కునుకుంట్ల కుంటకు నీరివ్వండి
ABN , Publish Date - Nov 14 , 2024 | 11:52 PM
తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామంలో నీరు లేక నిర్జీవంగా మారిన కుంటకు పీబీసీ ద్వారా నీరు ఇవ్వాలని ఆ గ్రామస్థులు టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్‌ను కోరారు.
ధర్మవరం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామంలో నీరు లేక నిర్జీవంగా మారిన కుంటకు పీబీసీ ద్వారా నీరు ఇవ్వాలని ఆ గ్రామస్థులు టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్‌ను కోరారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రామస్థులు శ్రీరామ్‌ను కలిశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ కొన్నేళ్లగా కుంటలో నీరులేక భూగర్భజలాలు ఇంకిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పీబీసీ కుడి కాలువ తాడిమర్రి మండలంలో ఉన్నప్పటికీ నీరు వచ్చేపరిస్థితి లేదన్నారు. ఈసారి ప్రాజెక్టుల్లో నీరు ఉన్న క్రమంలో కనీసం ఈ ఏడాదైనా కాలువకు నీరు ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేశారు. దీనిపై శ్రీరామ్ స్పందిస్తూ కునుకుంట్లకు నీరు వచ్చే మార్గాలను ఆ గ్రామానికి వచ్చి పరిశీలిస్తామని, జలవనరుల శాఖ మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సంధా రాఘవ, తాడిమర్రి మండల కన్వీనర్ కూచి రామ్మోహన పాల్గొన్నారు. అనంతరం సభ్యత్వనమోదుపై పరిటాల శ్రీరామ్ సమావేశం నిర్వహించారు.