NARASIMHASWAMY: ఘనంగా లక్ష్మీనరసింహస్వామి జయంతి
ABN , Publish Date - May 22 , 2024 | 11:50 PM
పట్టణంలోని సిద్దయ్యగుట్టలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
ధర్మవరం, మే 22: పట్టణంలోని సిద్దయ్యగుట్టలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకాలు నిర్వహించి అనంతరం వివిధ రకాల పూలు, తులసీమాలలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం పాటలను, భజనలు భక్తులు చేపట్టారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు చేయించారు.
తాడిమర్రి: మండల కేంద్రంలో లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. నారసింపల్లి, ఏకపాదంపల్లి గ్రామాల్లోని ఆలయాల్లో ఉదయం 6గంటలకే పూజా కార్యక్రమాలు ప్రారంభించి 10గంటలకు కల్యాణోత్సవంతో ముగించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు.
తప్పిన ముప్పు: నారసింపల్లి గ్రామంలో కొండపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో పెద్ద గుండ్లు మంగళవారం రాత్రి ఉన్నఫలంగా పగిలిపోయి కొండమీద నుంచి కిందకు వచ్చాయి. అయితే ఆలయం భాగంలో ఉన్న వేపచెట్టుకు తగిలి రెండు గుండ్లు నిలిచిపోయాయి. మరొకటి ఇంకాస్త కిం దకు వచ్చి ఆగిపోయింది. గుండ్లు కిందకు పొర్లడంతో గ్రామస్థులు భయాందోళనకు లోనయ్యారు. ఘటనా స్థలాన్ని తాడిమర్రి ఎస్‌ఐ నాగాస్వామి పరిశీలించారు.