Share News

FOOD PROBLEM : సీహెచసీల్లో ఆకలి కేకలు

ABN , Publish Date - Aug 04 , 2024 | 12:26 AM

జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల (సీహెచసీలు) పరిస్థితి దారుణంగా ఉంది. రోగులకు టిఫెన, పాలు, భోజనం అందించాల్సి ఉంది. కానీ జిల్లాలో ఒకటి, రెండు చోట్ల మాత్రమే వాటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన ఏ ఆస్పత్రిల్లో వాటిని సరఫరా చేయకపోవడంతో రోగులు అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. జిల్లాలో వైద్యవిధాన పరిషతశాఖ పరిధిలో 11 సీహెచసీలు, ఏరియా ఆస్పత్రులు, సీడీ ఆస్పత్రి ఉన్నాయి. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, అనంతపురం పాతూరు సీడీ ఆస్పత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, పామిడి, శింగనమల, కణేకల్లు, కొనకొండ్లలో ఈ ...

FOOD PROBLEM : సీహెచసీల్లో ఆకలి కేకలు
Singanamala C.H.C

రోగులకు అందని భోజనం

అడ్మిషనలో ఉన్నా...

ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందే

నిరుపేద రోగులకు దాతలే దిక్కు

వైసీపీ పాలనలో గాడి తప్పిన నిర్వహణ

అనంతపురం టౌన, ఆగస్టు 3: జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల (సీహెచసీలు) పరిస్థితి దారుణంగా ఉంది. రోగులకు టిఫెన, పాలు, భోజనం అందించాల్సి ఉంది. కానీ జిల్లాలో ఒకటి, రెండు చోట్ల మాత్రమే వాటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన ఏ ఆస్పత్రిల్లో వాటిని సరఫరా చేయకపోవడంతో రోగులు అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. జిల్లాలో వైద్యవిధాన పరిషతశాఖ పరిధిలో 11 సీహెచసీలు, ఏరియా ఆస్పత్రులు, సీడీ ఆస్పత్రి ఉన్నాయి. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, అనంతపురం పాతూరు సీడీ ఆస్పత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, పామిడి, శింగనమల, కణేకల్లు, కొనకొండ్లలో ఈ ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రులు 24 గంటల పాటు రోగులకు వైద్యసేవలు అందించాల్సి ఉంది. దీంతో ఈ ఆస్పత్రుల్లో అత్యవసర కేసులు, తీవ్ర రోగాలతో వచ్చే కేసులను అడ్మిషన చేసుకొని వైద్య సేవలు అందించాలి. ప్రభుత్వం అలాంటి రోగులకు ఉదయం టిఫెన, పాలు, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతున్నా... అనంత జిల్లాలో మాత్రం రోగులకు భోజనం అందడంలేదు. కేవలం గుంతకల్లు, రాయదుర్గం ఆస్పత్రుల్లో మాత్రమే ప్రస్తుతం రోగులకు టిఫెన, భోజనం అందిస్తున్నట్లు సమాచారం. మిగిలిన ఆస్పత్రుల్లో ఎవరైనా దాతలు దయతలిచి.. భోజనం పెడితే ఆ నిరుపేద రోగులకు ఆ పూట గడిచినట్లై.


అడ్మిషన అయినా...

ఈ ఆస్పత్రుల్లో అవసరమైన వసతులున్నాయి, డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు. కానీ భోజన వసతి లేక పోవడంతో రోగులను అడ్మిషన చేసుకోవడానికి డాక్టర్లు, సిబ్బంది అయిష్టత చూపుతున్నారు. వచ్చినవారికి తాత్కాలిక సేవలు అందించి.. సాయంత్రానికల్లా ఇళ్లకు పంపుతున్నారు. ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే వారిని రెఫర్‌ పేరుతో జిల్లా కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటున్నారు. కేవలం ఓపీలు మాత్రమే చూసుకుంటూ డాక్టర్లు కాలం వెళ్లదీస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒకవేళ రోగి అడ్మిట్‌ అయితే ఆ రోగులు ఇళ్ల నుంచో.. హోటల్‌ నుంచో భోజనం తెచ్చుకోవాల్సిందే. దీంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇంటి నుంచే భోజనం

మాది ఇరువెందల గ్రామం. నా కూతురును డెలివరీ కోసం మూడు రోజుల క్రితం శింగనమల ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఇక్కడ అన్నం పెట్టడంలేదు, మేమే ఇంటి నుంచి రోజూ తెచ్చుకుంటున్నాం. ఇక్కడ డాక్టర్లు కూడా ఎవరు భోజనం గురించి మాట్లాడడంలేదు. మా తిప్పలు మేం పడుతున్నాం.

- భాగ్యలక్ష్మి, బాలింత తల్లి, శింగనమల

హోటల్‌లో తెచ్చుకుంటున్నాం..

మాది హౌసింగ్‌ బోర్డు కాలనీ. మా అమ్మ జ్వరం, నొప్పలతో బాఢపడుతుంటే పాతూరులోని ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఇక్కడ ఓ గదిలో ఉంచి సెలైనలు ఎక్కిస్తున్నారు, డాక్టర్‌ మంచిగా చూస్తున్నారు. అయితే అన్నం ఇక్కడ పెట్టడంలేదు. ఆ ఇళ్లు దూరం కావడం... మా అమ్మ వద్ద ఇంకొకరు ఎవరు లేకపోవడంతో పక్కనే ఉన్న హోటల్‌లో తెచ్చుకొని తింటున్నాం.

- మంజునాథ, అనంతపురం

కలెక్టర్‌ చూస్తున్నారు..

సీహెచసీలు, ఏరియా ఆస్పత్రుల్లో కొన్నేళ్లుగా రోగులకు డైట్‌ అమలు కావడం లేదు. రాష్ట్రంలో అన్ని చోట్లా అమలు చేస్తున్నా ఇక్కడ మాత్రం అమలు చేయడంలేదు. నేను కొత్తగా వచ్చినపుడు ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాను. భోజన వసతి ఉన్నప్పుడే రోగుల అడ్మిషన పెరుగుతాయి. ఇప్పుడు గుంతకల్లు, రాయదుర్గంలో మాత్రమే అమలు చేస్తున్నారు. మిగిలిన అన్ని ఆస్పత్రుల్లో డైట్‌ అమలుకు ఏజెన్సీలను చూడాలని కలెక్టరు చెప్పారు. మంచివాళ్లను చూస్తున్నాం, త్వరలో అన్నింటా రోగులకు భోజన వసతి కల్పిస్తాం. - డాక్టర్‌ రవికుమార్‌, డీసీహెచఎ్‌స


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 04 , 2024 | 12:26 AM