Share News

ARREST: హత్యకేసు నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక

ABN , Publish Date - Nov 25 , 2024 | 11:51 PM

భార్యపై అనుమానంతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఆరు నెలల పసికందును గొంతు నులిమి అమానుషంగా చంపేశాడు. తోటలో పాతిపెట్టి పరారయ్యాడు. కర్ణాటకలోని మారుమూల ప్రాంతానికి చేరాడు. పేరు మార్చుకున్నాడు.

ARREST: హత్యకేసు నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక
SP Ratna revealing the details of the murder case in the district police office

పేరు మార్చుకుని కర్ణాటకలో జీవనం

మళ్లీ పెళ్లి

రెండో భార్య కూతురి పెండ్లి పత్రిక ఆధారంగా విచారణ

నిందితుడి అరెస్టు

పుట్టపర్తి రూరల్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): భార్యపై అనుమానంతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఆరు నెలల పసికందును గొంతు నులిమి అమానుషంగా చంపేశాడు. తోటలో పాతిపెట్టి పరారయ్యాడు. కర్ణాటకలోని మారుమూల ప్రాంతానికి చేరాడు. పేరు మార్చుకున్నాడు. వేరే పేరుతో ఓ రైతు తోటలో పనికి చేరాడు. అక్కడే ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఇలా 26 ఏళ్లు గడిచిపోయాయి. అంతా మరచిపోయారనుకున్నాడు. పోలీసులు పట్టించుకోలేదనుకున్నాడు. ఏమీ కాదులే అనుకున్నాడు. రెండో భార్య కూతురి వివాహానికి స్వగ్రామానికి చెందిన చిన్ననాటి మిత్రుడిని ఆహ్వానించాడు. ఆ మేరకు వివాహ ఆహ్వాన పత్రిక కూడా పంపాడు. అక్కడ దొరికిపోయాడు. ఆ పత్రికను పట్టుకుని పోలీసులు కూపీలాగారు. మాటువేసి, నిందితుడిని పట్టుకున్నారు. 26 ఏళ్ల తరువాత కుమారుడిని చంపిన తండ్రిని అరెస్టు చేశారు. రివార్డులు, అభినందనలు అందుకున్నారు.


గుడిబండ మండలం దిన్నేహట్టిలో 26 ఏళ్ల క్రితం కుమారుడిని హత్య చేసి పరారైన తిప్పేస్వామి అలియాస్‌ కృష్ణ గౌడను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రత్న వెల్లడించారు. గుడిబండ మండలం దిన్నేహట్టి గ్రామానికి చెందిన గొల్ల తిప్పేస్వామికి 30 సంవత్సరాల క్రితం అదే ఊరికి చెందిన మేనత్త పట్టెమ్మ కుమార్తె కరియమ్మతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. భార్య ప్రవర్తనపై తిప్పేస్వామి అనుమానం పెంచుకున్నాడు. చిన్నకుమారుడు శివలింగయ్య (6నెలలు) తనకు పుట్టలేదని భావించిన తిప్పేస్వామి.. పసికందును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనేపథ్యంలో 1998 అక్టోబరు 2వ తేదీన ఉదయం దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని దిన్నేహట్టి సమీప పొలాల్లోని మారెమ్మ జమ్మికట్టకు ప్రదక్షిణ చేద్దామని భార్య, కుమారుడిని పిలుచుకెళ్లాడు. కుమారుడు శివలింగయ్యను ఎత్తుకుని కరియమ్మ ప్రదక్షిణ చేస్తుండగా తిప్పేస్వామి పిల్లవాడిని లాక్కుని పరారయ్యాడు. తన మామిడితోటలోకి వెళ్లి చిన్నారిని గొంతునులిమి చంపేశాడు. అక్కడే గొయ్యితీసి, పాతిపెట్టి పారిపోయాడు. దీనిపై కరియమ్మ 1998 అక్టోబరు 18న గుడిబండ పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ లభించకపోవడంతో చార్జిషీట్‌ దాఖలు చేశారు.


పేరు మార్చుకుని..

కుమారుడిని చంపి పరారైన తిప్పేస్వామి కర్ణాటక రాష్ట్రంలోని హాసన జిల్లా ఆర్దురు గ్రామానికి చేరుకున్నాడు. జవారప్ప వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాడు. పేరు మార్చుకుని కృష్ణగౌడగా వారికి పరిచయమయ్యాడు. అదే ప్రాంతానికి చెందిన తారను పెళ్లి చేసుకున్నాడు. వీరికి తులసి, సౌమ్య ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఏళ్లు గడిచినా స్వగ్రామం దిన్నేహట్టిలోని స్నేహితుడు గొల్ల నాగరాజు అలియాస్‌ బాంబే నాగరాజుతో రహస్యంగా స్నేహం నెరుపుతుండేవాడు. ఈక్రమంలో తిప్పేస్వామి తండ్రి చిత్తప్ప ముసలివాడు అయ్యాడనీ, మొదటి భార్య కరియమ్మ కూడా గ్రామంలో లేదని బెంగుళూరుకు వెళ్లిపోయిందనీ, కొడుకును చంపిన విషయం గ్రామస్థులు మరచిపోయారనీ, పోలీసుల కేసు కూడా లేదని నాగరాజు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఊరికొచ్చి భూమి భాగ పరిష్కారాలు చేసుకోవాలని స్నేహితుడు సలహా ఇచ్చాడు.

అరె స్టు ఇలా..

తిప్పేస్వామి అలియాస్‌ కృష్ణగౌడ నాలుగునెలల క్రితం తన చిన్న భార్య తార కూతురు సౌమ్య పెళ్లికి రావాల్సిందిగా వివాహ ఆహ్వాన పత్రికను నాగరాజుకు పంపాడు. నాగరాజు, అతడి భార్య న్యామనహళ్లిలో వివాహానికి హాజరై, వచ్చారన్న విషయం గ్రామస్థులకు తెలిసింది. దీనిపై సమాచారం అందడంతో ఎస్పీ రత్న.. పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు.. నాగరాజును విచారించి, పెళ్లి పత్రికను సేకరించారు. నాగరాజు సలహా మేరకు భూముల భాగపరిష్కారం కోసం నెలకిందట దిన్నేహట్టికి తిప్పేస్వామి అలియాస్‌ కృష్ణగౌడ వచ్చివెళ్లాడన్న పక్కా సమాచారంతో పోలీసులు మాటు వేశారు. అందులో భాగంగా సోమవారం భాగ పరిష్కారం కోసం తన తమ్ముడు చిత్తప్ప, చెల్లెలు కంచమ్మతో పెద్దమనుషుల ద్వారా మాట్లాడడానికి మందలపల్లికి వెళ్లేందుకు దిన్నేహట్టి బస్టాండు వద్దకు తిప్పేస్వామి చేరుకున్నాడు. మడకశిర సీఐ రాజ్‌కుమార్‌, గుడిబండ ఎస్‌ మునిప్రతాప్‌.. సిబ్బందితో కలిసి వలపన్ని అతడిని పట్టుకున్నారని ఎస్పీ వివరించారు. నేరం చేసినవారు ఎప్పటికీ తప్పించుకోలేరన్న విషయం తిప్పేస్వామి అరెస్టు ద్వారా స్పష్టమైందని ఎస్పీ వివరించారు. సమావేశంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.

సిబ్బందికి రివార్డులు

26 ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న తిప్పేస్వామి అలియాస్‌ కృష్ణగౌడను చాకచక్యంగా పట్టుకున్న పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర సీఐ రాజ్‌కుమార్‌, గుడిబండ ఎస్‌ఐ మునిప్రతాప్‌, సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించారు. రివార్డులను అందజేశారు.

Updated Date - Nov 25 , 2024 | 11:51 PM