Share News

HINDUPUR YCP: పురం వైసీపీలో కొనసాగుతున్న పోరు

ABN , Publish Date - Nov 25 , 2024 | 11:48 PM

అధికారం లేకపోయినా వైసీపీలో విభేదాలు మాత్రం సమసిపోలేదు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో హిందూపురంలో ఎలా వ్యవహరించారో ప్రస్తుతం కూడా ఆ పార్టీ నాయకులు అలాగే ఉన్నారు. నియోజకవర్గంలో విభేదాల నేపథ్యంలో ఆదివారం హిందూపురానికి పులమతికి చెందిన నేత సతీ్‌షరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ వచ్చారు.

HINDUPUR YCP: పురం వైసీపీలో  కొనసాగుతున్న పోరు

బలం పెంచుకుంటున్న ఒక నేత

అధిష్టానం వద్దకు వెళ్లే యోచన

హిందూపురం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): అధికారం లేకపోయినా వైసీపీలో విభేదాలు మాత్రం సమసిపోలేదు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో హిందూపురంలో ఎలా వ్యవహరించారో ప్రస్తుతం కూడా ఆ పార్టీ నాయకులు అలాగే ఉన్నారు. నియోజకవర్గంలో విభేదాల నేపథ్యంలో ఆదివారం హిందూపురానికి పులమతికి చెందిన నేత సతీ్‌షరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ వచ్చారు. పార్టీలోని అన్నివర్గాల అభిప్రాయం తీసుకుని అధిష్టానానికి తెలియజేసేందుకు వచ్చారు. ముఖ్యనేతలు వచ్చినా రెండువర్గాలవారు అందుబాటులో లేకుండా పోయారు. మరోవర్గం వారు పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కార్యాలయం వద్దకు రాకుండా మరోచోట సమావేశమయ్యారు. దీంతో వచ్చిన నేతలు పార్టీ ఇనచార్జి కార్యాలయం వద్ద సమావేశమై అక్కడకు వచ్చిన నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకెళ్లారు. మరోచోట నాయకులు, కార్యకర్తలున్నా ఎంతసేపటికీ ముఖ్య నేతలు వెళ్లకపోవడంతో వారు వెళ్లిపోయారు. దీంతో ఒకవర్గం అభిప్రాయాలు మాత్రమే సేకరించి వెళ్లినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పురం వైసీపీలో కుమ్ములాటలు ఇప్పట్లో తగ్గేలా లేవన్న చర్చ సాగుతోంది. ఆదివారం పరిణామాలను బట్టి చూస్తే వైసీపీ నియోజకవర్గ ఇనచార్జి దీపికకు మూడువర్గాల నాయకులు దూరంగా ఉంటున్నట్లు స్పష్టమవుతోంది.


నియోజకవర్గంలోని ఓ నేత వద్దకు నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా మొన్నటి వరకు నిలువరించారు. దీపికకు ఇనచార్జి బాధ్యతలు అప్పగించిన తరువాత సర్పంచలు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు ఇతర ముఖ్య నాయకులు కూడా ఆ నేత వద్దకు వెళ్లడానికి జంకారు. ఇనచార్జికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణం. దీంతో హిందూపురం వైసీపీలో ఒక్కరే నాయకుడు అనేలా ఎన్నికల ముందువరకు వ్యవహరించారు. ఎన్నికల సమయంలో విభేదాలు బయటపడ్డాయి. అప్పటివరకు అందరూ కలిసి ఒకే నాయకత్వమని చెప్పుకొచ్చారు. ఎన్నికల అనంతరం వర్గాలు బయటపడ్డాయి. అవి సమసిపోలేదని స్పష్టమైంది. ఒకవర్గానికి చెందిన నాయకుడు బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఆయన వద్ద ఉండి ఇనచార్జి వద్దకు వెళ్లిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను ఒక్కొక్కరినే తన వద్దకు రప్పించుకుంటున్నారు. ఆదివారం ముఖ్యనేతలు వస్తారన్న సమాచారంతో లేపాక్షి మండలానికి చెందిన కీలక ప్రజాప్రతినిధులను తన వద్దకు రప్పించుకున్నారు. మున్సిపల్‌ తాత్కాలిక చైర్మన బలరాంరెడ్డి సైతం ఆ నేత వద్దకే వెళ్లారు. చిలమత్తూరు మండలానికి చెందిన ముఖ్యనాయకులు, కొంతమంది సర్పంచలు, ఎంపీటీసీలు కూడా అక్కడకే వెళ్లడం బట్టి ఆయన తనవర్గాన్ని బలపరుచుకున్నట్లు స్పష్టమైంది. దీనినిబట్టి మరికొన్నిరోజుల్లో ఇనచార్జి వద్ద ఉన్న వర్గం మొత్తం అక్కడకు రప్పించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది. దీపిక వర్గం.. సదరు ముఖ్యనేతపై వేటువేయాలని డిమాండ్‌ చేస్తుంటే.. నియోజకవర్గంలో ఆయన మాత్రం బలం పెంచుకుంటున్నారు. ఆ నేతకు అధిష్టానంలో కీలకమైన నాయకుడి అండ పుష్కలంగా ఉండటంతో ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ వైసీపీలో సాగుతోంది.

హిందూపురానికి వచ్చిన ముఖ్యనేతలు ఇనచార్జి దీపిక కార్యాలయంలో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని బహిష్కరించాలని కొంతమంది నాయకులు డిమాండ్‌ చేశారు. ఏకనాయకత్వం ఉండాలని కోరారు. అయినా ఒకవర్గం మాత్రం తగ్గేదేలేదనీ, అధిష్టానం వద్దే తేల్చుకుంటామని గట్టిగా చెబుతోంది. గత టీడీపీ హయాంలో ప్రతిపక్షంలో ఉండి పార్టీని కాపాడుకున్నామనీ, అలాంటి తమనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తే చూస్తూ ఊరుకుండేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. త్వరలోనే అధిష్టానం వద్దకు వెళ్లే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఓ నిర్ణయం ఉంటుందని ముఖ్య నేతలు చెప్పి వెళ్లారు. దీనిని బట్టి ఆ నిర్ణయం ఏమిటా అన్న చర్చ సాగుతోంది. ఇనచార్జిని త్వరలోనే మార్చవచ్చని ఒక వర్గం వారు అంటుంటే.. ఒకరిద్దరు ముఖ్య నేతలను పార్టీ నుంచి బహిష్కరించవచ్చని మరో వర్గం వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న టెన్షన ఆ పార్టీ వర్గాల్లో నెలకొంది.

Updated Date - Nov 25 , 2024 | 11:48 PM