Share News

Gram Sabha : పల్లెవించిన సభలు

ABN , Publish Date - Aug 24 , 2024 | 12:51 AM

గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. స్వర్ణ గ్రామ పంచాయతీ రూపకల్పన దిశగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో శుక్రవారం గ్రామ సభలను నిర్వహించింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు ఇందులో భాగమయ్యారు. ప్రాధాన్యక్రమంలో అభివృద్ధి అంశాలను చర్చించారు. తొలి అంశం మరుగుదొడ్లు, విద్యుత, తాగునీటి కొళాయిలు, వంట గ్యాస్‌ కనెక్షన్లు, రెండో అంశం మురుగునీటి వ్యవస్థ, ఘనవ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, ...

Gram Sabha : పల్లెవించిన సభలు
Villagers presenting a petition to MLA Paritala Sunitha

వందశాతం పంచాయతీల్లో నిర్వహణ

ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై చర్చ

ప్రజల నుంచి వినతులు, సూచనలు

స్వర్ణ పంచాయతీల రూపకల్పనకు తొలి అడుగు

హాజరైన ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 23: గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. స్వర్ణ గ్రామ పంచాయతీ రూపకల్పన దిశగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో శుక్రవారం గ్రామ సభలను నిర్వహించింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు ఇందులో భాగమయ్యారు. ప్రాధాన్యక్రమంలో అభివృద్ధి అంశాలను చర్చించారు. తొలి అంశం మరుగుదొడ్లు, విద్యుత, తాగునీటి కొళాయిలు, వంట గ్యాస్‌ కనెక్షన్లు, రెండో అంశం మురుగునీటి వ్యవస్థ, ఘనవ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంట్‌ రహదారులు, మూడో అంశం గ్రామీణ రహదారుల నిర్మాణం, మండల కేంద్రాలకు లింకు రోడ్లు, నాలుగో అంశంగా ఇంకుడు గుంతల నిర్మాణం, ఉద్యాన, పట్టు పరిశ్రమ అభివృద్ధి, పశువుల పెంపకం, షెడ్ల నిర్మాణం గురించి


చర్చించారు. ఏఏ గ్రామానికి ఏవి అవసరమో గుర్తించి.. అభివృద్ధి ప్రణాళికను రూపొందించి అమలు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 577 గ్రామ పంచాయతీలకుగానూ 576 గ్రామ పంచాయతీల్లో సభలు నిర్వహించారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పాపంపేట, నారాయణపురం గ్రామ పంచాయతీల సభలను కలిపి ఒకేచోట ఏర్పాటు చేశారు. తద్వారా వందశాతం పంచాయతీల్లో ఒకే రోజు సభలు నిర్వహించి మునుపెన్నడూ లేని ఘనతను సాధించారు.

డ్వామా నుంచి పర్యవేక్షణ

కలెక్టర్‌ ఆదేశాల మేరకు డ్వామా కాన్ఫరెన్స హాల్‌ నుంచి జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రావు బృందం గ్రామ సభలను పర్యవేక్షించింది. రోడ్లు బాగు చేయాలని, మురుగు కాలవల నిర్మించాలని, రేషనకార్డులు ఇవ్వాలని, విద్యుత దీపాలు ఏర్పాటు చేయాలని, పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని, ఉపాధి పనులు విరివిగా కల్పించాలని ప్రజలు కోరారు. గార్లదిన్నె గ్రామ సభలో ఇనచార్జి కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామసభల తీర్మానాలకు ప్రాధాన్యం: పరిటాల సునీత

రామగిరి: గ్రామ సభలలో చేసిన తీర్మానాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి.. అభివృద్ధి చేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మాదాపురం గ్రామ సభకు ఆమె హాజరయ్యారు. సర్పంచ గంగమ్మ అధ్యక్షత వహించారు. గ్రామ సమస్యలను ప్రజల ద్వారా ఎమ్మెల్యే తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తీర్మానం చేయించారు. వాటి పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. మాదాపురం నుంచి ఎలక్కుంట్ల, నరసంపల్లి, కొత్తగాదికుంట, గుదివాండ్లపల్లి గ్రామాలకు రోడ్లు వేయాలని ప్రజలు కోరారు. అనంతపురానికి బస్సు సౌకర్యం కల్పించాలని, పండ్ల తోటల పెంపకానికి పది ఎకరాల వరకూ రాయితీ వర్తింపజేయాలని కోరారు. సీసీ రోడ్లు, వీధి దీపాలు, శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని కోరారు. ఏఓ వెంకటేశ్వరప్రసాద్‌, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తినాయుడు, టీడీపీ మండల కన్వీనర్‌ సుధాకర్‌, మాజీ ఎంపీపీ పరంధామయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీలు బలోపేతం: కాలవ

రాయదుర్గం రూరల్‌: పంచాయతీలు బలోపేతంగా ఉంటేనే గ్రామాలు బాగుపడతాయని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం మండలం గ్రామదట్లలో సర్పంచ రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో వీధి దీపాలు, సీసీ రోడ్లు, తాగునీటి కొళాయిల ఏర్పాటుకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో స్థాపించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన కల్యాణ్‌ ధ్యేయమని అన్నారు. ఉపాధిహామీ పథకం కింద గ్రామంలో ఏఏ పనులు అవసరమవుతాయో ప్రతిపాదన పంపి, మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఇక గ్రామ స్వరాజ్యం: దగ్గుపాటి

అనంతపురం రూరల్‌: జగన పాలనలో పంచాయతీలకు నిధులు లేక సర్పంచలు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ విమర్శించారు. అనంతపురం రూరల్‌ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. సర్పంచు ఉదయ్‌శంకర్‌ అధ్యక్షత వహించారు. ప్రజల నుంచి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. సీఎం చంద్రబాబు గ్రామ స్వరాజ్యానికి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థ నాశనమైందని విమర్శించారు. బ్లీచింగ్‌ పౌండర్‌ చల్లేందుకు కూడా నిధులు ఇవ్వలేదని అన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపనకు ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్‌ శ్రీకారం చుట్టారని జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ అన్నారు. సభలో వీర మహిళ రాయలసీమ అధ్యక్షురాలు పెండ్యాల శ్రీలత, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి లలితకుమార్‌, అర్బన తహసీల్దారు హరికుమార్‌, అర్బన బ్యాంకు చైర్మన జేఎల్‌ మురళీ, టీడీపీ నాయకులు జయరాం నాయుడు, రాయల్‌ మురళి, సుధాకర్‌ నాయుడు, గంగారమ్‌, కృష్ణకుమార్‌, సరిపూటి రమణ, తెలుగుయువత నాయకులు లక్ష్మీనరసింహ పాల్గొన్నారు.

గ్రామస్థాయిలో అభివృద్ధి: శ్రావణి

పుట్లూరు: గ్రామస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తామని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. కడవకల్లులో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ గ్రామస్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమని తెలిపారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. రహదారుల మరమ్మతు సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీడీఓ యోగానందరెడ్డి, టీడీపీ నాయకులు నాగేశ్వరరెడ్డి, గోవర్ధనరాజు, వేణు, పెద్దయ్య, రాజేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మహాత్ముడి మాటలే స్ఫూర్తి: అశ్మిత

తాడిపత్రి: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న గాంధీజీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేసి చూపుతామని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అన్నారు. గన్నెవారిపల్లికాలనీ గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని అన్నారు. సీసీరోడ్లు లేని గ్రామాలను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. గన్నెవారిపల్లికాలనీలో భూగర్భ మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందుతాయని అన్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ, ఉప సర్పంచ పావని, తహసీల్దారు ఆంజనేయప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికే: వెంకటశివుడు యాదవ్‌

గుత్తి రూరల్‌: గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ అన్నారు. బసినేపల్లిలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. సీసీ రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, పొలాల రహదారికి మరమ్మతులు, విద్యుత సమస్యలపై ప్రజలు అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ, బర్దీ వలి, అధికారులు పాల్గొన్నారు.

గురుకుల సమస్యపై..

బెణెకల్లు క్రాస్‌లోని గురుకుల పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలబడుతోంది. దోమలు ప్రబలుతున్నాయి. సమస్యను పరిష్కరించి రోగాలు వ్యాపించకుండా చూడాలి.

- గంగాధర, హిందీ టీచర్‌, కణేకల్లు

చేతి పంపులు వేయించాలి

మా కాలనీలో చేతిపంపులు లేవు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. కనీసం రెండు చేతిపంపులైనా వేయించాలి. కూటమి ప్రభు త్వం మా సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తుందని భావిస్తున్నాను.

- లాలెప్ప, సంజయ్‌నగర్‌, కణేకల్లు

ఉపాధిని వ్యవసాయానికి కలపండి..

ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని రైతు ఆదిరెడ్డి అధికారులను కోరారు. పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామ సభలో రైతు పాల్గొన్నారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే రైతులకు ఆర్థికభారం తగ్గుతుందని అన్నారు. గ్రామంలో మురుగునీటి వ్యవస్థ లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నామని అధికారులకు తెలిపారు. సీసీ రోడ్లు, ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.

ఆదిరెడ్డి రైతు, చింతల చెరువు, పెద్దవడుగూరు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 24 , 2024 | 12:51 AM