MLA RAJU: ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:12 AM
ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు హెచ్చరించారు. గురువారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మడకశిర నగర పంచాయతీ ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మడకశిరటౌన, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు హెచ్చరించారు. గురువారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మడకశిర నగర పంచాయతీ ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. వార్డులలో అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. శుక్రవారం నుంచి రెండు రోజులపాటు మున్సిపాలిటీలోని 60 మంది ఉద్యోగులతో కలిసి ఉదయం 7.30 నుంచి 12.30 గంటల వరకు వార్డులలో తిరిగి సమస్యలు తెలుసుకొంటానన్నారు. ప్రణాళిక బద్ధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. 10 నుంచి 15 రోజులకు వార్డులలో మంచి నీరు వదులుతున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై సకాలంలో అధికారులు స్పందించకపోతే శాఖాపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదన్నారు. ప్రజల నుంచి వచ్చే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లులేని ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నగర పంచాయతీ కమిషనర్ రంగస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, జడ్పీటీసీ సభ్యులు ఉమేష్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.