Share News

PANCHAYATH WAR: యాడికి పంచాయతీలో వర్గపోరు

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:05 AM

యాడికి గ్రామ పంచాయతీలో సర్పంచ అనూరాధ, వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. పంచాయతీ పాలనా వ్యవహారాల్లో కొందరు వైసీపీ నాయకులు పెత్తనం చలాయిస్తూ సర్పంచును పట్టించుకోకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

PANCHAYATH WAR: యాడికి పంచాయతీలో వర్గపోరు
Sarpancha Anuradha and her husband Sriramulu with the media

ఎమ్మెల్యేని కలిసిన సర్పంచ

పార్టీ వీడతారని ప్రచారం

యాడికి, డిసెంబరు25(ఆంధ్రజ్యోతి): యాడికి గ్రామ పంచాయతీలో సర్పంచ అనూరాధ, వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. పంచాయతీ పాలనా వ్యవహారాల్లో కొందరు వైసీపీ నాయకులు పెత్తనం చలాయిస్తూ సర్పంచును పట్టించుకోకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సర్పంచ అనుమతి లేకుండా వైసీపీ నాయకులు తీర్మానాలు చేసుకొని పనులు చేసుకుంటున్నట్లు తెలిసింది. వైసీపీ నాయకుల వ్యవహారంతో విసుగు చెందిన సర్పంచ ఆ పార్టీని వీడిపోతారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యాడికి సర్పంచ అనురాధ బుధవారం తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె త్వరలోనే వైసీపీని వీడవచ్చుననే వాదనకు బలం చేకూరుతోంది.

కార్యదర్శి రాకతో ముదిరిన విభేదాలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరిగాయి. యాడికి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా అశ్వర్థనాయుడు వచ్చారు. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత పనిచేసిన కాలం కంటే సెలవులో ఉన్న రోజులే ఎక్కువగా ఉన్నాయని గ్రామ పంచాయతీ సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఆయన సర్పంచ అనురాధ కంటే వైసీపీ మండల కన్వీనర్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు ఉ న్నాయి. దీని వల్ల స ర్పంచ, వైసీపీ మండల కన్వీనర్‌కు మధ్య విభేదాలు తలెత్తినట్లు చర్చ జరుగుతోంది. పాలనాపరమైన నిర్ణయాల్లో సర్పంచు కంటే వైసీపీ మండల కన్వీనర్‌కే కార్యదర్శి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు, అందువల్లనే ఆమె వైసీపీని వీడనున్నట్లు వినిపిస్తోంది.

పంచాయతీ అభివృద్ధి కోసమే కలిశాం

గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డిని కలిశామని యాడికి సర్పంచ అనురాధ, ఆమె భర్త శ్రీరాములు మీడియా ముందు వెల్లడించారు. గ్రామ పంచాయతీలో చాలా సమస్యలు ఉండడంతో వాటన్నింటిని ఆయనకు విన్నవించామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. పంచాయతీలో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. సీసీరోడ్లు తదితర సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించామని తెలిపారు. గ్రామ పంచాయతీని బాగా అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 12:05 AM