Share News

Dwama : డ్వామాలో డ్రామాలు..!

ABN , Publish Date - Sep 19 , 2024 | 12:01 AM

డ్వామా వింత పోకడలకు వేదికగా మారింది. బదిలీ అయిన పీడీకి బంగారు కడియం, ఖరీదైన ఉంగరాన్ని బహూకరించి.. ఘనంగా సాగనంపాలని భావించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కి.. సోషల్‌ మీడియాకు ఎక్కడంతో వ్యూహం మార్చి.. హంగూ ఆర్భాటం లేకుండా సన్మానం చేశారు. కలెక్టర్‌ సీరియస్‌ కావడంతో బదిలీ అయిన పీడీ వెంటనే రిలీవ్‌ అయ్యారు. అమరావతికి వెళ్లి మాతృశాఖకు రిపోర్ట్‌ చేసుకున్నారు. డ్వామాలో కీలకంగా ఉండే హెచఆర్‌, విజిలెన్స విభాగం అధికారులు సెలవులో ...

Dwama : డ్వామాలో డ్రామాలు..!
Ananthapur Dwama Office

బదిలీ అధికారికి భజనే భజన

బంగారు కడియం తొడగాలని ప్లాన

సోషల్‌ మీడియాకు చేరడంతో మౌనం

బదిలీ అయినా విధుల్లో చేరని ఏపీఓలు

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 18: డ్వామా వింత పోకడలకు వేదికగా మారింది. బదిలీ అయిన పీడీకి బంగారు కడియం, ఖరీదైన ఉంగరాన్ని బహూకరించి.. ఘనంగా సాగనంపాలని భావించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కి.. సోషల్‌ మీడియాకు ఎక్కడంతో వ్యూహం మార్చి.. హంగూ ఆర్భాటం లేకుండా సన్మానం చేశారు. కలెక్టర్‌ సీరియస్‌ కావడంతో బదిలీ అయిన పీడీ వెంటనే రిలీవ్‌ అయ్యారు. అమరావతికి వెళ్లి మాతృశాఖకు రిపోర్ట్‌ చేసుకున్నారు. డ్వామాలో కీలకంగా ఉండే హెచఆర్‌, విజిలెన్స విభాగం అధికారులు సెలవులో వెళ్లారు. పీడీ సన్మానసభకు మాత్రం హాజరయ్యారు. నెల రోజల క్రితం ఎనిమిది మంది ఏపీఓలను బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో కొందరు కేటాయించిన మండలాల్లో విధుల్లో చేరారు. కంబదూరుకు బదిలీ అయిన


సుజాత మాత్రం విధుల్లో చేరలేదు. పైగా బుక్కరాయసముద్రం మండలంలో పనిచేస్తున్నట్లు డ్యూటీ సర్టిఫికెట్‌ సృష్టించారు. పెద్దవడుగూరు ఏపీఓ పుల్లారెడ్డి అక్కడ విధుల్లో లేకపోయినా.. బదిలీ అయిన పీడీ ద్వారా అక్కడే ఉన్నట్లు అందరినీ నమ్మించారు. అక్కడే జీతం తీసుకున్నారు. ఇలాంటివి డ్వామాలో సర్వసాధారణమయ్యాయి. వైసీపీ పాలనలో డ్వామాను ఏలినవారికే తిరిగి ప్రాధాన్య స్థానాలను అప్పగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

సెలవులో హెచఆర్‌ మేనేజర్‌

ఉద్యోగుల బదిలీల నేపథ్యంలో పది రోజులుగా హెచఆర్‌ మేనేజర్‌ గీత సెలవులో ఉన్నారు. ఇదే విభాగంలో పనిచేస్తున్న ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ శాఖనే శాసించే స్థాయికి చేరాడు. ఉద్యోగుల బదిలీల పేరిట రూ.లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో డ్వామాలో కీలకంగా ఉండే విజిలెన్స విభాగం అధికారి రెండు నెలలుగా సెలవులో ఉన్నారు. ఆ అధికారి అదే స్థానం కోసం, డీపీఓ పోస్టుకోసం తీవ్రప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఖరీదైన ప్రేమ

బదిలీపై వెళ్ళిన పీడీపై డ్వామాలో కొందరు ఉద్యోగులు ఖరీదైన ప్రేమను చాటుకోబోయారు. భజన బృందంగా ఏర్పడి.. పీడీకి బంగారు కడియం తొడగాలని, ఘనంగా వీడ్కోలు పలకాలని హంగు ఆర్భాటాలతో ఏర్పాట్లు చేశారు. పీడీని బదిలీ చేయడంతోపాటు వెంటనే రిలీవ్‌ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. వెంటనే ఆదేశాలను అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కానీ 17వ తేదీ వరకు గడువు కావాలని పీడీ కోరారు. ఈ లోగా భజనబృందం వసూళ్లను ప్రారంభించింది. ఒక్కో ఉద్యోగి నుంచి రూ.5 వేలు.. రూ.10 వేలు వసూలు చేసింది. ఈ విషయం సోషల్‌ మీడియా ద్వారా బయటకు పొక్కడంతో పీడీ అప్రమత్తమై.. వెంటనే రిలీవ్‌ అయ్యారు. అమరావతికి బయలుదేరి వెళ్ళారు. వ్యవహారం చెడిపోవడంతో ఉద్యోగుల నుంచి వసూలు చేసి డబ్బులను వెనక్కు ఇచ్చేసినట్లు సమాచారం. బదిలీ అయిన పీడీ ద్వారా పలు పనులకు సంబంధించిన ఫైళ్లపై పాత తేదీలతో సంతకాలు చేయించారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా భజనబృందం పనే అని ఆ శాఖలో చర్చ జరుగుతోంది.

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు

వైసీపీ హయాంలో హవా నడిపిన ఓ ఏపీఓ ధర్మవరం క్లస్టర్‌ ఏపీడీగా పనిచేశారు. తిరిగి ఏపీడీ పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రి క్లస్టర్‌ పరిధిలోని పెద్దవడుగూరులో పనిచేస్తూ, భజనబృందంలో కీలకంగా ఉన్నారు. పీడీకి ఘన సన్మానం చేయాలనే అంశంలో కీలకపాత్ర పోషించారు. అనంతపురం క్లస్టర్‌తో పాటు గుంతకల్లు నియోజకవర్గంలోని ఓ క్లస్టర్‌ ఏపీడీ, పీడీ కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు తమ స్థానాలు పదిలం చేసుకోవడం కోసం ‘భజన’ గీతాలు పాడుతున్నారు.

ఇనచార్జి పీడీగా విజయలక్ష్మి

డ్వామా ఇనచార్జి పీడీగా విజయలక్ష్మి నియమితులయ్యారు. ఏఓగా పనిచేస్తున్న విజయలక్ష్మికి ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను ఆమె బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం డ్వామా కార్యాలయంలో పీడీగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెను పలువురు అధికారులు, సిబ్బంది అభినందించారు. కలెక్టర్‌ నిర్ణయంతో ఆశావహులు షాక్‌ తిన్నారు. డ్వామా అడిషినల్‌ పీడీ సుధాకర్‌రెడ్డి, ఉపాధి హామీపథకం సూపరిండెంట్‌ శైలజ, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రామాంజినేయులు, వ్యవసాయ శాఖ ఏడీ అల్తా్‌ఫతో పాటు పలువురు ఇనచార్జి పీడీ పోస్టు కోసం తీవ్రప్రయత్నాలు చేశారు. రెగ్యులర్‌ పోస్టు కోసం ఆశావహులు ప్రయత్నాలను మరింత తీవ్రం చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 19 , 2024 | 12:01 AM