TDP : ఆసుపత్రికి గ్రహణం వీడేనా..?
ABN , Publish Date - Jun 14 , 2024 | 11:44 PM
జిల్లా సర్వజన ఆసుత్రికి పట్టిన వైసీపీ గ్రహణం వీడుతుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా సర్వజన ఆసుపత్రి, వైద్యకళాశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్మాణాలకు రాజకీయ గ్రహణం పట్టడంతో ఐదేళ్లుగా పనులు పునాదులకే పరిమితమయ్యాయి. మరోవైపు మాతాశిశు సంరక్షణకు ఏర్పాటు చేపట్టిన ఎంసీహెచ బ్లాక్ వ్యవహారం కలగా మారిపోయింది. దీంతో రోగులకు కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ...
ఐదేళ్లుగా పునాదులకే పరిమితమైన నిర్మాణాలు
కలగా మారిన ఎంసీహెచ బ్లాక్
అభివృద్ధి పనులు అస్తవ్యస్తం
కొత్త ప్రభుత్వంతో చిగురించిన ఆశలు
అనంతపురం టౌన, జూన 14: జిల్లా సర్వజన ఆసుత్రికి పట్టిన వైసీపీ గ్రహణం వీడుతుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా సర్వజన ఆసుపత్రి, వైద్యకళాశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్మాణాలకు రాజకీయ గ్రహణం పట్టడంతో ఐదేళ్లుగా పనులు పునాదులకే పరిమితమయ్యాయి. మరోవైపు మాతాశిశు సంరక్షణకు ఏర్పాటు చేపట్టిన ఎంసీహెచ బ్లాక్ వ్యవహారం కలగా మారిపోయింది. దీంతో రోగులకు కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పనులకు పట్టిన గ్రహణం వీడి కష్టాలు తీరుతాయన్న ఆశలు ప్రజల్లో చిగురిస్తున్నాయి. జిల్లా పాలకులు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంతైనా ఉంది.
కలగా మారిన ఎంసీహెచ బ్లాక్
ఎన్ని ఆరోగ్య పథకాలు పెట్టినా, ఆసుత్రులలో వసతులు పెంచుతున్నా ప్రసవాలకు వచ్చే సమయంలో మాతాశిశుమరణాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా జిల్లా సర్వజన ఆసుపత్రికి పెద్దఎత్తున గర్బిణీలు ప్రసవాలకు వస్తున్నారు. ప్రతిరోజూ 20 నుంచి 30 ప్రసవాలు ఇక్కడ జరుగుతున్నాయి. కానీ ఆ మేరకు పడకలు లేవు. దీంతో ఒక్కో పడకపై ఇద్దరు, రెండు మంచాలపై ముగ్గురు బాలింతలను ఉంచాల్సిన దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో బాలింతలు, నవజాత శిశువులు పడేకష్టాలు వర్ణణాతీతం. ఈ నేపథ్యంలో 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఆసుపత్రిలో ప్రత్యేకంగా మాతాశిశు సంరక్షణ విభాగం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసింది. అందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసికెళ్లి రూ.300 కోట్లతో ఎంసీహెచ బ్లాక్‌తోపాటు సర్జరీ విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రాగా నిధులు కేటాయించడం ఆలస్యం కావడంతో రెండేళ్ల తర్వాత మొదలు పెట్టారు. ఇరిగేషన కార్యాలయం, ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యాలయం ఆసుపత్రి స్థలం కావడంతో అక్కడ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇరిగేషన కార్యాలయాన్ని ఖాళీ చేయించి అక్కడ సర్జరీ విభాగం పనులు మొదలు పెట్టినా ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వక పోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు ఎంసీహెచబ్లాక్ నిర్మాణం చేట్టాల్సిన ఆర్‌అండ్‌బీ భవనాన్ని మూడేళ్లయినా ఇప్పటికీ ఖాళీ చేయలేదు. దీంతో ఎంసీహెచబ్లాక్ నిర్మాణం ఓ కలగా మారిపోయింది. టీడీపీ అధికారంలోకి రావడంతో ఎంసీహెచబ్లాక్ నిర్మాణం పూర్తవుతుందని ఆశలు కలుగుతున్నాయి.
వైద్యకళాశాల పనులకు గ్రహణం
జిల్లా వైద్యకళాశాలలోను వసతులు కల్పించడం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం దాదాపు రూ.30 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో వైద్యకళాశాల విద్యార్థుల కోసం హాస్టల్ భవనాలు, డాక్టర్లు, వైద్యవిద్యార్థుల కోసం ప్రత్యేకంగా లైబ్రరీ, లెక్చరర్స్ గ్యాలరీ, ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ఆసుపత్రి ఆవరణంలోని ఆప్తమాలజీ విభాగం వద్ద ఉన్న బయలు స్థలంలో జీ ప్లస్ టు అంతస్థులు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2018లో ఆనలైనలో టెండర్ పిలవగా హైదరాబాద్‌కు చెందిన బృందా కనస్ట్రక్షన సంస్థ పనులను దక్కించుకుంది. ఆ సంస్థ ఇక్కడ పనులు మొదలు పెట్టి పునాదులు వరకు పిల్లర్స్ వేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 శాతం లోపు పనులు ఉంటే ఆపేయాలని ఆదేశాలు ఇవ్వగా ఇక్కడ పనులు ఆగిపోయాయి. మూడేళ్ల తర్వాత పనులు పూర్తి చేయాలని బృందా కనస్ట్రక్షనను ప్రభుత్వం ఆదేశించింది. పనులు చేపడితే తమకు నష్టం వస్తుందని, తాము చేయలేమని సంస్థ చేతులేత్తేసింది. ప్రభుత్వం కోర్టుకు వెళ్లినా కాంట్రాక్ట్ సంస్థకే అనుకూలంగా తీర్పు రావడంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి. నిర్మించిన పనులు వర్షానికి నానుతూ ఎండలకు ఎండుతూ దెబ్బతింటున్నాయి. ఇక వైద్య విద్యార్థుల కోసం నిర్మిస్తున్న హాస్టల్ పనులు సైతం మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా ఆసుపత్రి, వైద్యకళాశాలలో ఆగిపోయిన పనులుకు టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయించేందుకు కృషిచేయాలని అనంత జనం కోరుతున్నారు.
మళ్లీ టెండర్ చేపడుతున్నాం
బృందా కనస్ట్రక్షన కాంట్రాక్ట్ సంస్థ ఆ పనుల నుంచి పూర్తిగా తప్పుకుంది. ఇప్పటివరకు కోర్టులో కేసు నడుస్తుండగా ఏ నిర్ణయం తీసుకోలేక పోయాం. ఇపుడు కోర్టు వ్యవహారం తెగిపోవడంతో ఆ పనులకు మళ్లీ టెండర్లు పిలవాలని రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం నిర్ణయం మేరకు భవిష్యత్తులో పనులు మొదలు పెడతాం. ఎంసీహెచబ్లాక్ ఏర్పాటు విషయంలో కూడా ఆర్‌అండ్‌బీ ఖాళీ చేయకపోవడం వల్లనే పనులు మొదలు పెట్టలేకపోయాం. ఇపుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
-మహబూబ్ బాషా, ఈఈ, ఏపీఎంఐసీడీ
మరిన్ని అనంతపురం వార్తల కోసం..