 , 2024 | 04:42 AM

వైసీపీ అధికారం కోల్పోయినా.. ఆ పార్టీ నేతల ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. అధికారుల అండదండలతో చెలరేగిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి భూములను కాజేస్తున్నారు.

YSRCP : అధికారం పోయినా.. ఆగని వైసీపీ నేతల ఆగడాలు

  • అనకాపల్లి జిల్లా హరిపురంలో భూ కబ్జాలు

  • నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు భూ యజమానులకు బెదిరింపులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ అధికారం కోల్పోయినా.. ఆ పార్టీ నేతల ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. అధికారుల అండదండలతో చెలరేగిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి భూములను కాజేస్తున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం హరిపురం గ్రామంలోనూ వైసీపీ నేతలు భూకబ్జాకు పాల్పడ్డారు. సర్వే నంబరు 102లోని ఎకరా 3 సెంట్ల భూమిని విశాఖకు చెందిన ఎన్‌ఆర్‌ఐ 2004 సంవత్సరంలో పరిశ్రమ ఏర్పాటు కోసం కొనుగోలు చేశారు. అందులో 43 సెంట్ల భూమిని ఇతరులకు విక్రయించి, మిగిలిన భూమిని చూసుకునే బాధ్యతను అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో ఉంటున్న మేనల్లుడు శ్రీమంతుల నవీన్‌కుమార్‌కు అప్పగించారు. గత నెల 27న నవీన్‌కుమార్‌ ఆ భూమిలో పనులు చేయిస్తుండగా వైసీపీ నేత కర్రి శివశంకర్‌ గణేశ్‌, మరో 20 మందితో వచ్చి అడ్డుకోవడమే కాకుండా ఆ స్థలం చుట్టూ కంచె వేసి ఆక్రమించేందుకు యత్నించారు. నవీన్‌కుమార్‌ ప్రశ్నించడంతో దాడికి పాల్పడి, కత్తితో బెదిరించారు. దీనిపై నవీన్‌కుమార్‌ గురువారం రాంబిల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


రెవెన్యూ అండదండలతో అక్రమాలు

హరిపురం గ్రామంలో 2023లో రెవెన్యూ, పోలీస్‌ శాఖల అండదండలతో వైసీపీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీ కీలక నేత అండదండలతో వ్యవహారాలు నడిపించారు. ప్రైవేటు వ్యక్తుల భూములకు సంబంధించి వెబ్‌ ల్యాండ్‌ రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేయించి, నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి సొంతం చేసుకున్నారు. అలా హరిపురం సర్వే నంబర్‌ 76/2లో 35 సెంట్ల భూమిని నకిలీ ధ్రువపత్రాలతో దాడి గణేశ్‌ పేరున రిజిస్ట్రేషన్‌ చేయించారు.

అలాగే సర్వే నంబరు 71/2లో ఎకరా 83 సెంట్ల భూమిలో 45 సెంట్ల స్థలాన్ని వన్‌బీ సృష్టించి చోడిపల్లి మంగరాజు పేరున రిజిస్ట్రేషన్‌ చేయించారు. వైసీపీ నేతల ఆజ్ఞలకు రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా తలాడించి రెవెన్యూ రికార్డుల్లో అడ్డగోలుగా మార్పులు, చేర్పులు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రీ సర్వే చేసి న్యాయం చేయాలి..

హరిపురంలో మా భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. రెవెన్యూ అధికారులు స్పందించి రీసర్వే చేయించి కబ్జాకు గురైన మా భూములను అప్పగించాలి.

భూ ఆక్రమణలు, దౌర్జన్యాలపై ఎమ్మెల్యే, ఎంపీతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశాం. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.

- శ్రీమంతుల నవీన్‌కుమార్‌, బాధితుడు

Updated Date - Aug 04 , 2024 | 10:11 AM