Share News

DEO OFFICE : అవునా..? విచారిస్తాం..!

ABN , Publish Date - May 28 , 2024 | 11:35 PM

విద్యాశాఖ పరిధిలో ఎవరు ఏ తప్పు చేసినా ఆ శాఖ జిల్లా అధికారులు ‘దయ’ చూపుతున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినా, ఫిర్యాదులు వచ్చినా ‘విచారణ’ పేరిట కాలయాపన చేస్తూ.. తప్పులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక జరిగిన అనేక సంఘటనలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వందలాది మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పీడీలు అనంతపురం నగర శివారులోని ఓ డాబాలో విందు రాజకీయం చేశారు. ఏపీటీఎఫ్‌ నాయకులు రాజేంద్ర స్కూల్‌లో సమావేశయ్యారు. ఉల్లంఘనలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. తూతూ మంత్రపు వివరణలు తీసుకుని సరిపెట్టారు...

DEO OFFICE :  అవునా..? విచారిస్తాం..!
Orders issued for inquiry by HM

ఇదీ.. జిల్లా విద్యాశాఖ తీరు

ఎవరు ఏ తప్పు చేసినా చర్యలు ఉండవు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా అంతే..!

అనంతపురం విద్య, మే 28: విద్యాశాఖ పరిధిలో ఎవరు ఏ తప్పు చేసినా ఆ శాఖ జిల్లా అధికారులు ‘దయ’ చూపుతున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినా, ఫిర్యాదులు వచ్చినా ‘విచారణ’ పేరిట కాలయాపన చేస్తూ.. తప్పులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక జరిగిన అనేక సంఘటనలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వందలాది మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పీడీలు అనంతపురం నగర శివారులోని ఓ డాబాలో విందు రాజకీయం చేశారు. ఏపీటీఎఫ్‌ నాయకులు రాజేంద్ర స్కూల్‌లో సమావేశయ్యారు. ఉల్లంఘనలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. తూతూ మంత్రపు వివరణలు తీసుకుని సరిపెట్టారు.


ఉపాధ్యాయులు, సంఘాల నాయకుల చేత పేపర్లపై రాయించుకుని వదిలేశారు. తాజాగా ఓ టీచర్‌ ఎన్నికల విధులకు డుమ్మా కొట్టారని ఫిర్యాదులు వెళ్లారు. దీంతో విచారణకు ఆదేశించారు. ఇంతకు మించి ఎలాంటి చర్యలు ఉండవని, గాలికి వదిలేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఏమీ పట్టదా..?

శింగనమల మండలంలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయనికి ఎన్నికల విధులు కేటాయించారు. రాప్తాడు నియోజవకర్గంలోని పోలింగ్‌ స్టేషన 206/155కు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా నియమించారు. అయితే ఆమె విధులకు గైర్హాజరయ్యారని రిటర్నింగ్‌ ఆఫీసర్‌, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో డీఈఓ వరలక్ష్మి విచారణకు ఆదేశించారు. అనంతపురం డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులును విచారణ అధికారిగా నియమించారు. అయితే విచారణ దిశగా ఇంత వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడినట్లు కనిపించడం లేదు.


తొక్కి పెట్టేశారు..

- నగర శివారులోని ఓ డాబాలో కొందరు టీచర్లు వైసీపీకి మద్దతుగా రాజకీయ విందు నిర్వహించారు. వైసీపీకి ఓట్లు వేయాలని ప్రలోభ పెట్టారు. వైసీపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం, మరో సంఘం నాయకులు, అనంతపురం రూరల్‌ మండలంలోని పలువురు ఉపాధ్యాయులు ముందుండి ఈ విందు రాజకీయం నడిపించారు. కొందరు సమగ్రశిక్ష ఉద్యోగులు కూడా విందులో పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. దీనిపై పారదర్శకంగా విచారించాల్సిన అధికారులు.. లీకేజీలకు పాల్పడ్డారు. వైసీపీ అనుకూలురు, రెడ్డి సామాజికవర్గం ఉపాధ్యాయులను వెంట తీసుకెళ్లి విచారించారు. ఇలా చేస్తే వాస్తవాలు ఎలా బయటపడతాయి..? విందు రాజకీయంపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు.

- ఎన్నికోడ్‌ ఉండగానే ఏపీటీఎఫ్‌ నాయకులు అనంతపురం నగరంలోని రాజేంద్ర స్కూల్‌లో సమావేశమయ్యారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ సంఘం రాష్ట్ర నాయకుడు కులశేఖర్‌రెడ్డి, జిల్లానాయకుడు శ్రీనివాసులురెడ్డిపై ఎన్నికల కమిషనకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కులశేఖర్‌రెడ్డిని డీఈఓ వరలక్ష్మి తన కార్యాలయానికి పిలిపించుకుని, వివరణ రాయించుకుని పంపించేశారు. ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదు. ఈ రెండు ఘటనల్లోనూ జిల్లా విద్యాశాఖ అధికారులు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేదు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 28 , 2024 | 11:35 PM