Share News

Village : ఒక ఊరిలో...అనుకోకుండా ఓ హత్య

ABN , Publish Date - Jul 25 , 2024 | 12:14 AM

చిత్రావతి ఒడ్డున ఉండే అందమైన పల్లెటూరు అది. చెన్నేకొత్తపల్లి మండలంలో.. మారుమూలన ఉండే ఆ ఊరి పేరు వెల్దుర్తి. సుమారు ఐదొందల గడపలు, పన్నెండొందల మంది ఓటర్లు ఉంటారు. ఆ ఊరు ఒక్కటే ఒక పంచాయతీ..! ఐదెకరాల నుంచి పదెకరాల వరకూ పొలాలు ఉండే రైతులు ఎక్కువ. ఇరభై.. ముప్పై ఎకరాల పొలాలు ఉండేవారు అతికొద్ది మంది ఉంటారు. అన్ని ఊర్లలో మాదిరి భిన్నమైన సామాజికవర్గాలు ఉన్నాయి. కానీ అరుదుగా ఉండే ఐక్యత, ...

Village : ఒక ఊరిలో...అనుకోకుండా ఓ హత్య
The shop was set on fire by the villagers

ఆవేదనకు లోనైన జనం

నిందితుల గ్రామ బహిష్కరణ

చిత్రావతి ఒడ్డున ఉండే అందమైన పల్లెటూరు అది. చెన్నేకొత్తపల్లి మండలంలో.. మారుమూలన ఉండే ఆ ఊరి పేరు వెల్దుర్తి. సుమారు ఐదొందల గడపలు, పన్నెండొందల మంది ఓటర్లు ఉంటారు. ఆ ఊరు ఒక్కటే ఒక పంచాయతీ..! ఐదెకరాల నుంచి పదెకరాల వరకూ పొలాలు ఉండే రైతులు ఎక్కువ. ఇరభై.. ముప్పై ఎకరాల పొలాలు ఉండేవారు అతికొద్ది మంది ఉంటారు. అన్ని ఊర్లలో మాదిరి భిన్నమైన సామాజికవర్గాలు ఉన్నాయి. కానీ అరుదుగా ఉండే ఐక్యత, శాంతిసామరస్యాలు ఈ ఊరి సొంతం. అలాంటి ఊరిలో అనుకోని సంఘటన జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా.. ఆ ఊరికి వలస వచ్చి.. ఆటో నడుపుతూ, భార్యాబిడ్డలను పోషించుకుంటున్న సూర్యనారాయణ హత్యకు గురయ్యాడు.

ఒక హత్యతో...

ధర్మవరం మండలం సీసీ కొత్తకోట వద్ద ఈ నెల 19న సూర్యనారాయణ హత్య


జరిగింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. నిందితులను గుర్తించారు. పొలం తగాదా కారణంగా సూర్యనారాయణను సొంత బావమరిది మల్లికార్జున, ఆయన కుమారుడు రాము, అల్లుడు రాజు, బంధువు లక్ష్మీనారాయణ హత్య చేసినట్లు గుర్తించారు. వారిని ఈ నెల 22న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇన్నాళ్లూ ఏ గొడవలూ ఎరుగని ఆ ఊరి జనం.. ఈ హత్యతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఎప్పుడూ లేనిది పచ్చటి పల్లెకు రక్తపు మరకలు అంటడాన్ని జీర్ణించుకోలేకపోయారు. వారి ఆవేదన ఆగ్రహంగా మారింది. ‘ఊరికి చెడ్డపేరు తెచ్చిన ఇలాంటివారు ఇక్కడ ఉండటానికి వీల్లేదు..’ అని తీర్మానం చేసుకున్నారు. నిందితులకు సంబంధించిన ఓ దుకాణానికి నిప్పు పెట్టారు. వామి దొడ్లో బండలను పగులగొట్టారు. నిందితుల ఇళ్ల వద్దకు వెళ్లి.. వారి కుటుంబ సభ్యులను ఊరి నుంచి బయటకు పంపించారు.

ఆగ్రహానికి కారణం ఇదే..

వెల్దుర్తి జనం భూమిని నమ్ముకుని బతుకుతున్నారు. తమ బిడ్డలను చదివించి, సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. చాలా కుటుంబాలలో ఉపాధ్యాయులు, ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఉండటం ఇందుకు నిదర్శనం. రాజకీయాలపరంగానూ ఇక్కడ ఎంతో సామరస్యం కనిపిస్తుంది. ఊరిలో వైసీపీ, టీడీపీ సహా అన్ని పార్టీల మద్దతుదారులు ఉన్నారు. కానీ ఎన్నికల సమయంలో తప్ప వారు రాజకీయాల గురించి పట్టించుకోరు. నచ్చిన పార్టీలకు ఓటేస్తారు. ఆ ప్రభావం ఎక్కడా కనిపించదు. అందరూ కలిసిమెలిసి జీవిస్తారు. ఇలాంటి ఊరులో అలాంటి ఘటన జరగడంతో జనం ఆగ్రహించారు.

ఇదే చివరిది కావాలి..

నిందితులను గ్రామ బహిష్కరణ చేయడం చట్టపరంగా సరికాదు. కానీ, ఆ నిర్ణయం వెనుక వారి ఉద్దేశం మాత్రం సుస్పష్టం..! ‘మా ఊరిలో గొడవలకు చోటు లేదు. నేరాలకు అస్సలు చోటు లేదు. వాటితో సంబంధం ఉన్నవారికి, ఆ మార్గంలో నడిచేవారికి కూడా మా ఊరిలో చోటు లేదు..’ అని సందేశం ఇవ్వడమే..! భవిష్యత్తులో ఎవరూ గొడవల జోలికి వెళ్లకుండా చేయగలిగేంత కఠిన నిర్ణయం ఇది. అయినా.. ఊరి జనం ఇంకోసారి ఆలోచించాలి. నేరస్థులను శిక్షించే బాధ్యత న్యాయ వ్యవస్థ తీసుకుంటుంది. ఇప్పటికే చట్టపరంగా తాము చర్యలు తీసుకున్నామని పోలీసులు ఆ ఊరి జనానికి చెప్పారు. సంయమనం పాటించాలని కోరారు. అనుకోకుండా జరిగిన ఆ హత్యను పీడకలగా భావించి వదిలేయాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా.. తమ ఊరికి మరింత వన్నె తీసుకురావాలి. రాయలసీమ అంటే ఫ్యాక్షన గొడవలు అని ముద్రవేసేవారికి.. ఇక్కడి జనం శాంతిని ఎంతగా కోరుకుంటారో చెప్పిన ఊరు వెల్దుర్తి. అలాంటి ఊరిలో.. ఇదే చివరి గొడవ కావాలి..!

- చెన్నేకొత్తపల్లి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 25 , 2024 | 12:14 AM