Share News

STORY BOARD : అన్నీ గాలి మాటలే

ABN , Publish Date - Apr 21 , 2024 | 01:01 AM

శింగనమల నియోజకవర్గ అభివృద్ధికి జగన ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూడా వాటి గురించి పట్టించుకోలేదు. ఐదేళ్లు గడిచినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. పైగా ధనార్జనే ధ్యేయంగా ఎమ్మెల్యే పని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. హామీలు అమలుగాక, సిటింగ్‌ ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా సొంత పార్టీవారే రోడ్డెక్కడంతో దిక్కుతోచక.. పార్టీ అభ్యర్థిని మార్చుకున్నారు.

STORY BOARD : అన్నీ గాలి మాటలే
Land acquired for setting up of BC Residential School in East Narasapuram Village of Shinganamala Mandal

చాగల్లు ముంపు బాధితులను ఆదుకోలేదు

హైడ్రో ప్రాజెక్టు ఊసు మరిచారు

పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని విస్మరించారు

సెంట్రల్‌ వర్సిటీ అభివృద్ధికి సాయం లేనే లేదు

ఐదేళ్లు గడిచినా అమలు కాని జగన హామీలు

శింగనమల నియోజకవర్గ అభివృద్ధికి జగన ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూడా వాటి గురించి పట్టించుకోలేదు. ఐదేళ్లు గడిచినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. పైగా ధనార్జనే ధ్యేయంగా ఎమ్మెల్యే పని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. హామీలు అమలుగాక, సిటింగ్‌ ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా సొంత పార్టీవారే రోడ్డెక్కడంతో దిక్కుతోచక.. పార్టీ అభ్యర్థిని మార్చుకున్నారు. మాట తప్పి.. మడమ తిప్పి.. ఇప్పుడు ఓట్లెలా అడుగుతారని వైసీపీ అధినేతను, నాయకులను ఇక్కడి జనం నిలదీస్తున్నారు.

- బుక్కరాయసముద్రం

మరమ్మతుల మాటేమిటో!

శింగనమల నియోజకవర్గంలోని రైతులకు ప్రధాన సాగునీటి వనరు మిడ్‌ పెన్నార్‌ డ్యాం. దాని కింద ఉన్న సౌత కెనాల్‌ ద్వారా రైతులకు సాగు అందిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి ఆయకట్టు కాలువలు శిథిలవస్థకు చేరుకున్నా యి. వీటితో పాటు డ్యాం షట్టర్‌ గేట్లు శిథిలవస్థకు చేరుకోవడంతో నీరు లీకేజీ అవుతున్నాయి. సౌత కెనాల్‌ కింద ఉన్న ఆయకట్ట కాలువలు కంప చెట్లుతో నిండిపోయాయి. కాలువలో పూడిక తీయకపోవడంతో దిగువన ఉన్న పంట పొలాలకు సాగు నీరు అందడం లేదు. గత ఐదేళ్లలో హెచ్చెల్సీ మరమ్మతులు, డ్యాం లీకేజీపై పాలకులు, అధికారులు దృష్టిసారించలేదు.


మార్కెట్‌యార్డు ఎక్కడ?

నియోజకవర్గంలో మార్కెట్‌ యార్డు ఏర్పాటు చేసి రైతులకు మరిన్ని సేవలందిస్తామని సీఎం జగన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందు కోసం బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామంలో సర్వే నెంబరు 272, 273లో 10 ఎకరాలు భూమిని కేటాయించారు. అయితే అది శంకుస్థాపనకే పరిమితం అయ్యింది. ఎలాంటి నిర్మాణ పనులు జరగలేదు. నియోజకవర్గానికి మార్కెట్‌ యార్డు కలగానే మిగిలిపోయింది.

మాట మరిచారు..

చాగల్లు రిజర్వాయర్‌ కింద ఉన్న ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది. గత ఏడాది ఏప్రిల్‌ 26న నార్పల మండలానికి వచ్చిన సీఎం జగన మాట్లాడుతూ చాగల్లు రిజర్వాయర్‌ ముంపు గ్రామాలైన ఉల్లికల్లు, ఉల్లికుంటపల్లి గ్రామాల నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.168 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఏడాది గడిచినా బాధితులకు ఒక్క రూపాయి పరిహారం అందలేదు. పలుమార్లు ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చి ఇటువైపు రావడమే మానేశారని ఆయా గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇవ్వకపోవడంతో మునుగుతున్న గ్రామంలో ఉండలేక వేరే చోటుకు వెళ్లలేక బాధితులు సతమతమవుతున్నారు.


గండికోట నీరు ఏదీ..?

నియోజకవర్గంలోని పుట్లూరు మండలానికి గండికోట రిజర్వాయర్‌ నుంచి తాగునీటి కోసం రూ.250 కోట్లతో పైపులైన పనులను చేస్తామని సీఎం జగన హామీ ఇచ్చారు. అధికారులు పైపులైనకు సంబంధించిన సర్వే చేసి చేతులు దులుపుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి పైపులైను పనులు ప్రారంభం కాలేదు. కనీసం నిధులు మంజూరు చేయలేదు. దీంతో పుట్లూరు మండలంలోని ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఈ పథకం డీపీఆర్‌కే పరిమితం అయ్యింది.

పాఠశాల ఏదీ..?

శింగనమల మండలం ఈస్టు నరసాపురం గ్రామానికి రూ.35 కోట్లతో మహాత్మా జ్యోతి రావ్‌ ఫూలే బీసీ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అందుకు స్థలం కూడా సేకరించారు. నిధులు మంజూరు కాకపోవడంతో అలాగే వదిలేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే హామీ అమలు కాలేదు. నార్పలలో బాలికల హైస్కూల్‌ ఏర్పాటు కోసం కూడా నిధులు మంజూరు కాలేదు.

వంతెనలు ఏవీ..?

నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో వంతెనలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా యల్లనూరు మండలంలో చిత్రావతినదిలో లోలెవల్‌ కాజ్‌వే నిర్మాణానికి రూ.15 కోట్లు, చింతకాయ మంద కేడీ రోడ్డు, బ్రిడ్జి ఏర్పాటుకు రూ.11 కోట్లు, కోడమూర్తి, చిలమకూరు గ్రామాల మధ్య కాజ్‌వే ఏర్పాటుకు రూ. 15 కోట్ల మంజూరు చేస్తామని నార్పల బహిరంగ సభలో సీఎం జగన హామీ ఇచ్చారు. అయితే వాటి కోసం ఒక పైసా కూడా నిధులు మంజూరు కాలేదు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి శింగనమల మండలం సొదనపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. రెండేళ్ల కిందట వర్షాలు రావడంతో శింగనమల చెరువు మూడు నెలల పాటు మరువ పారింది. దీంతో ప్రజలు ఇతర దారుల్లో వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్యే సొంత గ్రామానికి వెళ్లాలంటే కూడా ఈదారిగుండానే వెళ్లాల్సి ఉంటుంది. పోతురాజు కాలువ గ్రామానికి చెందిన 40 మంది పేద విద్యార్థులు సోదనపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివే వారు. నీటి ప్రవాహం దాట లేక వారంతా బడి మానేశారు. కాజ్‌వే లేకపోవడం వలన వర్షం వస్తే... ప్రజల రాకపోకలు నిలిచిపోవడంతో దాదాపు 25 కిలోమీటర్లు చుట్టి రావాల్సిన పరిస్థితి ఉందని గ్రామ ప్రజలు వాపోతున్నారు.


ఊసేలేని హైడ్రో ప్రాజెక్టు

రాష్ట్రంలోనే అత్యంత భారీ వ్యయంతో శింగనమల మండలంలోని నాయనివారిపల్లి వద్ద రూ.4500 కోట్లతో హైడ్రో ప్రాజెక్టు నిర్మిస్తామని సీఎం జగన ప్రకటించాడు. ఈ ప్రాజెక్టు వస్తే... నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగాలు, పరోక్షంగా పలువురికి ఉపాధి లభిస్తుందని స్థానిక ప్రజలు ఆశించా రు. అయితే ఇదంతా ప్రకటనలకే పరిమితం అయ్యింది. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో పాదయాత్ర సమయంలో ప్రతి మండలంలో నిరుద్యోగులకు ఒక నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నా రు. అయితే ఏళ్లు గడుస్తున్నా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసిందీ లేదు.. ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించిదీలేదు. దీంతో ఇదంతా మోసం గురూ అంటూ నిరుద్యోగులు జగన ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

గూగోడు పట్టించుకోరా !

నియోజకవర్గంలోని గూగూడు, బుక్కరాయసముద్రంలోని దేవరకొండమీద ఉన్న కొండమీదరాయుడి ఆలయాలను అభివృద్ధి చేసి, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పద్మావతి హామీ ఇచ్చారు. అయితే దేవరకొండపైకి టీడీపీ హయాంలో మంజూరు చేసిన బీటీ, సిమెంటు రోడ్డును ప్రారంభించడం తప్ప ఆమె చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఆలయ అభివృద్ధి కమిటీని తొలగించి ఎండోమెంట్‌ అధికారులుకు అప్పగించి అభివృద్ధి నిరోధకురాలిగా మారిందనే విమర్శలు ఆమెపై ఉన్నాయి. గూగుడులో భక్తులను ఇబ్బందిపెట్టే తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయారు.


భరోసా ఏదీ ?

గత ఎన్నికలకు ముందు, జగన పాదయాత్ర సమయంలో నియోజకవర్గంలోని రైతులకు పెద్ద భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యంతో పాటు గిట్టుబాట ఽధర కల్పించే విధంగా తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడిచినా ఇప్పటివరకు ఈ హామీ అమలుకు నోచుకోలేదు. రైతులకు గిట్టుబాటు ధర కాదు కదా వారి గురించి ఆలోచన చేసిన పాపానపోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

పూర్తి అయ్యేనా..?

గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్‌ యూనివర్సిటీ అభివృద్ధిపై శీతకన్ను వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 2023లో నిర్మాణ పనులు మొదలు పెట్టింది. కనీసం ఈ ఏడాదైన నిర్మాణ పనులు పూర్తి అవుతాయా అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సెంట్రల్‌ యూనివర్సిటీ తరగతులను జిల్లా కేంద్రంలో అద్దె గదులలో నిర్వహిస్తున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో వర్సిటీ ప్రహరీ నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. బుక్కరాయసముద్రం, నార్పల మండలాల్లోని పలు గ్రామాల్లో నాడు-నేడు పనులు నిధులు లేక నత్తనడకన కొనసాగుతున్నాయి.


నరకయాతన..

ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు, కాలువలు లేవు. టీడీపీ హయాంలో వేసిన రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఈఐదేండ్లలో ఎక్కడ కూడా చిన్న రోడ్డు, కాలువ వేసింది లేదు. గ్రామాల్లోకి వెళ్లాలంటే గుంతలతో నరకయాతన అనుభవిస్తున్నాం. పుట్లూరు, యల్లనూరు మండలాల్లోని గ్రామాల్లో అభివృద్ధి కనిపించడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

- గుత్తారోజా, కడవకల్లు, పుట్లూరు మండలం

ఎక్కడ ఆదుకున్నారు..?

జగన సీఎం అయితే రైతుల ఆశలు నెరవేరుతాయని భావించి ఓటు వేశాం. జగన రైతులకు చేసింది ఏమి లేదు. మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కనీసం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేదు. నియోజకవర్గంలోని చెరువులుకు నీరు ఇస్తామన్నారు. నీరు ఇవ్వలేదు. కనీసం డ్రిప్‌, స్పింక్లర్లు కూడా ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం.

- అప్పయ్య, పెద్దమట్లగొంది, శింగనమల

కుచ్చుటోపీ..

వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం నిరుద్యోగులకు ఎలాంటి ఎంప్లాయిమెంట్‌ కల్పించలేదు. ప్రస్తుతం మేము పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులుకు కూడా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. ఎన్నికల ముందు సీఎం జగన కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని, వేతనాలును పెంచాతామని మాట ఇచ్చారు, అయితే ఎక్కడా నిరుద్యోగ సమస్య పరిష్కరించలేదు.

- విష్ణువర్ధనరెడ్డి, కాంట్రాక్టు ఉద్యోగి, నార్పల


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 21 , 2024 | 01:12 AM