Share News

AADUDAM ANDHRA : దాచేశారు?

ABN , Publish Date - Jul 03 , 2024 | 11:53 PM

గత వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భారీస్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్థాయిలో పలువురు ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ఆర్భాటానికే పరిమితమైంది. నామమాత్రంగా క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన, కబడ్డీ, ఖోఖో తదితర ఆటల పోటీలు నిర్వహించారు. ఇందుకోసం ఒక్కో సచివాలయానికి ...

AADUDAM ANDHRA : దాచేశారు?
Officials distributing sports equipment in Utopia School (File)

‘ఆడుదాం ఆంధ్రా’ కిట్లు మాయం ?

వలంటీర్లు, వైసీపీ నాయకుల వద్దనే కిట్లు

పట్టించుకోని మండలస్థాయి అధికారులు

తాడిపత్రి, జూలై 3: గత వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భారీస్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్థాయిలో పలువురు ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ఆర్భాటానికే పరిమితమైంది. నామమాత్రంగా క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన, కబడ్డీ, ఖోఖో తదితర ఆటల పోటీలు నిర్వహించారు. ఇందుకోసం ఒక్కో సచివాలయానికి సుమారు లక్ష రూపాయలు పైన వెచ్చించి క్రీడా సామగ్రిని కొనుగోలు చేశారు. ఈ ఆట వస్తువులన్నీ కొందరు వలంటీర్లు, వైసీపీ నాయకుల ఇళ్ల వద్ద ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా క్రీడా సామగ్రి


సచివాలయాలకు చేరలేదు. కొన్ని గ్రామాల్లో ఈ కిట్లు మా ప్రభుత్వంలో వచ్చాయి. మేమెందుకు వెనక్కి ఇవ్వాలంటూ పలువురు వైసీపీ నాయకులు, వలంటీర్లు సంబంధిత పంచాయతీ కార్యదర్శులను దబాయిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఆటలు నిర్వహించిన అనంతరం పంచాయతీ కార్యదర్శి సచివాలయంలోనే క్రీడాసామగ్రిని భద్రపరచాలనే నిబంధన ఉంది. కానీ అలా జరగలేదు. కనీసం సచివాలయాలకు ఏ ఆట వస్తువులు వచ్చాయో కూడా తెలియడం లేదు. మరికొన్నిచోట్ల మాకు తెలియదంటే మాకు తెలియదంటూ విద్యాశాఖ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ఒకరిమీద ఒకరు చెప్పుకోవడం విమర్శలకు తావిస్తోంది.

పుట్లూరు, యల్లనూరు మండలాల్లో పత్తాలేని కిట్లు

ఆడుదాం ఆంధ్రా క్రీడాసామగ్రి కొనుగోలు చేసిన వివరాలను అధికారులు చెప్పకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుట్లూరు, యల్లనూరు మండలాలకు ఏ కిట్లు వచ్చాయో, అవి ఎక్కడ ఉన్నాయో తమకు తెలియదంటూ మండల స్థాయి అధికారులే చెప్పడం గమనార్హం. ఈ రెండు మండలాల్లో సర్పంచులు, ఎంపీపీలు ఎక్కువ భాగం వైసీపీ వారే ఉండటంతో ఆ గ్రామాల పరిధిలో వలంటీర్ల వద్దనే సామగ్రి ఉన్నట్లు సమాచారం. వాటిని అడిగేందుకు అధికారులు విముఖత చూపుతున్నారు. సచివాలయ సిబ్బంది వాటిని


పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఆ క్రీడా సామగ్రి గురించి తెలియదు

మండలంలో ఆడుదాం ఆంధ్రా క్రీడా సామగ్రి విషయం నాకు తెలియదు. మండలానికి ఎన్ని వస్తువులు వచ్చాయో అవి ఎక్కడ ఉన్నాయో కూడా నాకు తెలియదు. కొద్దిరోజులు తర్వాత విచారించి చెబుతా. ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటాం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 03 , 2024 | 11:53 PM