Tungabhadra Dam : ఒకే ఒక ఆశయం..!
ABN , Publish Date - Aug 14 , 2024 | 12:49 AM
తుంగభద్ర డ్యాం నిండింది. దిగువన ఆయకట్టు సేద్యానికి సిద్ధమైంది. జలాశయం గరిష్ఠ నీటి మట్టానికి చేరుకోవడంతో క్రస్ట్ గేట్‌ల ద్వారా నదికి వరద నీటిని వదిలారు. ఇంతలో అనుకోని విపత్తు ఎదురైంది. నీటి ఉధృతికి 19వ నంబరు క్రస్ట్ గేట్ ఐదు రోజుల క్రితం కొట్టుకుపోయింది. దీంతో డ్యాం ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. వృథాగా దిగువకు పరుగులు తీస్తున్న నీటిని ఆపేందుకు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు, నిపుణులు రంగంలోకి దిగారు. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం మరింత చొరవ చూపింది. క్రస్ట్ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ ...
నీరు నిలపాలి.. విపత్తును గెలవాలి
టీబీ డ్యాం వద్ద మంత్రులు, నాయకులు
స్టాప్ లాగ్ ఏర్పాటు పనుల పర్యవేక్షణ
నిపుణులతో మంతనాలు.. నిధులకు భరోసా
తుంగభద్ర డ్యాం నిండింది. దిగువన ఆయకట్టు సేద్యానికి సిద్ధమైంది. జలాశయం గరిష్ఠ నీటి మట్టానికి చేరుకోవడంతో క్రస్ట్ గేట్‌ల ద్వారా నదికి వరద నీటిని వదిలారు. ఇంతలో అనుకోని విపత్తు ఎదురైంది. నీటి ఉధృతికి 19వ నంబరు క్రస్ట్ గేట్ ఐదు రోజుల క్రితం కొట్టుకుపోయింది. దీంతో డ్యాం ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. వృథాగా దిగువకు పరుగులు తీస్తున్న నీటిని ఆపేందుకు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు, నిపుణులు రంగంలోకి దిగారు. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం మరింత చొరవ చూపింది. క్రస్ట్ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు చేసే ప్రక్రియను ముందుండి నడిపిస్తోంది. ఇలాంటి విషయాలలో పట్టున్న కన్నయ్య నాయుడిని రంగంలోకి దించింది. ఆయన అద్భుత
ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ముందు ఉంచారు. జలాశయంలోని నీటిని ఖాళీ చేస్తేగానీ గేట్‌ను పునరుద్ధరించలేమని భావించిన స్థితి నుంచి.. పారే నీటిలోనే గేటును అమర్చే దిశగా, డ్యాంలో నీటి నిల్వల్లో సగానికి పైగా కాపాడుకునే దిశగా చర్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మంత్రులు పయ్యావుల, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు కాలవ, అమిలినేని, గుమ్మనూరు తదితరులు మంగళవారం డ్యాంను సందర్శించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య సైతం అక్కడికి వచ్చారు. నిపుణులతో చర్చించి.. తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. దేశంలో మునుపెన్నడూ జరగని అద్భుతాన్ని ఆవిష్కరిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. - రాయదుర్గం/బళ్లారి
ఇంజనీరింగ్ చరిత్రలోనే అద్భుతం: కేశవ్
తుంగభద్ర జలాశయంలో స్టాప్‌లాగ్‌ను ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ చరిత్రలోనే అద్భుతం సృష్టించబోతున్నాం. వేగంగా, ఉధృతంగా ప్రవహిస్తున్న నీటికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రక్రియలో సాంకేతికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పూర్తిస్థాయిలో నీటిని కాపాడుకునే బాధ్యతను ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించాము. రాజకీయంగా ఎలాంటి జోక్యం ఉండదు. సీడబ్ల్యూసీ గైడెన్స ప్రకారం ఇంజనీర్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరువుసీమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఉన్న ఏకైక ప్రాజెక్ట్ తుంగభద్ర. వీలైనంత త్వరగా పనులు ముగించి ఈ సంక్షోభం నుంచి గట్టెక్కుతాం.
భయం లేదు.. మళ్లీ నిండుతుంది: సిద్దరామయ్య
వీలైనంత త్వరగా గేటును అమర్చి నీటి వృథాను అరికడతాం. వర్షాలు వచ్చి మళ్లీ జలాశయం నిండుతుంది. నేనే వచ్చి వాయనం సమర్పిస్తాను. 19వ గేటు ఎక్కువ కాలం మన్నిక వచ్చింది. 1954 నుంచి కాలువలకు నీరు వదిలారు. సుమారు 70 సంవత్సరాల పాటు క్రస్ట్‌గేట్లు మన్నిక వచ్చాయి. కన్నయ్య నాయుడు సూచనలతో స్టాప్‌లాగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆగస్టు 17 తరువాత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రైతులు అధైర్యపడాల్సిన అవసరంలేదు.
రాతి కట్టడమే సమస్య: కన్నయ్య నాయుడు
తుంగభద్ర జలాశయానికి స్టాప్‌లాగ్ ఏర్పాటు చేయాలని గతంలో చాలా ప్రయత్నాలు చేశాం. రాతితో డ్యాంను నిర్మించడంతో సాధ్యం కాలేదు. ఒక్కరాయి కదిలినా పూర్తిగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే స్టాప్‌లాగ్‌ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం. తుంగభద్రలో ఈ సమస్య తొలిసారిగా ఎదురైంది. చైనల మార్పుతో పాటు రోప్‌ల మరమ్మతులు చేయాలని సీడబ్ల్యుసీకి ప్రతిపాదించాం. మా సూచన ప్రకారం గేట్లకు పూర్తిస్థాయి మరమ్మతులు చేస్తే 30 సంవత్సరాల పాటు ఇలాంటి ఇబ్బందులు ఎదురు కావు.
అందుకే ఈ దుస్థితి: కాలవ
టీబీ డ్యాం క్రస్ట్‌గేట్లను మార్చాలని సాంకేతిక నిపుణుడు కన్నయ్యనాయుడు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడమే ఈ దుస్థితికి కారణం. తుంగభద్ర డ్యాం నిండుకుండలా ఉండటంతో రైతుల ఆశలు చిగురించాయి. ఈ దశలో క్రస్ట్‌గేట్ కొట్టుకుపోవడం బాధాకరం. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి తలెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్య తలెత్తిన క్షణం నుంచి జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో చర్చిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా నీటిని కాపాడుకునేందుకు ఉన్న మార్గాలన్నింటిని అన్వేషించాలని ఆదేశించారు. జూలైలోనే వర్షాలు వచ్చి జలాశయం నిండింది. ఇప్పుడు మళ్లీ వర్షాలు వస్తాయా రావా అన్నది తెలియడం లేదు. ఉన్న నీటిని సాధ్యమైనంత వరకు నిలుపకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
నీటి వృథా బాధాకరం: సీపీఐ
అనంతపురం విద్య: తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్ గేటు తెగిపోవడంతో జలాశయంలో నీరు వృథా అవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున తదితరులతో కలిసి ఆయన జలాశయాన్ని మంగళవారం పరిశీలించారు. జలాశయం కింద కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ పరిధిలో 12 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు సరిపడా నీరు ఈ ఏడాది ఆగస్టుకు ముందే నిల్వ ఉండటంతో రైతులు సంతోషించారని అన్నారు. ఖరీఫ్ పంటల సాగు ప్రారంభిస్తున్న తరుణంలో గేటు తెగిపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు అన్యాయం జరిగిందని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన, కేంద్రంలో ప్రధాని మోదీ తుంగభద్ర జలాశయం అభివృద్ధిపై దృష్టి సారించలేదని విమర్శించారు. ప్రతి ఏటా గేట్లను పరిశీలించి, భద్రతా చర్యలు చేపట్టివుంటే ఇలాంటి సమస్య ఉండేది కాదని అన్నారు. త్వరితగతిన గేటును పునరుద్ధరించి, ఖరీఫ్ పంటల సాగుకు ఇబ్బంది లేకుండా చూడాలని డ్యాం పరిశీలనకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....