PARITALA SUNITHA: జగన ఉండి ఉంటే.. జల సమాధులు చూడాల్సి వచ్చేది
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:13 AM
విజయవాడ, గుంటూరు జిల్లాల్లో సంభవించిన వరద విపత్తు సమయంలో జగన సీఎంగా ఉండి ఉంటే జల సమాధులు చూడాల్సి వచ్చేదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.
అనంతపురం అర్బన, సెప్టెంబరు 11: విజయవాడ, గుంటూరు జిల్లాల్లో సంభవించిన వరద విపత్తు సమయంలో జగన సీఎంగా ఉండి ఉంటే జల సమాధులు చూడాల్సి వచ్చేదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. బుధవారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం లంక గ్రామాల పరిధిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. వరదల్లో మునిగిన కంద, పసుపు, అరటి, మొక్కజొన్న పంటలపొలాలను పరిశీలించారు. లక్షలాది రూపాయలు పెట్టుబడితో సాగుచేసిన పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయని, ఒక్క రూపాయి వచ్చే పరిస్థితి లేదని బాధిత రైతులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన చెందారు. ప్రభుత్వం తప్పనిసరిగా పంటనష్టపరిహారం అందించి ఆదుకుంటుందని భరోసానిచ్చారు. అన్నవరపులంక గ్రామంలో వరదలతో సర్వం కోల్పోయిన బాధిత ప్రజలను పరామర్శించారు. అనంతరం గుంటూరు జడ్పీ చైర్మన హెనీ క్రిస్టినా, హార్వెస్ట్ ఇండియా సంస్థ నిర్వాహకులు సురేష్ సహకారంతో దుప్పట్లు, దోమతెరలు, వంట పాత్రలను పరిటాల సునీత పంపిణీ చేశారు. అనంతరం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజనలో శాంతినగర్ మజీద్ ప్రాంతంలో ఆమె పర్యటించారు. అక్కడి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరదలను లెక్కచేయకుండా సీఎం చంద్రబాబునాయుడు ఒక శ్రామికుడిలా పనిచేస్తూ ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని తగ్గిస్తున్నారన్నారు.