STUDENT DIED: గాయపడ్డ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:47 PM
సహ విద్యార్థుల దాడిలో గాయపడిన విద్యార్థి ప్రేమ్‌సాయి మృతి చెందాడు. దీంతో బాధ్యులను కఠినంగా శిక్షించి, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, మృతుడి బంధువులు డిమాండ్ చేశారు.
కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్
హిందూపురం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సహ విద్యార్థుల దాడిలో గాయపడిన విద్యార్థి ప్రేమ్‌సాయి మృతి చెందాడు. దీంతో బాధ్యులను కఠినంగా శిక్షించి, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. హిందూపురంలోని బెంగళూరు రోడ్డులో నివాసమున్న శ్రీనివాసులు కుమారుడు ప్రేమ్‌సాయి(19) పుట్టపర్తిలోని ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉండేవాడు. ఈ నెల 13న అదే కళాశాలలో కొంతమంది విద్యార్థులు అతడిపై దాడి చేసి, గాయపరిచారు. నొప్పి తట్టుకోలేక ప్రేమ్‌సాయి అదేరోజు సాయంత్రం ఇంటికి వచ్చేశాడు. మరుసటి రోజు చెవినొప్పి అధికం కావడంతో తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే కడుపునొప్పి, చెవినొప్పి అధికం కావడంతో ఈనెల 15న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిర్వహించవద్దని అడ్డుకున్నారు. అయితే పోలీసులు వారికి నచ్చజెప్పి పోస్టుమార్టం పూర్తి చేయించారు. కానీ మృతదేహాన్ని పుట్టపర్తిలోని కళాశాల వద్దకు తీసుకెళ్లి ధర్నా చేయడానికి కుటుంబసభ్యులు, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు ప్రయత్నించారు. టూటౌన సీఐ కరీం, వనటౌన ఎస్‌ఐ శ్రీధర్ వారిని అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే వారు మృతదేహంతో నిరసన తెలిపారు. విద్యార్థి బంధువులు మాట్లాడుతూ ప్రేమ్‌సాయిపై కొంతమంది విద్యార్థులు దాడి చేసి చంపేశారని, అయినా కళాశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన విషయాన్ని కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటికి పంపడం కళాశాల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రేమ్‌సాయి మృతికి కారకులైన విద్యార్థులను శిక్షించాలని పోలీసులను కోరారు. కళాశాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.