Share News

Teachers Awards War : ఉత్తమ గురువులు లేరయా..!

ABN , Publish Date - Sep 04 , 2024 | 11:37 PM

ఉపాధ్యాయ దినోత్సవం వివాదాలకు తావిస్తోంది. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ఎంపికలో ఆశ్రిత పక్షపాతం చూపించారని విమర్శలు వస్తున్నాయి. కొన్ని మండలాలకు ప్రాధాన్యం ఇవ్వడం, పది మండలాలలో ఒక్కరినీ ఎంపిక చేయకపోవడం విస్తుగొలుపుతోంది. వేడుక నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులు, ఎంఈఓలు తమ వెంట నడిచేవారి, నచ్చిన వారి పేర్లను అవార్డుల జాబితాలో చేర్పించారని ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ...

Teachers Awards War : ఉత్తమ గురువులు లేరయా..!
Office of Education

పది మండలాలకు మొండిచేయి

జిల్లాలో 63 మందికి పురస్కారాలు

జాబితాలో ఐదుగురు ఎంఈఓలు

బోధనేతరులకు పురస్కారాలపై విమర్శలు

అనంతపురం విద్య, సెప్టెంబరు 4: ఉపాధ్యాయ దినోత్సవం వివాదాలకు తావిస్తోంది. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ఎంపికలో ఆశ్రిత పక్షపాతం చూపించారని విమర్శలు వస్తున్నాయి. కొన్ని మండలాలకు ప్రాధాన్యం ఇవ్వడం, పది మండలాలలో ఒక్కరినీ ఎంపిక చేయకపోవడం విస్తుగొలుపుతోంది. వేడుక నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులు, ఎంఈఓలు తమ వెంట నడిచేవారి, నచ్చిన వారి పేర్లను అవార్డుల జాబితాలో చేర్పించారని ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను పాఠాలను బోధించే ఉపాధ్యాయులకు అందిస్తారు. కానీ పాఠశాలలను


పర్యవేక్షించే ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు, డీఈఓలకు గురుపూజోత్సవం రోజున పురస్కారాలు ఇచ్చిన దాఖలాలు లేవు. తాజాగా ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి.. కొందరు విద్యాశాఖ అధికారులకు పురస్కారాలను ప్రకటించారు. కొన్ని మండలాలకు పెద్దపీట వేసి ఎక్కువ అవార్డులు ఇచ్చారు. కొన్ని మండలాలకు రిక్త హస్తం చూపించారు. విద్యాశాఖ ఎంపిక చేసిన 63 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో పలువురిని అడ్డగోలుగా చేర్చారన్న విమర్శలు వస్తున్నాయి.

పది మండలాలకు రిక్తహస్తం

ఆర్ట్స్‌ కాలేజీ డ్రామా హాల్‌లో గురువారం గురుపూజోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అందజేసే పురస్కారాలకు 63 మందిని ఎంపిక చేశారు. జాబితాలో ఎస్‌జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రైమరీ, హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, ఎంఈఓలు ఉన్నారు. జిల్లాలో 31 మండలాలు ఉండగా.. బెళుగుప్ప మండలం నుంచి ఏకంగా 11 మందికి పురస్కారాలను ప్రకటించారు. ఇతర మండలాల నుంచి ఒకటి, రెండు, మూడు, నాలుగు చొప్పున ఎంపిక చేశారు. పది మండలాలకు జాబితాలో చోటే దక్కలేదు. బొమ్మనహాళ్‌, బ్రహ్మసముద్రం, డి.హీరేహాళ్‌, గుత్తి, గుమ్మఘట్ట, పుట్లూరు రాప్తాడు, తాడిపత్రి, యాడికి, యల్లనూరు మండలాలకు ఒక్క అవార్డు కూడా దక్కలేదు.

పర్యవేక్షించే వారికి పట్టం

మండల విద్యాశాఖ అధికారులకు గతంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఇచ్చిన దాఖలాలు లేవు. స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీల్లో పాఠాలు బోధించే టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లకు సహజంగా అవార్డులు ఇస్తారు. రాష్ట్ర అవార్డుల్లోనూ ఇంచుమించు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తారు. విద్యాశాఖ అధికారులైన ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు, డీఈఓలు ఉత్తమ సేవలు అందిస్తే.. వారికి ఆగస్టు 15న, లేదా జనవరి 26న పురస్కారాలను అందజేస్తారు. ఉపాధ్యాయ దినోత్సవాన ఎక్కువగా బోధన విధుల్లో ఉండే గురువులకు పురస్కారాలను ఇస్తారు. కానీ ఈ ఏడాది జిల్లా విద్యాశాఖ అధికారులు ఐదుగురు ఎంఈఓలను పురస్కారాలకు ఎంపిక చేసి.. చర్చల్లో నిలిచారు.

విమర్శలు.. వివాదాలు

బెళుగుప్ప మండలంలో ఓ ఎంఈఓకు అవార్డు జాబితాలో చోటు కల్పించారు. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఎంఈఓ సోషల్‌ మీడియాలో విమర్శలకు దిగారు. ఏ ప్రాతిపదికన ఎంఈఓలను అవార్డులకు ఎంపిక చేశారని పలువురు ఉపాధ్యాయులు, ఎంఈఓలు ప్రశ్నిస్తున్నారు. 2024-2025 ఏడాది యూ-డైస్‌ అప్‌డేట్‌లో యల్లనూరు మండలం 100 శాతం, పుట్లూరు మండలం 99.02 శాతం ప్రొగెస్‌ ఉంది. టీచర్స్‌ అటెండెన్స, స్టూడెంట్‌ అటెండెన్స తదితర విషయాల్లో కూడా ఆ మండలాలు ముందు వరుసలో ఉన్నాయి. కానీ ప్రగతిలో వెనుక బడిన మండలాల ఎంఈఓలకు అవార్డులను అవార్డులకు ఎంపిక చేశారు. 2022-23 విద్యాసంవత్సరంలో అవార్డు తీసుకున్న ఓ ఉపాధ్యాయనికి మరోసారి పురస్కారం ప్రకటించారు. కొందరు దరఖాస్తు చేసుకోకపోయినా పిలిచి మరీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 04 , 2024 | 11:37 PM