TDP: టీడీపీ బలంగా ఉన్న కేంద్రాల్లో వైసీపీ కుట్ర
ABN , Publish Date - May 14 , 2024 | 12:59 AM
టీడీపీ బలంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో గొడవలు సృష్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్
ఉరవకొండ, మే 13: టీడీపీ బలంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో గొడవలు సృష్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. పోలింగ్ సరళిని కార్యకర్తలను, నాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయన్నారు. ఆ కేంద్రాల్లో అదనంగా సమయం ఇవ్వాలని కోరారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు లేక గుర్తులు కనబడలేదన్నారు.
టీడీపీకి అనుకూలంగా ఉన్న కేంద్రాల్లో గొడవలు సృష్టించడానికి వైసీపీ నేతల ఆధ్వర్యంలో కుట్రలకు తెరలేపారని విమర్శించారు. పోలీసుల దృష్టికి ఈ చర్యలను తీసుకెళ్లామన్నారు. 30వేల ఓటర్లు ఉన్న ఉరవకొండలో కేవలం పోలింగ్ స్టేషన్ల వద్ద ఒకరిద్దరుతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. ఉరవకొండలో ప్రశాంతంగా ఎన్నికలు సజావుగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.