Share News

Ycp : నిధులే మింగేశాయా..?

ABN , Publish Date - Dec 11 , 2024 | 01:08 AM

పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర ఆత్మహత్యకు వైసీపీ హయాంలో జరిగిన అవినీతి ఒత్తిళ్లే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పంచాయతీ నిధుల వినియోగం గురించి ఆరా తీస్తున్నారు. ఇద్దరు వైసీపీ నాయకుల ఒత్తిడి కారణంగానే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని రాఘవేంద్ర తండ్రి నాగభూషణం ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రాఘవేంద్రబాబు జూన ..

Ycp : నిధులే మింగేశాయా..?

అవినీతి ఒత్తిళ్లతోనే రాఘవేంద్ర ఆత్మహత్య

వైసీపీ హయాంలో రూ.50 లక్షలు పక్కదారి..?

పనులు చేయకనే బిల్లులు చేసుకున్నారా..?

నకిలీ బిల్లులు వాడినట్లు పోలీసుల నిర్ధారణ..?

కళ్యాణదుర్గం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర ఆత్మహత్యకు వైసీపీ హయాంలో జరిగిన అవినీతి ఒత్తిళ్లే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పంచాయతీ నిధుల వినియోగం గురించి ఆరా తీస్తున్నారు. ఇద్దరు వైసీపీ నాయకుల ఒత్తిడి కారణంగానే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని రాఘవేంద్ర తండ్రి నాగభూషణం ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రాఘవేంద్రబాబు జూన 2023న కంబదూరు మండలం మర్రిమాకులపల్లిలో విధుల్లోకి చేరారు. ఆరు నెలల క్రితం కంబదూరు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆత్మహత్య చేసుకునే సమయానికి ఆయన కంబదూరు, మర్రిమాకులపల్లితోపాటు రాళ్ల అనంతపురం పంచాయతీలకు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో


మూడు పంచాయతీలలో నిధుల డ్రా, వినియోగం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

రూ.50 లక్షలు డ్రా..?

మూడు పంచాయతీలలో సుమారు రూ.50 లక్షల వరకు నిధులను రాఘవేంద్ర డ్రా చేసినట్లు తెలిసింది. ఇవన్నీ పంచాయతీ నిధులే కావడంతో ఎవరెవ్వరికి ఇచ్చారు, పనులు చేయకనే డ్రా చేశారా? వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మూడు పంచాయతీల్లో జనరల్‌ ఫండ్స్‌, 15వ ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా దుర్వినియోగం అయినట్లు తెలిసింది. దీంతో మండల పరిషత కార్యాలయం, బ్యాంకుల్లో స్టేట్‌మెంట్‌ రికార్డులను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకు నిధుల డ్రా చేసినట్లు రికార్డుల ఆధారంగా గుర్తించారు. మిగిలిన నిధులను ఎక్కడెక్కడ, ఎంత ఖర్చు చేశారో తేల్చే పనిలో నిమగ్నయ్యారు.

చనిపోయే ముందు..

ఆత్మహత్యకు నాలుగురోజుల ముందు రాఘవేంద్ర రూ.4 లక్షలు డ్రా చేసినట్లు తెలిసింది. కంబదూరు మండల పరిషత కార్యాలయంలోని ఓ అధికారితో సంతకం చేయించుకుని, ఆ నిధులను డ్రా చేసినట్లు తెలిసింది. దీంతో ఆ అధికారి ఆందోళనకు గురవుతున్నారు. ఆ రూ.4 లక్షలు ఏ నిధుల నుంచి డ్రా చేశారో, ఎవరికి ఇచ్చారో తెలియడం లేదు.

ఆపరేటర్‌ వద్ద ఆధారాలు

వైసీపీ హయాంలో పనిచేసిన ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ చేత రాఘవేంద్ర బిల్లులను అప్‌లోడ్‌ చేయించేవారు. దీంతో ఆ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను కూడా పోలీసులు పిలిపించారు. ఎక్కడెక్కడ నిధులను డ్రా చేశారు, ఎంతమేరకు బిల్లులు అప్‌లోడ్‌ చేశారని ప్రశ్నించి, వివరాలు రాబట్టారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇచ్చిన ఆధారాలతోనే బ్యాంకులో ఓ రూ.20 లక్షలకు సంబంధించి వితడ్రా స్టేట్‌మెంట్‌ లభ్యమైనట్లు తెలిసింది. పంచాయతీలలో నిధుల డ్రా వెనుక నలుగురు అధికారుల హస్తం ఉందని తెలిసింది. వారి మెడకు ఉచ్చు బిగుస్తోంది. దీంతో ఆ నలుగురు ఆందోళనకు గురవుతున్నారు.

క్యాష్‌ బుక్‌ ఎక్కడ?

రాఘవేంద్రబాబు నిధుల డ్రా కోసం ఉపయోగించిన క్యాష్‌ బుక్‌ మాయమైనట్లు తెలిసింది. క్యాష్‌ బుక్‌ ఎవరివద్ద ఉందో తెలియడం లేదు. జనరల్‌ ఫండ్స్‌, 15వ ఆర్థిక సంఘం నిధుల డ్రా వివరాలను క్యాష్‌ బుక్‌లోనే నమోదు చేస్తారు. ప్రస్తుతం ఆ పుస్తకం మాయం కావడం అనుమానాలకు తావిస్తోంది. నకిలీ బిల్లులు సృష్టించి జనరల్‌ ఫండ్స్‌, 15వ ఆర్థిక సంఘం నిధులను డ్రా చేసినట్లు తెలిసింది. ఆ బిల్లులన్నీ నకిలీవే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నకిలీ బిల్లులను చూపించి నిధులను పక్కదారి పట్టించారని స్పష్టంగా తెలుస్తోంది. నకిలీ బిల్లులు ఎక్కడివో, వాటి వెనుక ఎవరెవరు ఉన్నారో పోలీసులు నిగ్గుతేల్చేపనిలో ఉన్నారు.

ఇక్కడ ఉండలేం..

కంబదూరు మండల పరిషత కార్యాలయంలో పనిచేసే అధికారులకు విధి నిర్వహణ కత్తిమీద సాములాగా తయారైయింది. రాఘవేంద్ర ఆత్మహత్య తరువాత పోలీసులు సవాలక్ష ప్రశ్నలు వేస్తున్నారు. ఆధారాలు అడుగుతున్నారు. దీంతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు అధికారలు ఆందోళన చెందుతున్నారు. కార్యాలయంలో ఉండలేమని బహిరంగంగా చెబుతున్నారు. దీన్నిబట్టి.. వైసీపీ హయాంలో అవినీతి ఏ స్థాయిలో ఊహించుకోవచ్చు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 11 , 2024 | 01:08 AM