THASILDAR OFFICE: బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయం ఖాళీ..!
ABN , Publish Date - Oct 09 , 2024 | 12:07 AM
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు లేక ఖాళీగా దర్శనమిస్తోంది. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో సిబ్బంది ఉన్నా ప్రజా పనులు జరగడం లేదు.
కార్యాలయం చుట్టూ ప్రజల ప్రదక్షిణ
బత్తలపల్లి, అక్టోబరు 8: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు లేక ఖాళీగా దర్శనమిస్తోంది. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో సిబ్బంది ఉన్నా ప్రజా పనులు జరగడం లేదు. అలాంటిది ఈ కార్యాలయంలో కీలకమైన అధికారుల పోస్టులు భర్తీచేయకపోవడంతో ప్రజా సమస్యలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక చాలా మంది అదికారులు సెలవుపై వెళ్లి మరో చోటికి బదిలీ చేయించుకున్నారు. కార్యాలయంలో అర్‌ఐ2 ఐదేళ్లు, ఆర్‌ఐ1 రెండేళ్లుగా లేరు. రెండేళ్లుగా డీటీ పోస్టు ఖాళీ. ముష్టూరు, అప్రాచెరువు వీఅర్‌ఓలు రెండు సంవత్సరాలుగా లేరు. అప్పటి నుంచి నేటి వరకు ఆయా అధికారుల కుర్చీలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. అప్పట్లో ఖాళీలను భర్తీ చేయాల్సిన అప్పటి వైసీపీ నాయకుల మాట కాదని నియమించలేదు. దీంతో మండలంలోని ప్రజలు తమ భూ సమస్యల పరిష్కారానికి కార్యాలయం చుట్టూ నేటికీ తిరుగుతూనే ఉన్నారు. రైతులు బాధలు చూడలేక కొంత మంది వీఅర్‌ఓలు అర్‌ఐ చేయాల్సిన పనులు వారే చేసి పంపుతున్నారు. డీటీ చేయాల్సిన ప నులు కిందిస్థాయి ఉద్యోగులే చేయాల్సి వస్తోంది. దీంతో పనిభారం అవుతోందని కిందిస్థాయి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇటీవల తహసీల్దార్‌గా స్వర్ణత బాధ్యతలు చేపట్టారు. మిగిలిన అధికారులు కూడా వీలైనంత త్వరగా అధికారులు నియమించాలని ప్రజలు కోరుతున్నారు.