Share News

Transfer : అంటకాగిన వారిలో ఆందోళన

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:48 PM

కూటమి విజయంతో వైసీపీతో అంటకాగిన అధికారుల్లో గుబులు మొదలైంది. నియోజకవర్గంలోని వివిధ శాఖల్లో ఐదేళ్ల పాటు వైసీపీకి కొమ్ముకాసిన సుమారు 55 మంది అధికారులు తట్టాబుట్టా సర్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బదిలీ ప్రయత్నాలను ప్రారంభించారు. వీరిలో మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసు, ట్రాన్సకో తదితర శాఖల అధికారులు, ఎంపీడీఓ కార్యాలయాల అధికారులు, పంచాయతీ రాజ్‌ కార్యాలయ అధికారులు ఉన్నారు. వైసీపీ పాలనలో వీరందరూ ఆ పార్టీ నాయకులకు వంత పాడుతూ పబ్బం ...

Transfer : అంటకాగిన వారిలో ఆందోళన

బదిలీల కోసం తీవ్ర ప్రయత్నాలు

ఐదేళ్లపాటు వైసీపీ సేవలో తరించారు

భారీగా అక్రమార్జన.. రూ.కోట్లకు పడగలు

అధికారం చేతులు మారడంతో గుబులు

కళ్యాణదుర్గం, జూన 8: కూటమి విజయంతో వైసీపీతో అంటకాగిన అధికారుల్లో గుబులు మొదలైంది. నియోజకవర్గంలోని వివిధ శాఖల్లో ఐదేళ్ల పాటు వైసీపీకి కొమ్ముకాసిన సుమారు 55 మంది అధికారులు తట్టాబుట్టా సర్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బదిలీ ప్రయత్నాలను ప్రారంభించారు. వీరిలో మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసు, ట్రాన్సకో తదితర శాఖల అధికారులు, ఎంపీడీఓ కార్యాలయాల అధికారులు, పంచాయతీ రాజ్‌ కార్యాలయ అధికారులు ఉన్నారు. వైసీపీ పాలనలో వీరందరూ ఆ పార్టీ నాయకులకు వంత పాడుతూ పబ్బం


గడుపుకున్నారు. వైసీపీ ఘోర పరాజయంతో వారిలో ఆందోళన మొదలైంది. ఇక్కడే ఉంటే తప్పులు బయట పడతాయని, ఇబ్బందులు ఎదురవుతాయని ముందు జాగ్రత్తకు పోతున్నారు.

ఆర్‌ఐ అక్రమార్జన

కళ్యాణదుర్గం పట్టణంలో ఒక ఆర్‌ఐ వైసీపీ నాయకులతో అంటకాగారు. ఆ పార్టీ నాయకులు అడిగిందే తడవు.. రెవెన్యూ శాఖలో పనులన్నీ చక్కబెట్టేవారు. గడిచిన ఐదేళ్లలో ఆయన రూ.కోట్లు ఆర్జించారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ సంపాదనతో భారీగా భూములను కొనుగోలు చేశారని సమాచారం. వైసీపీకి వీరవిధేయుడిగా పనిచేశారన్న విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో ఇప్పటికీ ఆయన పెత్తనం నడుస్తోందని సమాచారం.

ఒకరికి మించి ఒకరు..

- పంచాయతీ రాజ్‌ శాఖలో పనిచేసే ఓ కీలక అధికారి వైసీపీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు. కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పనులు చేయకపోయినా బిల్లులు డ్రాజేసి రూ.కోట్లలో వెనకేసుకున్నారని సమాచారం. పనులు, బిల్లుల విషయంలో ఆయన వైసీపీ నాయకులకు కల్పతరువుగా ఉండేవారని ప్రచారం ఉంది.

- ట్రాన్సకోలో పనిచేసే ఓ కీలక అధికారి వైసీపీ నాయకులు ఏది చెబితే అది చేశారు. వారి అండతో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించారు. ట్రాన్సకో కార్యాలయాల్లో ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపణలు ఉన్నాయి. రూ.రెండు కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని బహిరంగ చర్చ జరుగుతోంది.

- మండల పరిషత కార్యాలయాలు, ఉపాధి హామీ పథకం పనుల్లో వైసీపీకి వీరవిధేయుడిగా పనిచేసిన అధికారులు ఇప్పటికీ హవా నడిపిస్తున్నారు.


- కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడు వైసీపీ నాయకులు చెప్పిందల్లా చేస్తుంటారు. ఇప్పటికీ ఆయన కనుసన్నల్లోనే ప్రభుత్వాస్పత్రి నిర్వహణ సాగుతోంది.

- కంబదూరు, కుందుర్పి శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల పరిధిలో పనిచేస్తున్న పలువురు అధికారులు వైసీపీ నాయకులతో అంటకాగారు. నిబంధనలకు తిలోదకాలిచ్చారు. కంబదూరు మండల పరిషత కార్యాలయంలో పనిచేసే ఒక అధికారి కీలక అధికారులను డమ్మీలుగా మార్చారు. వైసీపీ నాయకుల అండతో రెచ్చిపోయారు. ఆ అధికారి చెప్పిందే శాసనం అన్నట్లుగా వ్యవహారాలు సాగాయి.

- పోలీసు శాఖలో కొందరు శాంతిభద్రతల పరిరక్షణకు కాకుండా, వైసీపీ నాయకులు చెప్పింది చేయడానికే ఉన్నట్లుగా వ్యవహరించారు. వైసీపీ ఓటమితో ఇక ఇక్కడే ఉంటే ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. బదిలీకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 08 , 2024 | 11:49 PM