Share News

Roads : ముందుంది మంచికాలం

ABN , Publish Date - Aug 22 , 2024 | 12:44 AM

కూటమి పార్టీలు అధికారంలోకి రావడంతో గ్రామీణ రోడ్ల (సీసీ రోడ్లు) దశ మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రతి మండలానికి రోడ్ల అభివృద్ధి కోసం రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో నివేదికను తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్కన జిల్లా వరకు సుమారు రూ. 100 కోట్ల వరకు అంచనా నివేదిక తయారు కానున్నట్లు ఆశాఖ వర్గాల సమా చారం. నూతన ప్రభుత్వం గ్రామీణ రహదారుల నిర్మాణానికి ...

Roads : ముందుంది మంచికాలం
Yadiki mandal Pacharu Mekalapally- Chandana road like this..

కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీనసిగ్నల్‌..!

ఒక్కో మండలానికి రూ.3 కోట్లతో అంచనా నివేదిక

కూటమి ప్రభుత్వం రాకతో పల్లె రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం

నివేదిక తయారు చేయడంలో నిమగ్నమైన అధికారులు

కూటమి పార్టీలు అధికారంలోకి రావడంతో గ్రామీణ రోడ్ల (సీసీ రోడ్లు) దశ మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రతి మండలానికి రోడ్ల అభివృద్ధి కోసం రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో నివేదికను తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్కన జిల్లా వరకు సుమారు రూ. 100 కోట్ల వరకు అంచనా నివేదిక తయారు కానున్నట్లు ఆశాఖ వర్గాల సమా చారం. నూతన ప్రభుత్వం గ్రామీణ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో ఆయా ప్రాంతాల ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

- అనంతపురం సిటీ


ఒక్కో మండలానికి రూ.మూడు కోట్లు

గత వైసీపీ పాలనలో గ్రామీణ రహదారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు ప్రశ్నించినా అప్పటి వైసీపీ సర్కార్‌ అస్సలు పట్టించుకోదు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు అధికారంలోకి రావడం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్‌ పంచాయతీ రాజ్‌శాఖపై దృష్టి సారించారు. గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం ఒక్కో మండలానికి రూ. మూడు కోట్లు చెప్పున అంచనా నివేదిక పంపాలని ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ లెక్కన జిల్లాలో 31 మండలాలతో పాటు అనంతపురం అర్బన పరిధిలోని నాలుగు పంచాయతీలు కలిసి చూస్తే.. సుమారు రూ. 100 కోట్ల వరకు అంచనా నివేదికలు తయారు కానున్నట్లు ఆశాఖ వర్గాల నుంచి తెలిసింది. ఈ పనులన్నీ కూడా ఉపాధి హామీ పథకం కింద చేయనున్నారు. ఈ పనులన్నీ వచ్చే మార్చి 31కి పూర్తి చేయాలని ప్రభుత్వం షరతు విధించింది. అలాగే బీటీ రోడ్ల పరంగా కూడా నియోజకవర్గానికి రూ. 4 కోట్ల చెప్పున అంచనాలు పంపాలని ఆదేశించారని ఆశాఖ వర్గాల నుంచి తెలిసింది. ఈ లెక్కన బీటీ రోడ్ల పరంగా.. సుమారు రూ. 30 కోట్ల వరకు అంచనా నివేదిక ఉండనుంది.

ఐదేళ్లలో రెండుసార్లే నిధులు...

గత వైసీపీ సర్కార్‌ గ్రామీణ రహదారులను పూర్తిగా విస్మరించింది. ఐదేళ్ల పాలనలో కేవలం రెండు దఫాలుగా మాత్రమే నిధులు కేటాయించి మమ అనిపించింది. దీంతో రోడ్ల అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. జిల్లాలో ఉరవకొండ, రాప్తాడు, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజవర్గ పరిధి ప్రాంతాల్లో గ్రామీణ రహదారులు ఎక్కువ శాతం దెబ్బతిన్నట్లు ఆశాఖ వర్గాల ద్వారా తెలిసింది. గత సర్కార్‌ రెండుసార్లు మాత్రమే నిధులు కేటాయించి గ్రామీణ రహదారులను గాలికి వదిలేసిందనే విమర్శలు ఉన్నాయి. ఈక్రమంలోనే గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి.

నిమగ్నమైన అధికారులు..

గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే ఆశాఖ అధికారులు కూడా ఆ దిశగా ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారిగా.. ఉన్నతాధికారులు బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాల ప్రజలు, సర్పంచలు, ఎమ్మెల్యేలతో చర్చించి రోడ్ల నివేదికను తయారు చేయడంలో తలమునకలైనట్లు సమాచారం. వచ్చే వారం రోజుల్లో ఈ నివేదిక తయారుకానున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ సర్కార్‌ రోడ్ల పరంగా బిల్లులు మంజూరు చేయడంలో ఏళ్ల తరబడి జాప్యం చేయడంతో ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లు ఎక్కువ శాతం దెబ్బతిన్నారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్ల అంచనాలు తయారు చేయమని ప్రభుత్వం అదేశించినా.. అధికారులు నివేదిక తయారు చేసినా.. ఆశించిన స్థాయిలో కాంట్రాక్టర్లు పనులు చేస్తారో...? లేదో.. అన్న సందిగ్ధం ఆశాఖ వర్గాల్లో నెలకుంది.

ప్రభుత్వం అంచనా నివేదిక కోరింది

ప్రస్తుత ప్రభుత్వం జిల్లాలోని గ్రామీణ రహదారులు, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి తగిన అంచనా నివేదిక తయారు చేసి అందజేయమని ఆదేశాలు జారీ చేసింది. అదే పనిలో అధికారులందరూ నిమగ్నమయ్యారు. అతి త్వరలోనే తగిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం. పెద్దఎత్తున అంచన నివేదికలను ప్రభుత్వం కోరడం శుభపరిణామం. ఈ పనులను వచ్చే మార్చిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం షరతూ విధించింది.

- కేవీ ప్రసాద్‌, జిల్లా పంచాయతీ రాజ్‌శాఖ ఎస్‌ఈ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 22 , 2024 | 12:44 AM